రాజ్, కేటీఆర్, ప్రియదర్శి
‘‘ఇంగ్లీష్‌లో నెసెసిటీ ఈజ్ మదర్ ఆఫ్ ఇన్వెన్షన్’ అనే సామెత ఉంది. కానీ ఈ సినిమాలో ‘మదర్ ఈజ్ నెసెసిటీ ఆఫ్ ఇన్వెన్షన్’ అని చూపించారు. ఎందుకంటే మల్లేశం గారు తన తల్లి కష్టాన్ని చూసి, తన తల్లి సమస్యతో పాటు ఎంతోమంది తల్లుల సమస్యలను తొలగించారు. ఎంతో మంది యంగ్ ఇన్నోవేటర్స్‌కు ఇన్‌స్పిరేషన్ ఇచ్చేలా ఈ చిత్రాన్ని రూపొందించారు’’ అన్నారు తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పద్మశ్రీ చింతకింది మల్లేశం జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మల్లేశం’. రాజ్ దర్శకత్వంలో శ్రీ అధికారి, రాజ్. ఆర్ నిర్మించారు.
మల్లేశం పాత్రలో ప్రియదర్శి నటించిన ఈ చిత్రం జూన్ 21న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని శనివారం పలువురు సినీ, రాజకీయ రంగ ప్రముఖులకు కోసం ప్రదర్శించారు. సినిమా చూసిన తర్వాత కేటీఆర్ మాట్లాడుతూ– ‘‘సముద్ర గర్భంలో దాగిన బడబాగ్నులెన్నో, సమాజంలో అజ్ఞాత సూర్యులెందరో, గాయపడిన కవి గుండెల్లో రాయబడని కవితలెన్నో అనే ఓ కవిత సినిమాలోని ఎమోషన్‌ని రెండు గంటలపాటు క్యారీ చేసింది. మనం వెళ్లే దారిలో దారులన్నీ మూసి ఉన్నా ఏదో దారి తెరుచుకుని ఉంటుందనే విషయాన్ని వివరించిందీ చిత్రం.
చేనేత కార్మికుల నైపుణ్యానికి పెద్దపీట వేస్తూ వారి కష్ట నష్టాలను ఈ సినిమాలో చూపించారు. ప్రియదర్శి అద్భుతంగా నటించారు. తెలంగాణ యాసను, భాషలోని మాధుర్యాన్ని రైటర్ అశోక్‌కుమార్ చక్కగా రాశారు. ఈ సినిమాకు ప్రభుత్వం నుండి సహకారం అందించాలని గౌరవ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగారితో, గౌరవ ముఖ్యమంత్రిగారితో మాట్లాడతాను. అది ట్యాక్స్ ఎగ్జంప్షన్ అయినా, మరేదైనా నా వంతుగా ఏదైనా చేయడానికి ప్రయత్నిస్తా. ప్రతి సోమవారం చేనేత వస్త్రాలనే ధరించాలి. చేనేత కార్మిలకు అండగా నిలబడాలనే నినాదంతో యువత ముందుకు అడుగులు వెయ్యాలి’’ అన్నారు. డి. సురేశ్‌బాబు, బి. నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment