G20 Presidency is Great Opportunity to India says C Ramachandraiah - Sakshi
Sakshi News home page

India's G20 Presidency: భారత్‌కు అందివచ్చిన గొప్ప అవకాశం

Published Thu, Dec 8 2022 2:01 PM | Last Updated on Thu, Dec 8 2022 3:29 PM

G20 Presidency is Great Opportunity to India: C Ramachandraiah Views - Sakshi

ఈ డిసెంబర్‌ 1 నుంచి జీ20 దేశాల కూటమికి నాయకత్వం వహించే బాధ్యత భారతదేశ ప్రధాని నరేంద్రమోదీ భుజ స్కంధాలపై పడింది. ప్రపంచం లోని 20 అగ్రదేశాల కూటమికి భారత్‌ నేతృత్వం వహించే అవకాశం లభించడం గౌరవమే కాదు.. ఓ గొప్ప అవకాశం కూడా! 1999లో జీ20 దేశాల కూటమి ఏర్పాటయింది. బలమైన ఆర్థిక వ్యవస్థల్ని అనుసంధానించి పరస్పర సహకారం, ప్రోత్సాహంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలన్నది కూటమి ప్రధాన లక్ష్యం. జీ20 కూటమిలో 19 దేశాలతో పాటు యూరోపియన్‌ యూనియన్‌ భాగ స్వామిగా ఉంది. కూటమి ఏర్పడింది 1999లో అయినా తొలి శిఖరాగ్ర సదస్సు జరిగింది మాత్రం 2008లో వాషింగ్టన్‌ డీసీలో. ఆ సమయంలోనే చోటుచేసుకొన్న ‘ఆసియా ఆర్థిక సంక్షోభం’ నుంచి బయటపడడానికి జీ20 దేశాల కూటమి కృషి చేసింది. అప్పటి నుంచి అంత ర్జాతీయ స్థాయిలో శక్తిమంతమైన సంస్థలలో ఒకటిగా జీ20 అవతరించింది. 

2016లో చైనాలో జరిగిన జీ20 కూటమి శిఖరాగ్ర సభలలో ‘సమ్మిళిత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ’ కోసం కృషి చేయాలని నిర్ణయం తీసుకున్న తర్వాత జీ20 కూటమిలో సభ్యత్వం లేని దేశాలతో కూడా వర్తక, వాణిజ్య సంబంధాలు ముమ్మరం అయ్యాయి. గత ఏడెనిమిది సంవత్సరాలలో భారత్‌ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించ డంలో జీ20 కూటమి దేశాలతో భారత్‌ నెరపిన దౌత్య, వర్తక, వాణిజ్య సంబంధాలు కీలకంగా దోహదం చేశాయి.

ఇటీవల, ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధాన్ని విరమింపజేయడంలో అగ్రరాజ్యాలు విఫలం అయ్యాయి. రష్యాపై పలు ఆంక్షలు విధించినా భారత్‌ తన చమురు అవసరాల కోసం ఇప్పటికీ రష్యాపైనే ఆధారపడుతూ పెద్ద ఎత్తున చమురును దిగుమతి చేసుకుంటోంది. ఈ పరిణా మాల దృష్ట్యా జీ20 కూటమికి భారత్‌ నేతృత్వం వహిం చడంవల్ల ఒరిగేదేమిటన్న ప్రశ్నలు అనివార్యంగా ఎదురవుతున్నాయి. 

ఇండోనేసియాలోని బాలిలో జరిగిన 2022 జీ20 శిఖరాగ్ర సదస్సులో, ఉక్రెయిన్‌ భూభాగం నుంచి రష్యా వైదొలగాలన్న పిలుపును కొన్ని దేశాలు గట్టిగానే విన్పించాయి. అంతకుముందే రష్యా అధినేత పుతిన్‌కు ‘నేటి యుగం యుద్ధాలది కాదు’ అంటూ భారత ప్రధాని నరేంద్రమోదీ ఎటువంటి శషబిషలు లేకుండా కుండ బద్ధలు కొట్టినట్లు చెప్పడంతో భారత్‌ తన వాణిజ్య అవసరాల కోసం మాత్రమే రష్యాతో సంబంధాలు నెరపుతున్నదే తప్ప, ఆ దేశం ప్రదర్శిస్తున్న యుద్ధోన్మాదాన్ని ఏమాత్రం ఉపేక్షించడం లేదన్న సంకేతం బలంగానే వెళ్లింది. అంతేకాదు... అంతర్జాతీయ సదస్సులలో చేసిన తీర్మానాలకు కట్టుబడటంలో భారత్‌ చిత్తశుద్ధితో వ్యవ హరిస్తోందన్న వాస్తవం కూడా తేటతెల్లం అయింది. ఉదాహరణకు క్యోటో ప్రోటోకాల్, పారిస్‌ కాప్‌ 21, అంతకుముందు రియో, కోపెన్‌ హెగన్‌ సదస్సులలో చేసిన తీర్మానాలకు అనుగుణమైన చర్యలు తీసుకోవడంతో పర్యావరణ పరిరక్షణ, భూతాప నియంత్రణలలో 63 దేశాల పనితీరుపై వెలువడ్డ నివేదికలో భారత్‌కు 8వ స్థానం లభించగా... చైనాకు 51, అమెరికాకు 52వ స్థానాలు లభించాయి. 

