పాత కలలు.. కొత్త పంథా
- ఊహల్లోనే విహరించిన సర్కారు
- అంచనాలు దాటిన ప్రణాళిక వ్యయం
- వృద్ధిరేటును మించి పన్నుల రాబడి అంచనా
- మొండిపన్నులు, ఎగవేతల కట్టడిపైనే భారం
- భూముల అమ్మకం, కేంద్ర ప్యాకేజీలపై ఆశ
- పునర్ వ్యవస్థీకరణలో 379 పథకాలకు మంగళం
సాక్షి, హైదరాబాద్: కొత్త పంథాలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నామని పదేపదే చెప్పుకున్న రాష్ట్ర ప్రభుత్వం, మూడోసారీ అంచనాలకు మించిన భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. అభివృద్ధి, సంక్షేమాలకు పెద్దపీట వేస్తున్నట్టు చెప్పేందుకు ప్రణాళిక వ్యయాన్ని భారీగా పెంచింది. ప్రణాళికేతర వ్యయాన్ని మాత్రం తగ్గించింది!
బడ్జెట్‌తో సంబంధం లేకుండా నిధులను సమీకరించే సరికొత్త పోకడకూ తెరతీసింది. ప్రభుత్వం అమలు చేస్తున్న మిషన్ భగీరథ, డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం, కొత్త ఆసుపత్రుల నిర్మాణాన్ని వివిధ సంస్థలిచ్చే రుణసాయంతో చేపట్టేలా వార్షిక ప్రణాళికను రూపొందించింది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి రూ.3718.37 కోట్ల మిగులుతో రూ.1,30,415.87 కోట్ల భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ప్రణాళికేతర వ్యయం రూ.62,785.14 కోట్లు, ప్రణాళిక వ్యయం రూ.67,630.73 కోట్లుగా ప్రతిపాదించింది.
తొలి రెండేళ్లలో ప్రణాళికేతర వ్యయాన్ని ప్రణాళిక వ్యయానికి మించి చూపగా, ఈసారి ప్రణాళిక సైజును అంచనాలకు అందనంతగా పెంచేసింది! 2015-16 సవరణల్లో రూ.42,079 కోట్ల ప్రణాళిక వ్యయం చూపించిన సర్కారు ఒక్కసారిగా ఈ బడ్జెట్‌లో మరో రూ.25 వేల కోట్ల మేరకు పెంచడం గమనార్హం!
నిరుటి కలలపైనే విహారం
నిరుడు ఆశించిన ఆదాయం రాలేదని సవరణ బడ్జెట్ గణాంకాల్లో అంగీకరించిన సర్కారు.. ఆదాయ అంచనాలను మాత్రం ఈసారి కూడా యథాప్రకారం పాత పద్ధతిలోనే భూతద్దంలో చూపింది. గతేడాది 1.15 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం, కేవలం లక్ష కోట్లే ఖర్చవుతుందంటూ సవరించుకుంది. కోర్టు వ్యాజ్యాలతో భూముల అమ్మకం జరగలేదని, కేంద్రం నుంచి రావాల్సిన ప్రణాళికా నిధులు తగ్గాయని, వాణిజ్య పన్నుల ద్వారా రావాల్సిన బకాయిలు కోర్టు కేసుల వల్ల వసూలవక ఆశించిన ఆదాయం రాలేదని, ఇవన్నీ ప్రభుత్వం చేతిలో లేని అంశాలని ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో వివరణ ఇచ్చారు.
కానీ ప్రభుత్వ భూములు, ఆస్తుల అమ్మకం, కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీ... ఇలా పలుమార్గాల్లో ఆదాయం వస్తుందంటూ ఈసారి కూడా ప్రభుత్వం మళ్లీ కలల్లోనే విహరించింది! భూముల అమ్మకం, క్రమబద్ధీకరణలతో గతేడాది రూ.13,500 కోట్ల ఆదాయాన్ని అంచనా వేయగా వాస్తవంగా వచ్చింది రూ.1,500 కోట్లు దాటలేదు. అయినా సరే, ఇదే పద్దులో ఈసారి రూ.10,900 కోట్లు ఆదాయం వస్తుందని అంచనా వేశారు! గతేడాది కేంద్రం నుంచి రూ.2,950 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ వస్తుందని ప్రభుత్వం ఆశించగా వచ్చింది కేవలం రూ.450 కోట్లు. అయినా, ఈసారి కేంద్రం నుంచి రూ.3,100 కోట్లు వస్తుందని ఆదాయ పట్టికలో చూపడం కొసమెరుపు.
రాష్ట్ర పథకాల విలీనం
ప్రభుత్వ పథకాలను, బడ్జెట్ పద్దులను ప్రభుత్వం పునర్ వ్వవస్థీకరించింది. నిరుటి బడ్జెట్‌లో 840 పథకాలుండగా వాటిని 461కు కుదించింది. కాలం చెల్లిన పథకాలను తొలగించడంతో పాటు ఒకేలా ఉన్నవాటిని విలీనం చేసింది. నామమాత్ర కేటాయింపులుండే పద్దులనూ రద్దు చేసింది.
మిగులు తగ్గుతోందా..!
2013-14 బడ్జెట్‌లో రూ.301.02 కోట్ల రెవెన్యూ మిగులు చూపిన ప్రభుత్వం, ఆడిట్ అనంతరం రూ.368.65 కోట్ల మిగులుందని లెక్కతేల్చింది. గతేడాది బడ్జెట్‌లో రూ.531 కోట్లు మిగులును అంచనా వేసి, కేవలం రూ.60.54 కోట్లకు సవరించుకుంది. గతేడాది సవరణల్లో రూ.16,911 కోట్లు ద్రవ్యలోటు చూపింది. ఈసారి దాన్ని రూ.23,467 కోట్లకు పెంచింది. ఎఫ్‌ఆర్‌బీఎం చట్ట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం జీఎస్‌డీపీలో 3 శాతం మించకుండా గరిష్ఠ రుణపరిమితి పాటించాలి.
14వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం రెవెన్యూ మిగులున్నందున తెలంగాణకు ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని 3.5 శాతం పెంచాలని ప్రభుత్వం రెండేళ్లుగా కోరుతున్నా ఇప్పటికీ కేంద్రం నుంచి అనుమతి రాలేదు. కానీ తాజా బడ్జెట్‌లోనూ ప్రభుత్వం 3.5 శాతం ద్రవ్యలోటును అంచనా వేసింది. కేంద్ర పన్నుల వాటా, ప్రాయోజిత పథకాలు, గ్రాంట్ల ద్వారా గతేడాది రూ.25 వేల కోట్లు రాగా ఈసారి రూ.28,512 కోట్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేసింది. ప్రత్యేక ప్యాకేజీతో పాటు రూ.1,500 కోట్ల సీఎస్‌టీ బకాయిలు వస్తాయని లెక్కలేసింది.