Mudiraj caste
-
తెలంగాణ బీసీల్లో ముదిరాజ్‌లే టాప్.. తర్వాత ఎవరంటే?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని బలహీనవర్గాల జాబితాలో మొదటి నుంచి అంచనా వేస్తున్న విధంగానే ముదిరాజ్లదే అగ్రస్థానమని వెల్లడైంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 26 లక్షల మందికి పైగా ముదిరాజ్ (Mudiraj) కులస్తులు ఉన్నారని కులగణన సర్వేలో స్పష్టమైంది. ఆ తర్వాతి స్థానంలో యాదవులున్నారని, వీరి జనాభా 20 లక్షల కంటే ఎక్కువ ఉందని తేలినట్టు సమాచారం. అలాగే తెలంగాణలో గౌడ కులస్తుల జనాభా కూడా గణనీయంగా ఉందని, వారు 16 లక్షలకు పైగా ఉన్నట్టు సర్వేలో వెల్లడైంది. ఆ తర్వాత నాలుగో స్థానంలో మున్నూరుకాపులు (Munnuru Kapu) ఉండగా, వారి జనాభా 13.70 లక్షలకు పైగా ఉన్నట్టు తేలింది. 5వ స్థానంలో 12 లక్షలకు పైగా జనాభాతో పద్మశాలీలున్నారని తాజా సర్వేలో వెల్లడైనట్టు తెలిసింది.తెలంగాణలో మొత్తం 1.60 కోట్ల మంది బీసీలున్నారని తాజా సర్వేలో తేలగా, ఈ ఐదు కులాలు కలిపి మొత్తం బీసీ జనాభాలో (BC Population) సగం మంది కంటే ఎక్కువ ఉ న్నారని సర్వే వెల్లడించింది. ఇక అగ్రవర్ణాల విషయానికి వస్తే రెడ్ల జనాభా 17 లక్షల కంటే ఎక్కువే ఉందని సర్వేలో తేలినట్టు సమాచారం. అయితే, ఈ లెక్కలను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించకపోవడం గమనార్హం.దేశవ్యాప్తంగా కుల సర్వే చేపట్టండి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం వివిధ కులాల జనాభా స్థితిగతులను అర్థం చేసుకునేందుకు తెలంగాణలో నిర్వహించిన మాదిరిగానే దేశవ్యాప్తంగా ఇంటింటి సమగ్ర సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్య రాజకీయ, కుల సర్వే నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ రాష్ట్ర శాసససభ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. మంగళవారం రాత్రి అసెంబ్లీలో ఈ తీర్మానాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టగా, సభ ఆమోదం తెలిపినట్టు స్పీకర్ ప్రకటించారు.‘తెలంగాణ ప్రభుత్వం సమగ్ర కుల సర్వేలో భాగంగా రాష్ట్రంలోని వివిధ కులాల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ స్థితిగతులను వెలుగులోకి తెచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని వెనుకబడిన తరగతులు (బీసీ), షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ), ఇతర బలహీన వర్గాల అభివృద్ధి కి కట్టుబడి ఉంది. వివిధ కులాల మధ్య నెలకొన్న అసమానతలను తగ్గించడానికి అనుకూల విధానాలు, అఫర్మెటివ్ పాలసీలను రూపొందించడానికి తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది’అని తీర్మానంలో పేర్కొన్నారు. సర్వే సరే.. ఇప్పుడేం చేస్తారు?: కూనంనేని సమగ్ర కులగణన సర్వే చేపట్టడం హర్షణీయమని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. అయితే ఈ నివేదిక తర్వాత బీసీలకు జరిగే ప్రయోజనం ఏమిటో చెప్పాలని కోరారు. దీనివల్ల పెద్దగా ఉపాధి అవకాశాలు ఉంటాయని తాను భావించడం లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలే లేవని, ఉన్నవి కూడా కాంట్రాక్టు ఉద్యోగాలని, ఇందులో రిజ్వేషన్లు పాటించేందుకు అవకాశమే లేదని చెప్పారు. గతంలో నిర్వహించిన సమగ్ర సర్వేపై శాస్త్రీయత సందేహాలకు తావిస్తోందన్నారు. ప్రస్తుత సర్వేపై అనుమానాలుంటే, గ్రామసభల్లో పెట్టి, ఇంకెవరినైనా చేర్చాల్సి ఉంటే చేర్చమని సూచించారు. నివేదిక ద్వారా బీసీల ఆర్థిక స్థితిగతులు ఏ విధంగా మార్చబోతున్నారో, ఎలాంటి ప్రణాళికలు రూపొందిస్తారో చెప్పాలని కోరారు. సర్వే వివరాలు బయటపెట్టకుండా చర్చ ఏంటి? సమగ్ర సర్వేకు సంబంధించిన వివరాలు సభ్యులకు ఇవ్వకుండా సభలో చర్చఎలా నిర్వహిస్తారని మండలిలో ప్రతిపక్ష నేత మధసూదనాచారి ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వ నిర్ణయం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని తెలిపారు. దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం సరికాదని అన్నారు. ప్రకటనలు ప్రవేశపెట్టేందుకు అసెంబ్లీ వేదిక కాదని, కనీసం లోతైన చర్చ కూడా జరపకపోవడం దారుణమని ఆగ్ర హం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. సర్వేలో అన్ని వర్గాల జనాభా తగ్గిందని, ఓసీల జనాభాను మాత్రం భారీగా పెంచి చూపించారని ఆరోపించారు. చదవండి: 59 కులాలు, 3 గ్రూపులుబీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వండి: బండ ప్రకాశ్ గత ప్రభుత్వం చేసిన సమగ్ర సర్వే వివరాలు ఎంసీఆర్హెచ్ఆర్డీ వైబ్సైట్లో ఉన్నాయని మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీకి అనుగుణంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తూ ఆర్డినెన్స్ జారీ చేయాలని కోరారు. అందుకు సభ్యులు కూడా మద్దతుగా నిలుస్తారని తెలిపారు. సర్వే విషయంలో ప్రభుత్వం నుంచి సమాచారం అందకపోవడం, స్పష్టత లేకుండా సభ నిర్వహించడంపై నిరసన వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ఆ తర్వాత ఎస్సీ వర్గీకరణ చర్చలో పాల్గొన్నారు. సమగ్ర కుటుంబ సర్వే, ఎస్సీ వర్గీకరణపై సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీర్మానాలు ప్రవేశపెట్టగా సభ్యులు ఆమోదం తెలిపారు. -
ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డిపై ఫిర్యాదు
హైదరాబాద్: ముదిరాజ్ లపై అనుచిత వాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ కౌషిక్ రెడ్డిపై తగిన చర్యలు తీసుకోవాలని ఖైరతాబాద్ ముదిరాజ్ సంఘం సభ్యులు ఫిర్యాదు చేశారు. సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ.. ముదిరాజ్ కులస్తులపై కౌషిక్ రెడ్డి అనుచిత వాఖ్యలు దారుణమన్నారు. కౌషిక్ రెడ్డిపై తగిన చర్యలు తీసుకోవాలని ఇన్ స్పెక్టర్ పి.నిరంజన్ రెడ్డి కోరినట్టు తెలిపారు. -
బీసీ ‘ఏ’ కేటగిరీలోకి ముదిరాజ్‌లు
కమిషన్ నివేదిక రాగానే మార్పు: మంత్రి ఈటల - ‘డీ’ కేటగిరీతో విద్య, ఉద్యోగాల్లో ముదిరాజ్‌లు నష్టపోయారు - ముదిరాజ్ సింహగర్జనలో రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆవేదన - ప్రతి జిల్లా, నియోజకవర్గ కేంద్రంలో చేపల మార్కెట్లు: తలసాని సాక్షి, హైదరాబాద్: ‘బీసీ వర్గీకరణలో ముదిరాజ్‌లను ‘డీ’కేటగిరీలో చేర్చడంతో తీవ్రంగా నష్టపోయారు. విద్య, ఉద్యోగాలపరంగా కొన్ని తరాల ప్రజలకు అన్యాయం జరిగింది. ఈ అన్యాయంపై 2004 నుంచి ఉద్యమం చేస్తున్నా. ముదిరాజ్‌లను బీసీ ‘ఏ’కేటగిరీలో చేర్చాలని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని డిమాండ్ చేశా. 