చక్రపాణి నగరి
దేశ సరిహద్దులో బీఎస్‌ఎఫ్ జవాన్. వేదికల మీద పాటలు పాడుతూ తనలో ఉన్న కళకు హద్దులు లేవని నిరూపిస్తున్నారు. ‘డ్యూటీలో ఉంటూ గాన సాధన కూడా చేయడంతో ఈ పాట నాకు బాగా వంటపట్టింది’ అంటూ ఇటీవల హైదరాబాద్ వచ్చిన చక్రపాణి నగరి తన గురించి వివరించారు.
‘‘మాది శ్రీకాకుళం జిల్లా, పలాస. టెన్త్‌క్లాస్ వరకు హైదరాబాద్ హాస్టల్‌లో ఉండి చదువుకున్నాను. ఆ సమయంలో బీఎస్‌ఎఫ్‌కు సంబంధించిన ఒక ప్రకటన చూసి, అప్లై చేశాను. ఆ పరీక్షల్లో సెలక్ట్ అయ్యి 2013లో బీఎస్‌ఎఫ్‌లో చేరాను. ఇప్పటి వరకు రాజస్థాన్‌లో పని చేశాను. ఇప్పుడు సెలవు మీద హైదరాబాద్‌కు వచ్చాను. సెలవు పూర్తవగానే జమ్ములో విధులు నిర్వర్తించాలి.
డ్యూటీలో ఉంటూ..
ఏదో ఒకటి పాడుకుంటూ ఉండటం అనేది స్కూల్ టైమ్ నుంచే ఉండేది. కానీ, ఎప్పుడూ దానిని నా డ్రీమ్ ప్రాజెక్ట్ అనుకోలేదు. బీఎస్‌ఎఫ్‌లో చేరిన తర్వాత అక్కడ మా టీమ్, క్యాంపుల్లో సరదాగా పాడుతుండేవాడిని. నెలకు ఒకసారి ఏదో ఒక సెలబ్రేషన్ ప్రోగ్రామ్ జరుగుతుంటుంది. ఆ సమయంలో అన్నీ హిందీ పాటలు పాడేవాడిని. అక్కడున్నవారందరికీ హిందీ తెలుసు కాబట్టి, అవే పాటలు పాడేవాడిని. మా తోటి జవాన్‌లే కాదు ఆఫీసర్స్ కూడా చాలా ప్రోత్సహించేవారు. డ్యూటీలో ఉన్నా లేకున్నా పాటలు పాడటం మాత్రం ఆగేది కాదు.
ఇక మా ఊరికి వచ్చినప్పడు పెళ్లిళ్లు వంటి వేడుకల సందర్భాల్లోనూ నా గాన కచేరీ ఉండేది. ఖాళీ సమయంలో డిజిటల్ మీడియాని ఫాలో అవుతుంటాను. అలా, హైదరాబాద్‌లోని ఓ టీవీ పాటల కార్యక్రమంలో పాల్గొనవచ్చు అని ప్రకటన చూసి, అప్లై చేసుకున్నాను. వేల మందిలో నాకు అవకాశం రావడంతో చాలా సంతోషంగా అనిపించింది. ఈ విషయాన్ని మా అధికారులకు చెబితే వాళ్లూ వెంటనే ఓకే చేశారు. ఇక్కడ కార్యక్రమంలో పాల్గొనడమే కాదు, గాన గంధర్వుడు బాలుగారి మైక్‌ను కానుకగా అందుకోవడం చాలా ఆనందాన్నిచ్చింది.
కష్టపడుతూ..
మా అమ్మానాన్నలకు మేం ముగ్గురం. నా చిన్నప్పుడే నాన్న చనిపోవడంతో మా అమ్మ చాలా కష్టాలు పడింది. మమ్మల్ని హాస్టల్‌లో ఉంచి, తెలిసినవారి ద్వారా ఢిల్లీ వెళ్లి, పనులు చేసి, మాకు డబ్బు పంపేది. ఇప్పుడు అమ్మ ఊళ్లో వ్యవసాయం పనులు చేస్తుంది. అన్నయ్య సొంతగా బేకరీ నడిపిస్తున్నాడు. అక్క గ్రామవాలంటీర్‌గా చేస్తోంది. మాకు కష్టం విలువ తెలుసు, స్వయంగా ఎదగడానికి మా వంతుగా కృషి చేస్తూనే వచ్చాం. ఆ కష్టంలో నుంచే ఈ పాట పుట్టుకు వచ్చిందనుకుంటాను. ఎక్కడ ఉన్నా కళ రాణిస్తుందనడానికి నేనే ఉదాహరణ అనిపిస్తుంటుంది. మరిన్ని కార్యక్రమాల్లో పాల్గొని సింగర్‌గా రాణించాలనుకుంటున్నాను’’ అని తెలియజేశాడు ఈ జవాన్.
– నిర్మలారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment