టైటిల్ : మల్లేశం
జానర్ : బయోపిక్
నటీనటులు : అనన్య, ఝాన్సీ, చక్రపాణి తదితరులు
సంగీతం : మార్క్ కె.రాబిన్
దర్శకత్వం : రాజ్ ఆర్
నిర్మాత : రాజ్ ఆర్, శ్రీ అధికారి
అన్నివేళలా వెండితెరపై బయోపిక్స్ మెరిసిపోతాయా అంటే చెప్పలేము.. అందుకు చాలా కారణాలుంటాయి. వారి జీవితంలో పడిన సంఘర్షణ, వాటిని తెరపై ఆసక్తిగొల్పేలా, గుండెకు హత్తుకునేలా తెరకెక్కించినప్పుడే ప్రేక్షకులు వాటిని ఆదరిస్తారు. చేనేత రంగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సాధించు కున్న చింతకింది మల్లేశం.. జీవితచరిత్రను ‘మల్లేశం’ గా రూపొందించారు. ఇప్పటివరకు కామెడీ పాత్రలను, హీరో ఫ్రెండ్ పాత్రలను చేస్తూ వచ్చిన ప్రియదర్శి.. మొదటిసారి మల్లేశం పాత్రలో హీరోగా నటించాడు. మరి ‘మల్లేశం’ ప్రియదర్శికి కలిసివచ్చిందా? అసలు మల్లేశం కథేంటో చూద్దాం.
కథ :
ఈ సినిమా 1980-1990ల మధ్య కాలం జరుగుతుంది. నల్గొండ జిల్లాలోని ఓ కుగ్రామం. ఆ గ్రామస్తుల్లో మల్లేశం కుటుంబం నేతపని చేస్తూ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఇంకా ఆ గ్రామంలో చాలా మంది ఇదే వృత్తిలో జీవనం సాగిస్తూ అప్పుల్లో కూరుకుపోతారు. అయితే మల్లేశం చిన్నతనం నుంచి అమ్మ లక్ష్మీ (ఝాన్సీ) ఆసు పనిచేయడంతో చేయి నొప్పిలేస్తుంటుంది. భుజం కూడా పడిపోయేస్థితికి వస్తుంది. ఆ ఊర్లో చాలా మందిది అదే పరిస్థితి. అమ్మ పడే కష్టాలు ఎలాగైనా దూరం చేయాలని చిన్నప్పటీ నుంచే ఏదో ఒకటి ప్రయత్నిస్తుంటారు. మల్లేశం పెద్దయ్యాక ఒక్కొక్క ఆలోచనతో ఆసుయంత్రం వైపు అడుగులు వేస్తాడు. ఆ యంత్రాన్ని తయారుచేయడానికి ఊర్లో అప్పులు చేస్తాడు. ఆసు యంత్రం చేస్తున్న మల్లేశంను ఊర్లో అందరూ ఎగతాళి చేస్తారు. పిచ్చొడు అంటూ గెలీచేస్తారు.
ఇలాగే మల్లేశంను వదిలేస్తే.. నిజంగానే పిచ్చొడు అయిపోతాడేమో అని తల్లిదండ్రులు భయపడి పెళ్లి చేస్తే అయినా బాగుపడతాడని భావిస్తారు. ముందు పెళ్లి వద్దని వారించినా.. తను ప్రేమిస్తున్న మరదలు పద్మ(అనన్య) పెళ్లి కూతురు అనే సరికి మల్లేశం పెళ్లికి ఒప్పుకుంటాడు. ఇక పెళ్లి అయినాసరే ఆసుయంత్రం తయారు చేయాలన్న ప్రయత్నాలను కొనసాగిస్తాడు. పద్మ కూడా ఆసుయంత్రం చేయమని ప్రోత్సహిస్తుంది. అయితే ఓసారి ఆసుయంత్రాన్ని పరీక్షించబోతే మోటార్ పేలిపోతుంది. ఇక ఆ విషయం తెలిసి అప్పులోల్లు అందరూ ఇంటి మీదకు వస్తారు. ఈ విషయంపై మొదటిసారి మల్లేశం అమ్మ కూడా మందలిస్తుంది. అయినా సరే ఆసుయంత్రం చేయాల్సిందేనని, అందుకు డబ్బు కావాలని భార్య పద్మను గాజులు, నగలు ఇవ్వమని అడుగుతాడు. అవి తన పుట్టింటి వారు ఇచ్చినవి, తనకు ఇవొక్కటే మిగిలాయని అంటుంది. మాటామాటా పెరిగి గొడవ పెద్దదవుతుంది. ఇంట్లో నుంచి వెళ్లిపోయిన మల్లేశం.. అప్పుల బాధలు తట్టుకోలేక, తల్లి కూడా మందలించడం, భార్య కూడా సాయం చేయకపోవడంతో ఆత్మహత్యయత్నం చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? మల్లేశం అసలు ఆసు యంత్రాన్ని ఎలా తయారుచేశాడు? అనేది మిగతా కథ
నటీనటులు :
గాలిపటం ఎగరడానికి దారం ఎంత అవసరమో.. కథను నడిపించడానికి నటీనటులు అంత అవసరం. తమ నటనతో ప్రేక్షకులను కూడా పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేయించాలి. అలాంటి నటులే ఈ సినిమాకు దొరికారు. మల్లేశం పాత్రలో ప్రియదర్శి.. పద్మ పాత్రలో అనన్య.. లక్ష్మీ పాత్రలో ఝాన్సీ.. ఎవరికి వారే అన్నట్లు పోటాపోటీగా నటించారు. ఝాన్సీ తన అనుభవంతో మెప్పిస్తే.. ప్రియదర్శి, అనన్య మాత్రం ప్రేక్షకులను కట్టిపడేశారు. ఇంతవరకు నవ్వించడమే మాత్రమే ప్రియదర్శికి.. తెలుసు అనుకున్న ప్రేక్షకుడి చేత కంటతడిపెట్టిస్తాడు. మల్లేశంకు అవమానాలు ఎదురైతే ప్రేక్షకుడికి కోపం వచ్చేంతలా ఆ పాత్రలో ఒదిగిపోయాడు ప్రియదర్శి. తన నటనకు వంకపెట్టకుండా మల్లేశం పాత్రకు న్యాయం చేశాడు. ఇక అనన్య అయితే కళ్లతోనే ఎన్నో భావాలను పలకించింది. ఆటపట్టించే భార్యగా, ఆటుపోట్లలో తోడుగా నిలిచే ఇల్లాలిగా అందర్నీ మెప్పిస్తుంది. వెండితెరపై అందగానే కనబడటమే కాకుండా, తన హావాభావాలతోనూ పద్మ పాత్రను గుర్తుండేలా చేసింది. ఇక మిగతా నటీనటులు తమ పాత్ర పరిది మేరకు మెప్పించారు.
విశ్లేషణ :
బయోపిక్ తీయడం అంటేనే కత్తిమీద సాము. ఎన్నో ఆంక్షల మధ్య తీయాల్సి వస్తుంది. పైగా ఆ కథను నడిపించేవాడు సరిగ్గా ఉండాలి. కథకు తగ్గ నటీనటులను ఎంపిక చేసుకోవడంలోనే మొదటి విజయం ఉంటుంది. అందులోనే మల్లేశం దర్శకుడు రాజ్ ఆర్ ప్రతిభ కనపడుతుంది. మొదటిసారి పూర్తిగా తెలంగాణ నేతన్నల సమాజాన్ని తెరపై ఆవిష్కరించాడు. తెలంగాణ యాస అంటే కేవలం నవ్వించిడమే కాదు.. ఏడిస్తుంది, దానికి కూడా అన్ని రకాల భావోద్వేగాలు ఉంటాయని చూపించాడు. చిన్నతనం నుంచే అమ్మ కష్టాలను దూరం చేయాలని ఆలోచన నుంచి.. ఆసు యంత్రం కనిపేట్టే వరకు మల్లేశం జీవితంలో జరిగిన అంతర్మథనం, పడిన కష్టాలు అన్నింటిని ఒక సినిమాలో చూపించడం అసాధ్యం. అయినా దర్శకుడు ఈ విషయంలో సక్సెస్ అయ్యాడు.
అప్పుల బాధలు తట్టుకోలేక, ఇంట్లో చీరలు నేయడం మానేసి హైదరాబాద్‌కు వచ్చి జీవనం సాగిస్తాడు మల్లేశం. ఊరి మనుషులు, అక్కడి వాతావరణం తప్ప ఇంకోటి తెలియని మల్లేశం అక్కడ ఎలా జీవనం సాగించాడనే విషయాలు బాగా చూపించాడు. కనీసం పూలు అమ్మడం కూడా రాని మల్లేశంను చూస్తే నవ్వొచ్చినా.. ఆ తరువాత జాలేసేలా చూపించాడు దర్శకుడు. థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుడిని మల్లేశంతో పాటే ప్రయాణించేలా చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. అయితే కమర్షియల్ చిత్రాలకు అలవాటుపడ్డ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఏ మేరకు స్వీకరిస్తారో చూడాలి. మార్క కె రాబిన్ అందించిన సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. పాటలు సన్నివేశానికి తగ్గట్టుగా వచ్చి వెళ్లిపోతూ ఉంటాయి. అప్పటి పల్లెవాతావరణాన్ని తెరపై సినిమాటోగ్రఫర్ అందంగా చూపించాడు. మల్లేశం జీవితాన్ని గుండెకు హత్తుకునేలా చూపించేందుకు ఎడిటర్ కాస్త ఎక్కువ సమయమే తీసుకున్నాడు. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టు ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
కథ
నటీనటులు
దర్శకత్వం
మైనస్ పాయింట్స్
స్లో నెరేషన్
బండ కళ్యాణ్, సాక్షి వెబ్ డెస్క్.
Comments
Please login to add a commentAdd a comment