బీసీ ‘ఏ’ కేటగిరీలోకి ముదిరాజ్‌లు | Mudiraj caste will be placed in BC‘A’ category: minister Etela Rajender | Sakshi
Sakshi News home page

బీసీ ‘ఏ’ కేటగిరీలోకి ముదిరాజ్‌లు

Published Mon, Dec 19 2016 3:47 AM | Last Updated on Mon, Sep 4 2017 11:03 PM

బీసీ ‘ఏ’ కేటగిరీలోకి ముదిరాజ్‌లు

బీసీ ‘ఏ’ కేటగిరీలోకి ముదిరాజ్‌లు

కమిషన్‌ నివేదిక రాగానే మార్పు: మంత్రి ఈటల
- ‘డీ’ కేటగిరీతో విద్య, ఉద్యోగాల్లో ముదిరాజ్‌లు నష్టపోయారు
- ముదిరాజ్‌ సింహగర్జనలో రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆవేదన
- ప్రతి జిల్లా, నియోజకవర్గ కేంద్రంలో చేపల మార్కెట్లు: తలసాని


సాక్షి, హైదరాబాద్‌: ‘బీసీ వర్గీకరణలో ముదిరాజ్‌లను ‘డీ’కేటగిరీలో చేర్చడంతో తీవ్రంగా నష్టపోయారు. విద్య, ఉద్యోగాలపరంగా కొన్ని తరాల ప్రజలకు అన్యాయం జరిగింది. ఈ అన్యాయంపై 2004 నుంచి ఉద్యమం చేస్తున్నా. ముదిరాజ్‌లను బీసీ ‘ఏ’కేటగిరీలో చేర్చాలని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డిని డిమాండ్‌ చేశా. 2008లో ఆయన కేటగిరీ ‘ఏ’లో చేర్చుతూ ఆదేశాలు జారీ చేశారు. కానీ ఆ ఫలితం ఎన్నాళ్లో నిలవలేదు. కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఆ ఉత్తర్వుల అమలు నిలిచిపోయింది’అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు.

ఆదివారం నిజాం కాలేజ్‌ గ్రౌండ్స్‌లో తెలంగాణ ముదిరాజ్‌ మహాసభ అధ్యక్షుడు బండ ప్రకాశ్‌ ముదిరాజ్‌ ఆధ్వర్యంలో జరిగిన ముదిరాజ్‌ సింహగర్జన కార్యక్రమానికి ఈటలతో పాటు ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్‌ అలీ, పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ ‘ముదిరాజ్‌లను బీసీ ఏ కేటగిరీలో చేర్చాలనే వాదనతో సుప్రీంకోర్టుకు వెళ్లా. కానీ కమిషన్‌ రిపోర్టు ఉంటే ఆమేరకు తీర్పు ఇస్తామని న్యాయమూర్తి చెప్పారు. దీంతో ఎనిమిదేళ్లు ఆగాల్సి వచ్చింది. ప్రస్తుతం తెలంగాణ సర్కారు బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. బీసీల స్థితిగతులను అధ్యయనం చేసి అత్యుత్తమ రిపోర్టు ఇవ్వాలని సీఎం కేసీఆర్, కమిషన్‌ను ఆదేశించారు. చైర్మన్‌ బీఎస్‌ రాములు నేతృత్వంలోని కమిషన్‌ బీసీల స్థితిగతులపై అధ్యయనాన్ని ప్రారంభించింది. న్యాయస్థానంలో చిక్కులు తలెత్తకుండా రిపోర్టు ఇవ్వనుంది. కమిషన్‌ నివేదిక ఇచ్చిన వెంటనే ముదిరాజ్‌లను బీసీ ఏ కేటగిరీలోకి మారుస్తాం’అని స్పష్టం చేశారు. రిజర్వేషన్ల అంశం త్వరలో పరిష్కారమవుతుందని, ఉపాధి అవకాశాలపై ముదిరాజ్‌లు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు.

‘ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు కోసం ఆదిలాబాద్‌లో పైప్‌లైన్ల కోసం చేసిన తవ్వకాలు కాల్వలను తలపిస్తున్నాయని సీఎం వద్ద ఓ ఇంజనీరు వాపోయారు. దీంతో తక్షణమే స్పందించిన సీఎం కేసీఆర్‌... ఆ గుంతలకు కట్టలు కట్టి చెరువులు చేస్తాం. మత్స్యపరిశ్రమను అభివృద్ధి చేస్తాం. అని సమాధానమిచ్చారు. ఆయన మాటల్ని అమలు చేసి ముదిరాజ్‌లకు మరింత ఉపాధి కల్పిస్తాం. సంఘాల్లో సభ్యత్వ నమోదును విస్తృతం చేసి సమన్వయంతో ముందుకు సాగాలి.’అని ఈటల పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 45వేల చెరువులను మిషన్‌ కాకతీయ కింద అభివృద్ధి చేస్తున్నామని, చెరువుల కింద పంటతో పాటు చేపల పెంపకం కూడా ప్రభుత్వానికి ముఖ్య అంశమేనని చెప్పారు.

పేదలు అధికం: కడియం
దళితులు, గిరిజనుల తర్వాత అత్యధిక పేదలున్నది ముదిరాజ్‌ కులంలోనేనని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. వారిని విద్యతో పాటు ఉపాధి రంగాల్లో అభివృద్ధి చేసి, ఆర్థికంగా బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. ముదిరాజ్‌ల రిజర్వేషన్ల మార్పు తప్పకుండా జరుగుతుందని ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ పేర్కొన్నారు. ప్రతి జిల్లా కేంద్రంతో పాటు నియోజకవర్గ కేంద్రంలో చేపల మార్కెట్‌ ఏర్పాటు చేస్తామని, స్థానిక ప్రజాప్రతినిధులతో స్థల కేటాయింపు ప్రక్రియ పూర్తిచేస్తే తక్షణమే నిధులు మంజూరు చేస్తానని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు.

మత్స్య పరిశ్రమ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించిందని, రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు నెలల్లో 45కోట్ల చేప పిల్లల్ని చెరువుల్లో వేశామని, మరో ఆర్నెళ్లలో అవి ఐదువందల కోట్లు అవుతాయని చెప్పారు. వీటితో ముదిరాజ్‌లు జాగ్రత్తగా వ్యాపారం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని అన్నారు. 75శాతం రాయితీపై టాటా ఏస్‌ వాహనాల్ని నిరుద్యోగ యువతకు ఇస్తున్నాయని, అదేవిధంగా చేపల మార్కెటింగ్‌ కోసం ప్రత్యేకంగా వాహనాల్ని సైతం రాయితీపై ఇస్తామని చెప్పారు. సీఎల్‌పీ ఉప నేత జీవన్‌రెడ్డి మాట్లాడుతూ, ముదిరాజ్‌లను బీసీ ఏ లోకి మార్చేందుకు ప్రభుత్వం బిల్లు పెడితే తాను మద్దతిస్తానని అన్నారు. ఈ సభలో మాజీ మంత్రి చంద్రశేఖర్‌తోపాటు వివిధ జిల్లాలకు చెందిన ముదిరాజ్‌ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు, పెద్ద ఎత్తున ముదిరాజ్‌లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement