మంత్రి ఈటల రాజేందర్
‘ఎన్నో ప్రతికూల పరిస్థితులు, అస్పష్టతలు, అనుమానాలు, సవాళ్లు... ఇలాంటి తరుణంలో కొత్త రాష్ట్రంగా రూపుదిద్దుకున్న తెలంగాణ అనతికాలంలోనే ఎన్నో విషయాల్లో దేశంలోనే ఆదర్శంగా ఎదిగింది. ప్రజా సంక్షేమం, మౌలిక వసతుల కల్పన, పాలనా సంస్కరణలు.. ఒక్కటేమిటి ఇలా ఎన్నో అంశాల్లో తెలంగాణ చూపిన బాటే అనుసరణీయమని ఇతర రాష్ట్రాలు భావిస్తున్నాయి. ఈ విజయాలు తెలంగాణ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందనే ఆత్మవిశ్వాసాన్ని ప్రజల్లో కలిగిస్తున్నాయి’
‘ఉమ్మడి రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాల్లో మనకు జరిగిన అన్యాయాన్ని, రాష్ట్రం ఏర్పడినప్పుడు ఉన్న అస్తవ్యస్త పరిస్థితులను చక్కదిద్దే దిశగా వినూత్న పథకాలు ప్రారంభించాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలోకి తెచ్చాం. 45 నెలల స్వల్పకాలంలో ఎన్నో అద్భుతాలు ఆవిష్కరించాం. చీకటి నుంచి వెలుగులోకి, అపనమ్మకం నుంచి ఆత్మవిశ్వాసంలోకి, అణగారిన స్థితి నుంచి అభ్యున్నతిలోకి, వలస బతుకుల నుంచి వ్యవసాయ ప్రగతి వైపు రాష్ట్రాన్ని నడిపిస్తున్నాం’
సాక్షి, హైదరాబాద్: ‘‘తెలంగాణ ఏర్పడకముందు అంతా చీకట్లే. సమైక్య పాలన చివరి రెండేళ్లలో తెలంగాణ ప్రాంత జీఎస్‌డీపీ వృద్ధి రేటు (4.2 శాతం) దేశ సగటు (5.9 శాతం) కన్నా తక్కువ. జీడీపీ వృద్ధి రేటు రాష్ట్రం ఏర్పడితే కాని పెరగలేదు.. 6.8 శాతం నుంచి ఇప్పుడు 10.4 శాతం దిశగా దూసుకెళ్తోంది’’అని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. రాష్ట్రం ఏర్పడకముందు తయారీ రంగం, విద్యుత్, నీటిపారుదల.. ఇలా అన్నింటా నిస్తేజమే ఉందని చెప్పారు.
మనకున్న వనరులు, అవసరాలను సరిగ్గా అంచనా వేసుకుని అందుకు అనుగుణంగా ప్రణాళికలు రచించుకుని ముందుకు సాగటం వల్లే రాష్ట్రం పురోగమిస్తోందని పేర్కొన్నారు. ఆ ప్రగతిని కళ్లారా చూస్తున్న ప్రజల నమ్మకాన్ని మరింత సుస్థిరం చేసే దిశగా కొత్త బడ్జెట్ దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2018–19 ఆర్థిక సంవత్సరానికిగాను రాష్ట్ర బడ్జెట్‌ను గురువారం ఆయన శాసనసభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ పద్దులతోపాటు వివిధ రంగాల్లో రాష్ట్ర పురోగతిని వివరించారు.
సమైక్య పాలనతో మొదలుపెట్టి
ఎన్నికల ముందు ప్రవేశపెడుతున్న బడ్టెట్ కావటంతో గడచిన నాలుగేళ్ల టీఆర్‌ఎస్ పాలనా తీరును వివరిస్తూ ఈటల ప్రసంగ పాఠం మొదలైంది. రాష్ట్రాభివృద్ధిలో వ్యవసాయ రంగానిదే ప్రధాన భూమిక అని, సమైక్య పాలనలో తెలంగాణ వ్యవసాయం సంక్షోభంలో కొట్టుమిట్టాడిందని పేర్కొన్నారు. రైతులకు తక్షణ తోడ్పాటు అందించేందుకు 35 లక్షల మందికి సంబంధించి రూ.16,124 కోట్ల రుణాలను ప్రభుత్వమే చెల్లించిందని గుర్తు చేశారు. చెరువులను పునరుద్ధరించటం ద్వారా సాగునీటి సమస్య పరిష్కరిస్తోందన్నారు. స్వతంత్ర భారత చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా పెట్టుబడిని ప్రభుత్వమే సమకూర్చి రైతులకు ప్రభుత్వం అండగా నిలిచింద ని పేర్కొన్నారు.
ఈ ఏడాది నుంచి ఎకరాకు రూ.4వేల చొప్పున రెండు పంటలకు రెండు విడతల్లో ప్రతి రైతుకు రూ.8వేలు ప్రభుత్వమే అందిస్తోందన్నారు. ఈ పథకం కోసం బడ్జెట్‌లో రూ.12 వేల కోట్లను ప్రతిపాదించినట్టు వె ల్లడించారు. ఇలా ప్రభుత్వ వి ధానాలను వివరిస్తూ.. శాఖలవారీగా బడ్జెట్ కేటాయింపులను చదివి వినిపించారు. పెట్టుబడి సాయం అందించాలంటే భూరికార్డులు సమగ్రంగా ఉండాలన్న ఉద్దేశంతో 10,823 గ్రామాల్లో భూరికార్డులను పరిశీలించి మార్పులు చేసినట్టు చె ప్పారు. రాత్రింబవళ్లు కష్టపడి వంద రోజుల్లో ఈ తంతు పూర్తి చేశామన్నారు. రైతులను సంఘటిత శక్తిగా మార్చేందుకు రైతు సమన్వయ సమి తి విధానాన్ని ప్రారంభించామని వివరించారు.
రైతు చనిపోతే ఆ కుటుంబం రోడ్డున పడకుండా ఉండేందుకు రైతు బీమా పథకాన్ని ప్రారంభిస్తున్నామని, రూ.5 లక్షల చొప్పున బీమా సదుపాయాన్ని కల్పించేందుకు రూ.500 కోట్లను బడ్జెట్లో ప్రతిపాదించామన్నారు. వ్యవసాయ యాంత్రీకరణకు రూ.522 కోట్లు, బిందు తుంపర సేద్యం కోసం రూ.127 కోట్లు, పాలీహౌజ్, గ్రీన్‌హౌజ్‌ల కోసం రూ.120 కోట్లు, మార్కెటింగ్ సదుపాయాల మెరుగు, గోదాముల నిర్మాణం, కోల్డ్ స్టోరేజీల లింకేజీ... తదితరాల కోసం రూ.15780 కోట్లు ప్రతిపాదించామన్నారు.
కోటి ఎకరాలకు నీరే లక్ష్యంగా..
రాష్ట్రంలో కోటి ఎకరాలకు నీరు అందించటం లక్ష్యంగా సాగునీటి ప్రాజెక్టులను చేపట్టామని ఈటల వివరించారు. గోదావరి, కృష్ణా నదులపై 23 మేజర్, 13 మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టినట్టు పేర్కొన్నారు. ఈ ఏడాది వర్షాకాలం పంట నాటికి 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పారు. ‘‘రికార్డు సమయంలో భక్త రామ దాసు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేశాం. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొద్దినెలల్లోనే వాటర్ పంపింగ్ పాక్షికంగా ప్రారంభిస్తాం. రెండేళ్లలో రిజర్వాయర్లు, కాల్వలతో సహా పూర్తి చేస్తాం. రైతులకు వరప్రదాయిని అయిన మిషన్ కాకతీయను వేగంగా జరుపుతున్నాం. మొత్తంగా సాగునీటి రంగానికి రూ.25వేల కోట్లు ప్రతిపాదిస్తున్నాం’’అని తెలిపారు.
