సాక్షి, హైదరాబాద్: శాసనమండలిలో గురువారం హైడ్రామా చోటు చేసుకుంది. సభ్యులు ఎవరేమంటున్నారో తెలియని గందరగోళ వాతావరణంలోనే.. రాష్ట్రపతి పంపిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు - 2013పై చర్చ ముగిసిందని, సభ్యుల అభిప్రాయాలను రాష్ట్రపతికి నివేదిస్తామని చైర్మన్ చక్రపాణి ప్రకటించారు. ఈ బిల్లును తిరస్కరించాలంటూ సభా నాయకుడు సి.రామచంద్రయ్య ఇచ్చిన తీర్మానాన్ని సభ మూజువాణి ఓటుతో ఆమోదించినట్లు తెలిపారు. కీలకమైన ఈ రెండు అంశాలకు సంబంధించిన ప్రకటన రెండే నిమిషాల్లో పూర్తికావడం గమనార్హం. ఉదయం సభ ప్రారంభం కాగానే ఇరుప్రాంతాల సభ్యులు పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు. దీంతో వారుుదాల పర్వం కొనసాగింది. రెండుసార్లు వాయిదా అనంతరం 12.40కి మరోమారు సభ ఆరంభం కాగానే ‘రాష్ట్రపతి పంపిన బిల్లుపై గడువు నేటితో ముగుస్తుంది. అందువల్ల చర్చకు ముగింపు పలకాల్సిన అవసరముంది. చర్చలో 54 మంది సభ్యులు పాల్గొన్నారు. 33.19 గంటలు చర్చ సాగింది. సభ్యులంతా వారి అభిప్రాయాలను రాతపూర్వకంగా అందజేశారు. అవన్నీ అధికారిక రికార్డుల్లో భాగమే. బిల్లులోని క్లాజులపై సభ్యులిచ్చిన 1,157 సవరణలను కూడా అధికారిక రికార్డుల్లో భాగంగా చేర్చాం.
వీటిని సభ అభిప్రాయాలుగా రాష్ట్రపతికి నివేదిస్తాం’ అని చైర్మన్ చక్రపాణి ప్రకటించారు. ‘సభా నాయకుడు సి.రామచంద్రయ్య ఇచ్చిన ప్రభుత్వ తీర్మానంతోపాటు మరో అనధికారిక తీర్మానం అందింది. వాటి ప్రతులను సభ్యులకు అందజేశాం. రామచంద్రయ్య ఇచ్చిన తీర్మానం ప్రస్తుతం సభ ముందు ఉంది..’ అంటూ తెలంగాణ, సీమాంధ్ర ప్రాంత సభ్యుల అరుపులు, కేకల మధ్య ప్రభుత్వ తీర్మానం మూజువాణి ఓటుతో సభ ఆమోదం పొందినట్లు చక్రపాణి ప్రకటిస్తూ సభను నిరవధికంగా వాయిదా వేశారు. అంతకుముందు జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని శాసనమండలి నివాళులర్పించింది.
శాసనమండలిలో హైడ్రామా
Published Fri, Jan 31 2014 2:09 AM | Last Updated on Sat, Jun 2 2018 3:39 PM
Advertisement