భారతదేశం తను అనాదిగా నమ్మే ‘వసుధైక కుటుంబం’ (ప్రపంచం మొత్తం ఒకే కుటుంబం) అనే భావనను ముందుకు తెచ్చి పరస్పర సహకారం, భాగస్వామ్యం అత్యంత అవశ్యం అని చాటి చెబుతోంది. కలిసికట్టుగా సమస్య లను ఎదుర్కోనట్లయితే... కుటుంబంలో ఎవరో ఒకరికి ఇబ్బంది కలుగుతుందనేది భారత్‌ చెప్పే మాట. కానీ, చైనా వంటి కొన్ని దేశాలు ‘నేను నా దేశం’ (గ్రూప్‌ జీరో) ముఖ్యం అనే ధోరణిలోనే సొంత ప్రయోజనాల కోసం ఇతర దేశాల ప్రయోజనాలను దెబ్బతీసే విధం గానూ, అంతిమంగా ప్రపంచ మానవాళికి ముప్పు కలి గించే విధంగానూ ముందుకు సాగుతున్నాయి. 

జీ20 కూటమికి నేతృత్వం వహించడం వల్ల భారత్‌కు సమీప భవిష్యత్తులో కొన్ని సానుకూలతలు అందివస్తాయి. అందులో ప్రధానమైనది అంతర్జాతీయ ఉగ్రవాదానికి అందుతున్న ఆర్థిక సాయాన్ని నిలిపివేయించగలగడం లేదా తగ్గించగలగడం. అలాగే దేశ సరిహద్దుల్లో పాకిస్తాన్, చైనా నుంచి అక్రమ చొరబాట్లు, ఆక్రమణలను నివారించడం; హిందూ మహా సముద్రంలో చైనా సైనిక పాటవ వ్యాప్తిని తగ్గించగలగడం, ముడిచమురు చౌకగా లభించే దేశాల నుండి దిగుమతి చేసుకోవడం. డిజిటల్‌ రంగంలో తను సాధించిన ప్రగతినీ, సాంకేతిక పరిజ్ఞానాన్నీ ఇతర దేశాలకు అందించడం; ఆహార భద్రత, పోషకాహార పంపిణీలకు సంబంధించి పేద దేశాలకు బాసటగా నిలవడం... తదితర రంగాలలో భారత్‌ కీలకమైన పాత్ర పోషించబోతోంది. కోవిడ్‌ టీకాతో సహా వివిధ రకాల టీకాలను విస్తృతంగా అభివృద్ధి పరుస్తున్న భారత్‌ నుంచి సహాయ సహకారాలు ఆశిస్తున్న దేశాల సంఖ్య ఇటీవల గణనీయంగా పెరిగింది. ఈ రంగంలో తాను సాధించిన ప్రగతిని ఆసియాలోని ఇతర దేశాలతోపాటు ఆఫ్రికా దేశా లతో పంచుకోవడంతో అంతర్జాతీయంగా  భారత్‌ పేరు ప్రతిష్ఠలు గణనీయంగా పెరిగాయి. శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక సంక్షోభ నివారణలో భారత్‌ పోషించిన పాత్ర, ఆ దేశానికి అందించిన ఆర్థిక సాయం ఐక్యరాజ్యసమితి ప్రశంసలకు నోచుకొంది.

సాధిస్తున్న అభివృద్ధికి సమాంతరంగా పాత, కొత్త సవాళ్లు ఉమ్మడిగా భారత్‌కు ఎదురవుతున్నాయి. ‘ఇది యుద్ధాల శకం’ కాదని నరేంద్ర మోదీ రష్యా–ఉక్రెయిన్‌ ల యుద్ధాన్ని దృష్టిలో పెట్టుకొని వాఖ్యానించినప్పటికీ... యుద్ధం అన్నది అనేక రూపాలలో భారత్‌ను అస్థిరపరుస్తూనే ఉంది. తూర్పున అరుణాచల్‌ప్రదేశ్‌ సరిహద్దులలో చైనా దురాక్రమణ నిరాఘాటంగా జరుగుతూనే ఉంది. కశ్మీర్‌ బోర్డర్‌లో పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదం చేస్తున్న యుద్ధం ఆగలేదు. ఇంకా, కంటికి కనిపించని సైబర్‌వార్, ఇన్ఫ ర్మేషన్‌ వార్‌ వంటివి ఎటూ ఉండనే ఉన్నాయి. వీటికితోడు వాతా వరణ మార్పుల వల్ల ఏర్పడే విపత్తులు, మానవాళి మనుగడను ప్రశ్నిస్తున్న కొత్తకొత్త వైరస్‌ల విజృంభణ తదితర సవాళ్లు ఉన్నాయి. ఈ సవాళ్లను ఎదుర్కొంటూ ప్రపంచ దేశాలకు ఆదర్శప్రాయమైన మార్గదర్శనం చేయా ల్సిన అవసరం భారత్‌పై ఉంది.

నూతన పదబంధాలను సృష్టించడంలో మన ప్రధాని నరేంద్ర మోదీని మించిన వారెవరున్నారు? ఆయన సృష్టిం చిన పదబంధమే ‘ఎకానమీ విజన్‌’. జీ20 కూటమి దేశాల మధ్య పరస్పర అనుసంధానత, బాధ్యతల భాగస్వామ్య విధానమే ప్రధాని మోదీ ప్రతిపాదించిన ‘ఎకానమీ విజన్‌ విధానం. ‘నేను నా దేశం’ (గ్రౌండ్‌ జీరో) అనే విధానానికి పూర్తిగా విరుద్ధమైనదే ఇది. ప్రపంచం అంతా ఒకే భూమి. ప్రపంచ జనాభా అంతా ఒకటే కుటుంబం. ఒకప్పుడు దీనిని ‘యుటోపియన్‌ థియరీ’గా అభివర్ణించేవారు. ‘అందరూ బాగుండాలి. అందులో నేనుండాలి’ అనే భారత ప్రాచీన ధర్మం ఇమిడి ఉన్న విధానాలతో నరేంద్ర మోదీ జీ20 దేశాల కూటమికి దిశానిర్దేశం చేయనున్నారు. శిలా జాల ఇంధనాల వాడకాన్ని నిరోధించి హరిత ఇంధనాలను పెద్దఎత్తున వినియోగంలోకి తీసుకురావడం, సూర్య రశ్మి (సోలార్‌ ఎనర్జీ)ని విరివిగా ఉపయోగించుకోవడం; పవన విద్యుత్‌ వినియోగం పెంచడం వంటి చర్యల ద్వారా పటిష్ట కార్యాచరణకు ప్రధాని సమాయత్తం అవుతున్నారు. 

నరేంద్ర మోదీ తన నాయకత్వ పటిమను అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించే ఓ మహత్తర అవకాశం నేడు లభించింది. గతంలో ప్రధానమంత్రులుగా పనిచేసిన పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇందిరాగాంధీ, అటల్‌ బిహారీ వాజ్‌పేయిలకు ఏవిధంగానైతే వారి విశిష్ట నాయ కత్వానికి వివిధ సందర్భాలలో అంతర్జాతీయ ఖ్యాతి లభించిందో... అలాగే నేడు ప్రధాని నరేంద్ర మోదీకి మరింత ఖ్యాతి దక్కడానికి జీ20 దేశాల నాయకత్వం అందివచ్చిన ఓ చక్కటి అవకాశం. దానిని ఆయన ఫల ప్రదం చేసి దేశ కీర్తి ప్రతిష్ఠలను ఇనుమడింపజేస్తారని ఆశించవచ్చు. (క్లిక్ చేయండి: సుప్రీం స్వతంత్రతే దేశానికి రక్ష)


- సి. రామచంద్రయ్య 
శాసన మండలి సభ్యులు, ఏపీ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement