తెలంగాణ బీసీల్లో ముదిరాజ్‌లే టాప్‌.. త‌ర్వాత ఎవ‌రంటే? | Telangana Caste Census: Mudiraj community top in BCs | Sakshi
Sakshi News home page

Mudiraj: తెలంగాణ బీసీల్లో ముదిరాజ్‌లే టాప్‌

Published Wed, Feb 5 2025 5:26 PM | Last Updated on Wed, Feb 5 2025 5:57 PM

Telangana Caste Census: Mudiraj community top in BCs

26 లక్షలకుపైగా జనాభాతో అగ్రస్థానం..

తాజా కులగణనలో వెల్లడైన ప్రధాన కులాల గణాంకాలు!

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలోని బలహీనవర్గాల జాబితాలో మొదటి నుంచి అంచనా వేస్తున్న విధంగానే ముదిరాజ్‌లదే అగ్రస్థానమని వెల్లడైంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 26 లక్షల మందికి పైగా ముదిరాజ్‌ (Mudiraj) కులస్తులు ఉన్నారని కులగణన సర్వేలో స్పష్టమైంది. ఆ తర్వాతి స్థానంలో యాదవులున్నారని, వీరి జనాభా 20 లక్షల కంటే ఎక్కువ ఉందని తేలినట్టు సమాచారం. అలాగే తెలంగాణలో గౌడ కులస్తుల జనాభా కూడా గణనీయంగా ఉందని, వారు 16 లక్షలకు పైగా ఉన్నట్టు సర్వేలో వెల్లడైంది. ఆ తర్వాత నాలుగో స్థానంలో మున్నూరుకాపులు (Munnuru Kapu) ఉండగా, వారి జనాభా 13.70 లక్షలకు పైగా ఉన్నట్టు తేలింది. 5వ స్థానంలో 12 లక్షలకు పైగా జనాభాతో పద్మశాలీలున్నారని తాజా సర్వేలో వెల్లడైనట్టు తెలిసింది.

తెలంగాణలో మొత్తం 1.60 కోట్ల మంది బీసీలున్నారని తాజా సర్వేలో తేలగా, ఈ ఐదు కులాలు కలిపి మొత్తం బీసీ జనాభాలో (BC Population) సగం మంది కంటే ఎక్కువ ఉ న్నారని సర్వే వెల్లడించింది. ఇక అగ్రవర్ణాల విషయానికి వస్తే రెడ్ల జనాభా 17 లక్షల కంటే ఎక్కువే ఉందని సర్వేలో తేలినట్టు సమాచారం. అయితే, ఈ లెక్కలను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించకపోవడం గమనార్హం.

దేశవ్యాప్తంగా కుల సర్వే చేపట్టండి 
కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం 
వివిధ కులాల జనాభా స్థితిగతులను అర్థం చేసుకునేందుకు తెలంగాణలో నిర్వహించిన మాదిరిగానే దేశవ్యాప్తంగా ఇంటింటి సమగ్ర సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్య రాజకీయ, కుల సర్వే నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ రాష్ట్ర శాసససభ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. మంగళవారం రాత్రి అసెంబ్లీలో ఈ తీర్మానాన్ని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రవేశపెట్టగా, సభ ఆమోదం తెలిపినట్టు స్పీకర్‌ ప్రకటించారు.

‘తెలంగాణ ప్రభుత్వం సమగ్ర కుల సర్వేలో భాగంగా రాష్ట్రంలోని వివిధ కులాల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ స్థితిగతులను వెలుగులోకి తెచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని వెనుకబడిన తరగతులు (బీసీ), షెడ్యూల్డ్‌ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్‌ తెగలు (ఎస్టీ), ఇతర బలహీన వర్గాల అభివృద్ధి కి కట్టుబడి ఉంది. వివిధ కులాల మధ్య నెలకొన్న అసమానతలను తగ్గించడానికి అనుకూల విధానాలు, అఫర్మెటివ్‌ పాలసీలను రూపొందించడానికి తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది’అని తీర్మానంలో పేర్కొన్నారు.  

సర్వే సరే.. ఇప్పుడేం చేస్తారు?: కూనంనేని 
సమగ్ర కులగణన సర్వే చేపట్టడం హర్షణీయమని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. అయితే ఈ నివేదిక తర్వాత బీసీలకు జరిగే ప్రయోజనం ఏమిటో చెప్పాలని కోరారు. దీనివల్ల పెద్దగా ఉపాధి అవకాశాలు ఉంటాయని తాను భావించడం లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలే లేవని, ఉన్నవి కూడా కాంట్రాక్టు ఉద్యోగాలని, ఇందులో రిజ్వేషన్లు పాటించేందుకు అవకాశమే లేదని చెప్పారు. గతంలో నిర్వహించిన సమగ్ర సర్వేపై శాస్త్రీయత సందేహాలకు తావిస్తోందన్నారు. ప్రస్తుత సర్వేపై అనుమానాలుంటే, గ్రామసభల్లో పెట్టి, ఇంకెవరినైనా చేర్చాల్సి ఉంటే చేర్చమని సూచించారు. నివేదిక ద్వారా బీసీల ఆర్థిక స్థితిగతులు ఏ విధంగా మార్చబోతున్నారో, ఎలాంటి ప్రణాళికలు రూపొందిస్తారో చెప్పాలని కోరారు.    

సర్వే వివరాలు బయటపెట్టకుండా చర్చ ఏంటి? 
సమగ్ర సర్వేకు సంబంధించిన వివరాలు సభ్యులకు ఇవ్వకుండా సభలో చర్చఎలా నిర్వహిస్తారని మండలిలో ప్రతిపక్ష నేత మధసూదనాచారి ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వ నిర్ణయం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని తెలిపారు. దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం సరికాదని అన్నారు. ప్రకటనలు ప్రవేశపెట్టేందుకు అసెంబ్లీ వేదిక కాదని, కనీసం లోతైన చర్చ కూడా జరపకపోవడం దారుణమని ఆగ్ర హం వ్యక్తంచేశారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సర్వేలో అన్ని వర్గాల జనాభా తగ్గిందని, ఓసీల జనాభాను మాత్రం భారీగా పెంచి చూపించారని ఆరోపించారు.  

చ‌ద‌వండి: 59 కులాలు, 3 గ్రూపులు

బీసీలకు 42% రిజర్వేషన్‌ ఇవ్వండి: బండ ప్రకాశ్‌ 
గత ప్రభుత్వం చేసిన సమగ్ర సర్వే వివరాలు ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ వైబ్‌సైట్‌లో ఉన్నాయని మండలి డిప్యూటీ చైర్మన్‌ బండ ప్రకాశ్‌ తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీకి అనుగుణంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తూ ఆర్డినెన్స్‌ జారీ చేయాలని కోరారు. అందుకు సభ్యులు కూడా మద్దతుగా నిలుస్తారని తెలిపారు. సర్వే విషయంలో ప్రభుత్వం నుంచి సమాచారం అందకపోవడం, స్పష్టత లేకుండా సభ నిర్వహించడంపై నిరసన వ్యక్తం చేస్తూ బీఆర్‌ఎస్‌ సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు. ఆ తర్వాత ఎస్సీ వర్గీకరణ చర్చలో పాల్గొన్నారు. సమగ్ర కుటుంబ సర్వే, ఎస్సీ వర్గీకరణపై సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీర్మానాలు ప్రవేశపెట్టగా సభ్యులు ఆమోదం తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement