సంఘటిత శక్తితోనే బలోపేతం
‘యాదవుల అలయ్– బలయ్’లో ఏపీ మండలి చైర్మన్ చక్రపాణి
సాక్షి, హైదరాబాద్: సమాజానికి యాదవ సంఘం దిక్సూచీలాగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ ఎ.చక్రపాణి అన్నారు. ఆదివారం హైదరాబాద్ రవీంద్ర భారతిలో యాదవుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ‘యాదవుల అలయ్-బలయ్’కార్యక్రమం జరిగింది. యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్య క్షుడు మేకల రాములు యాదవ్ అధ్యక్షత న జరిగిన సభకు ముఖ్య అతిథిగా హాజరైన చక్రపాణి..కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రసంగించారు. సంఘటిత శక్తితోనే సంఘాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. యాదవుల్లో ఎవరైనా ఎదుగు తున్నారంటే వారి ని గౌరవించాలని ఉమ్మడి తెలుగు రాష్ట్రాల సమాచార హక్కు చట్టం కమిషనర్ వర్రె వెంకటేశ్వర్లు యాదవ్ అన్నారు. ఆర్టీఐ-2005 యాక్ట్ సామాన్యులకు ఎంతో బలాన్ని, అధికారాన్ని ఇచ్చిందని, పాలనలో పారదర్శ కతకు ఇది దోహదపడుతుందన్నారు.
వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లును ప్రవేశ పెట్టి చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేష న్లు కల్పించాలని టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. యాదవులందరం కలసికట్టుగా ముందుకుసాగి రాజకీయంగా అభివృద్ధి చెందాల్సిన ఆవశ్యకత ఉందని షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సి.కృష్ణ యాదవ్, తమిళనాడు రాష్ట్ర సమాజ్‌వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బి.ఆర్.దామోదరన్ యాదవ్, సినీ నటి కరాటే కళ్యాణి యాదవ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ కృష్ణ, యాదవ్ సంఘం ఏపీ నాయకులు రామయ్య యాదవ్, ఎంఎం కొండయ్య యాదవ్, తెలంగాణ కాంగ్రెస్‌పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్, టీఆర్‌ఎస్ నాయకులు బడుగుల లింగయ్య తదితరులు పాల్గొన్నారు.