మాంసం ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణను నంబర్ వన్‌గా తీర్చి దిద్దేందుకు గొర్రెల పంపిణీ పథకాన్ని చేపట్టినట్టు పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం 3.20 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి లక్ష్యంతో ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిందని, వాటిని అమ్ముకునేందుకు 31 హోల్‌సేల్ చేపల మార్కెట్లు, 200 రిటైల్ మార్కెట్లు నిర్మిస్తామని తెలిపారు. కేసీఆర్ పాలన సంక్షేమానికి స్వర్ణయుగంగా చెప్పొచ్చన్నారు. ఆరోగ్య లక్ష్మి పథకం కింద వచ్చే సంవత్సర కాలంలో రూ.298 కోట్లు ఖర్చు చేయనున్నట్టు పేర్కొన్నారు. ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, వికలాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు.
ఇది ఎన్నికల బడ్జెట్ కాదు: ఈటల
కొందరు అంటున్నట్టుగా ఇది ఎన్నికల బడ్జెట్ కాదని, రాష్ట్రాభివృద్ధి కోసం దూరదృష్టితో రూపొందించిన బడ్జెట్ అని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఆర్థికశాఖ ఉన్నతాధికారులతో కలిసి శాసనసభ కమిటీహాలులో గురువారం ఆయన మాట్లాడారు. ఉత్పాదక, సేవారంగంతోపాటు అన్ని వృత్తులు, వర్గాలకు తండ్రిలా అండగా ఉండే బడ్జెట్ అన్నారు. రాష్ట్రంలో సంక్షేమానికే మొదటి ప్రాధాన్యత అని, ఆసరా లేని పెద్దలకు పెద్ద దిక్కులాగా ప్రభుత్వం ఉందని చెప్పారు. ఏ రాష్ట్రానికైనా, కుటుంబానికైనా అప్పులు లేకుండా అభివృద్ధి సాధ్యం కాదన్నారు. అప్పులు తెచ్చి ఆస్తులను, ఉత్పాదక వనరులను, సంపదను పెంచుతున్నామని వివరించారు. ఈ ఏడాది వ్యవసాయ అనుబంధ రంగాలకు 26 శాతం నిధులను అదనంగా కేటాయించామన్నారు.
డబుల్ ఇళ్లలో వేగం
నిరుపేదలు కూడా సౌకర్యవంతమైన ఇళ్లలో జీవించాలనే ఉద్దేశంతో ప్రారంభించిన రెండు పడక గదుల ఇళ్ల పథకం వేగం పుంజుకుందని ఈటల చెప్పారు. ఇప్పటికే 9,522 ఇళ్ల నిర్మాణం పూర్తయిందని, 1,68,981 ఇళ్లు పురోగతిలో ఉన్నాయని, తాజా బడ్జెట్‌లో ఆ పథకానికి రూ.2,643 కోట్లు ప్రతిపాదించినట్టు వెల్లడించారు. ప్రజలకు ఎంతో అ వసరమైన వైద్య రంగానికి రూ.7,375 కోట్లు కేటాయించామన్నారు. 8,792 ఉపాధ్యాయ పోస్టులను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియమించనున్నామని, వచ్చే విద్యాసంవత్సరంలో ఆ టీచర్లు స్కూళ్లల్లో ఉంటా రని పేర్కొన్నారు. రోడ్లు, వంతెన నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయన్నారు. యాదాద్రి తరహాలో భద్రాచలం, వేములవాడ, ధర్మపురి, బాసర దేవాలయాలను కూడా అభివృద్ధి చేయనున్నట్టు ప్రకటించారు.
చెణుకులు లేకుండా సాదాసీదాగా...
గతంలో ఎప్పుడూ లేనంత సుదీర్ఘంగా ఈటల బడ్జెట్ ప్రసంగం సాగింది. దాదాపు గంటా ఇరవై నిమిషాల పాటు సాగిన ప్రసంగంలో ప్రత్యేకంగా ప్రస్తావించదగ్గ చెణుకులు లేకుండా సాదాసీదాగా ముగిసింది. ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని పరిగణనలోకి తీసుకునే ఈ బడ్జెట్‌కు రూపమిచ్చినట్టు తెలిపారు. వరుసగా ఐదుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఇచ్చినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, శాసనమండలిలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. దాదాపు గం టా పది నిమిషాల పాటు ఆయన ప్రసంగం కొనసాగింది.
Comments
Please login to add a commentAdd a comment