2008లో ఆయన కేటగిరీ ‘ఏ’లో చేర్చుతూ ఆదేశాలు జారీ చేశారు. కానీ ఆ ఫలితం ఎన్నాళ్లో నిలవలేదు. కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఆ ఉత్తర్వుల అమలు నిలిచిపోయింది’అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఆదివారం నిజాం కాలేజ్ గ్రౌండ్స్‌లో తెలంగాణ ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు బండ ప్రకాశ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో జరిగిన ముదిరాజ్ సింహగర్జన కార్యక్రమానికి ఈటలతో పాటు ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ ‘ముదిరాజ్‌లను బీసీ ఏ కేటగిరీలో చేర్చాలనే వాదనతో సుప్రీంకోర్టుకు వెళ్లా. కానీ కమిషన్ రిపోర్టు ఉంటే ఆమేరకు తీర్పు ఇస్తామని న్యాయమూర్తి చెప్పారు. దీంతో ఎనిమిదేళ్లు ఆగాల్సి వచ్చింది. ప్రస్తుతం తెలంగాణ సర్కారు బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. బీసీల స్థితిగతులను అధ్యయనం చేసి అత్యుత్తమ రిపోర్టు ఇవ్వాలని సీఎం కేసీఆర్, కమిషన్‌ను ఆదేశించారు. చైర్మన్ బీఎస్ రాములు నేతృత్వంలోని కమిషన్ బీసీల స్థితిగతులపై అధ్యయనాన్ని ప్రారంభించింది. న్యాయస్థానంలో చిక్కులు తలెత్తకుండా రిపోర్టు ఇవ్వనుంది. కమిషన్ నివేదిక ఇచ్చిన వెంటనే ముదిరాజ్‌లను బీసీ ఏ కేటగిరీలోకి మారుస్తాం’అని స్పష్టం చేశారు. రిజర్వేషన్ల అంశం త్వరలో పరిష్కారమవుతుందని, ఉపాధి అవకాశాలపై ముదిరాజ్‌లు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ‘ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు కోసం ఆదిలాబాద్‌లో పైప్లైన్ల కోసం చేసిన తవ్వకాలు కాల్వలను తలపిస్తున్నాయని సీఎం వద్ద ఓ ఇంజనీరు వాపోయారు. దీంతో తక్షణమే స్పందించిన సీఎం కేసీఆర్... ఆ గుంతలకు కట్టలు కట్టి చెరువులు చేస్తాం. మత్స్యపరిశ్రమను అభివృద్ధి చేస్తాం. అని సమాధానమిచ్చారు. ఆయన మాటల్ని అమలు చేసి ముదిరాజ్‌లకు మరింత ఉపాధి కల్పిస్తాం. సంఘాల్లో సభ్యత్వ నమోదును విస్తృతం చేసి సమన్వయంతో ముందుకు సాగాలి.’అని ఈటల పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 45వేల చెరువులను మిషన్ కాకతీయ కింద అభివృద్ధి చేస్తున్నామని, చెరువుల కింద పంటతో పాటు చేపల పెంపకం కూడా ప్రభుత్వానికి ముఖ్య అంశమేనని చెప్పారు. పేదలు అధికం: కడియం దళితులు, గిరిజనుల తర్వాత అత్యధిక పేదలున్నది ముదిరాజ్ కులంలోనేనని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. వారిని విద్యతో పాటు ఉపాధి రంగాల్లో అభివృద్ధి చేసి, ఆర్థికంగా బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. ముదిరాజ్‌ల రిజర్వేషన్ల మార్పు తప్పకుండా జరుగుతుందని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. ప్రతి జిల్లా కేంద్రంతో పాటు నియోజకవర్గ కేంద్రంలో చేపల మార్కెట్ ఏర్పాటు చేస్తామని, స్థానిక ప్రజాప్రతినిధులతో స్థల కేటాయింపు ప్రక్రియ పూర్తిచేస్తే తక్షణమే నిధులు మంజూరు చేస్తానని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మత్స్య పరిశ్రమ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించిందని, రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు నెలల్లో 45కోట్ల చేప పిల్లల్ని చెరువుల్లో వేశామని, మరో ఆర్నెళ్లలో అవి ఐదువందల కోట్లు అవుతాయని చెప్పారు. వీటితో ముదిరాజ్‌లు జాగ్రత్తగా వ్యాపారం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని అన్నారు. 75శాతం రాయితీపై టాటా ఏస్ వాహనాల్ని నిరుద్యోగ యువతకు ఇస్తున్నాయని, అదేవిధంగా చేపల మార్కెటింగ్ కోసం ప్రత్యేకంగా వాహనాల్ని సైతం రాయితీపై ఇస్తామని చెప్పారు. సీఎల్పీ ఉప నేత జీవన్‌రెడ్డి మాట్లాడుతూ, ముదిరాజ్‌లను బీసీ ఏ లోకి మార్చేందుకు ప్రభుత్వం బిల్లు పెడితే తాను మద్దతిస్తానని అన్నారు. ఈ సభలో మాజీ మంత్రి చంద్రశేఖర్‌తోపాటు వివిధ జిల్లాలకు చెందిన ముదిరాజ్ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు, పెద్ద ఎత్తున ముదిరాజ్‌లు పాల్గొన్నారు. -
ముదిరాజ్‌లను బీసీ ఏలోకి మార్చాలి
తెలంగాణ ముదిరాజ్ సంఘం రాష్ర్ట అధ్యక్షుడు జగన్మోహన్రావు తూప్రాన్: ముదిరాజ్ కులస్తులను బీసీ డీ గ్రూపు నుంచి బీసీ ఏలోకి మార్చాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్రావు ముదిరాజ్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన తూప్రాన్‌లో విలేకరులతో మాట్లాడుతూ ముదిరాజ్‌లు గత 40ఏళ్లుగా అన్నిరంగాల్లో వెనుకబడి ఉన్నారన్నారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ ద్వారా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయనున్న నేపథ్యంలో ముదిరాజ్‌లకు ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల్లో ముదిరాజ్‌లు కేవలం 3 శాతం మాత్రమే ఉన్నారన్నారు. దివంగత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముదిరాజ్‌లను బీసీ డీ నుంచి బీసీఏలోకి మారుస్తూ జీఓ తెచ్చినప్పటికీ అది అమలుకు నోచుకోవడం లేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ముదిరాజ్‌లను బీసీఏలోకి మార్చి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట స్థానిక ఎంపీపీ గుమ్మడి శ్రీనివాస్ తెలంగాణ ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నత్తి మల్లేష్, హైదరాబాద్ జిల్లా నాయకులు వెంకటేశ్ ముదిరాజు, నాయకులు జంగం యాదగిరి, తబళాల శ్రీనివాస్, కాళ్లకల్ ఉపసర్పంచ్ పురం రవి, కె. మల్లేశం, దుర్గం వెంకటేశ్ తదితరులు ఉన్నారు. -
బీసీ(ఏ)లోకి ముదిరాజ్‌లు: ఈటెల
సాక్షి, హైదరాబాద్: ముదిరాజ్ సామాజికవర్గాన్ని బీసీ(డీ) జాబితా నుంచి బీసీ(ఏ)లో చేర్చే విషయమై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో మాట్లాడతానని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. సోమవారం రవీంద్రభారతిలో ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన జడ్పీటీసీ, ఎంపీటీసీ, కౌన్సిలర్ల సన్మానసభ తెలంగాణ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా మంత్రి రాజేందర్ మాట్లాడుతూ సంఘటిత శక్తితోనే ముదిరాజ్‌లు హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ విద్యావంతులు కావాలని ఆకాంక్షించారు. బీసీ రిజర్వేషన్లతో తాను మంత్రిని కాలేదని, తెలివి తక్కువగా రాలేదని, చదువుకొని జ్ఞానంతో ఈ స్థాయికి చేరుకున్నానని పేర్కొన్నారు. ఆంధ్రా పాలకుల నిర్లక్ష్యం కారణంగా తెలంగాణలోని చెరువులు వల్లకాడుకు చేరాయని, ఫలితంగా ముదిరాజ్‌లు వ్యవసాయం చేయడానికి, చేపలు పట్టుకోవడానికి కష్టంగా మారిందన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో అంతా మంచే జరుగుతుందని, ముదిరాజ్‌ల సమస్యలు కేసీఆర్ తెలుసని, త్వరలోనే ఒక సభ పెట్టి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తాని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వానికి నైపుణ్యం లేదని కొందరు విమర్శించడాన్ని మంత్రి ఖండించారు. ఈ సందర్భంగా హైదరాబాదులోని భీంరావ్బాడావాసులు మంత్రిని కలిసి సమస్యలను విన్నవించారు. కార్యక్రమంలో తెలంగాణ ముదిరాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె.జగన్ మోహన్‌రావు, నాయకులు మోత పరమేశ్వర్, పీసీసీ మాజీ ఉపాధ్యక్షుడు పిట్ల కృష్ణ, అఖిల భారత ముదిరాజ్ సంఘం ఉపాధ్యక్షులు రోటం భూపతి ముదిరాజ్, మాజీ ఎమ్మెల్యేలు ఎ.రాజేందర్, ఎం.చంద్రశేఖర్ ముదిరాజ్, మహిళా విభాగం అధ్యక్షురాలు నీలం పృథ్వీదేవి ముదిరాజ్ పాల్గొన్నారు.