సాక్షి, హైదరాబాద్: ముదిరాజ్ సామాజికవర్గాన్ని బీసీ(డీ) జాబితా నుంచి బీసీ(ఏ)లో చేర్చే విషయమై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో మాట్లాడతానని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. సోమవారం రవీంద్రభారతిలో ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన జడ్పీటీసీ, ఎంపీటీసీ, కౌన్సిలర్ల సన్మానసభ తెలంగాణ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా మంత్రి రాజేందర్ మాట్లాడుతూ సంఘటిత శక్తితోనే ముదిరాజ్‌లు హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ విద్యావంతులు కావాలని ఆకాంక్షించారు. బీసీ రిజర్వేషన్లతో తాను మంత్రిని కాలేదని, తెలివి తక్కువగా రాలేదని, చదువుకొని జ్ఞానంతో ఈ స్థాయికి చేరుకున్నానని పేర్కొన్నారు.
ఆంధ్రా పాలకుల నిర్లక్ష్యం కారణంగా తెలంగాణలోని చెరువులు వల్లకాడుకు చేరాయని, ఫలితంగా ముదిరాజ్‌లు వ్యవసాయం చేయడానికి, చేపలు పట్టుకోవడానికి కష్టంగా మారిందన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో అంతా మంచే జరుగుతుందని, ముదిరాజ్‌ల సమస్యలు కేసీఆర్ తెలుసని, త్వరలోనే ఒక సభ పెట్టి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తాని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వానికి నైపుణ్యం లేదని కొందరు విమర్శించడాన్ని మంత్రి ఖండించారు. ఈ సందర్భంగా హైదరాబాదులోని భీంరావ్‌బాడావాసులు మంత్రిని కలిసి సమస్యలను విన్నవించారు. కార్యక్రమంలో తెలంగాణ ముదిరాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె.జగన్ మోహన్‌రావు, నాయకులు మోత పరమేశ్వర్, పీసీసీ మాజీ ఉపాధ్యక్షుడు పిట్ల కృష్ణ, అఖిల భారత ముదిరాజ్ సంఘం ఉపాధ్యక్షులు రోటం భూపతి ముదిరాజ్, మాజీ ఎమ్మెల్యేలు ఎ.రాజేందర్, ఎం.చంద్రశేఖర్ ముదిరాజ్, మహిళా విభాగం అధ్యక్షురాలు నీలం పృథ్వీదేవి ముదిరాజ్ పాల్గొన్నారు.
బీసీ(ఏ)లోకి ముదిరాజ్‌లు: ఈటెల
Published Tue, Aug 12 2014 2:03 AM | Last Updated on Wed, Aug 15 2018 8:06 PM
Advertisement
Advertisement