వీళ్లకేం మేసే రోగం! | government officers are doing fraud in different sectors | Sakshi
Sakshi News home page

వీళ్లకేం మేసే రోగం!

Published Tue, Sep 9 2014 1:24 AM | Last Updated on Sat, Sep 2 2017 1:04 PM

వీళ్లకేం మేసే రోగం!

వీళ్లకేం మేసే రోగం!

వాళ్లంతా ప్రభుత్వోద్యోగులు. నెల తిరిగే సరికి వేలాది రూపాయల వేతనం చేతికందుతుంది. ఏ చీకూ చింతా లేకుండా హాయిగా బతికేయొచ్చు. తాము చే సిన పనికి లభించిన వేతనంతో తృప్తిపడదామని అనుకోవడం లేదు. కానీ ఎందుకో ప్రజల సొమ్మును కూడా భోంచేయాలనే దుర్బుద్ధి పుడుతోంది. ఇంకేముంది అందినకాడికి దండుకుంటున్నారు. ఇటీవల జరుగుతున్న పలు సంఘటనలు ప్రభుత్వ ఉద్యోగుల తీరుతెన్నులకు అద్దం పడుతున్నాయి.    
 
కడప అర్బన్: కడప ఆర్ట్స్ కళాశాలలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రఘురామిరెడ్డి 18.60 లక్షల రూపాయలను స్వాహా చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. అలాగే ఆర్టీఏ కార్యాలయంలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న చక్రపాణి రూ. 5 లక్షలు మాయం చేసేశాడు. ఇక కడప డీసీసీ బ్యాంకు సిబ్బంది ఏకంగా తాకట్టు పెట్టిన బంగారు నగలనే మార్చేశారనే ఆరోపణలు  ఎదుర్కొంటున్నారు.
 
ఆర్టీఏ కార్యాలయంలో ఐదు లక్షలు మాయం..
ఆర్టీఏ కార్యాలయంలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న చక్రపాణి గతనెల 28వ తేదీన రూ.13లక్షలు ట్రెజరీ నుంచి నగదు రూపంలో కార్యాలయానికి తీసుకొచ్చాడు. రూ.5లక్షలను ఉద్యోగులకు వేతనాలుగా పంపిణీ చేశాడు. మిగిలిన రూ.8లక్షలను బీరువాలో ఉంచి సెలవుపై వెళ్లాడు. నాలుగు రోజుల తర్వాత కార్యాలయానికి తిరిగి వచ్చి బీరువా తెరిచి చూస్తే రూ.3లక్షలు మొత్తం మాత్రమే ఉంది. మిగిలిన రూ.5లక్షలు కనిపించలేదు. బీరువాకు వేసిన తాళం వేసినట్లే ఉంటే ఈ ఐదు లక్షలు ఎలా మాయమయ్యాయనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
 
ఆ ప్రశ్నకు సమాధానం సదరు ఉద్యోగి అయినా చెప్పాలి.. లేదంటే కార్యాలయ ఉన్నతాధికారులైనా చెప్పాలి. ఇవేమీ లేకుండా జరిగిన సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయకుండానే, డబ్బు గురించి పూర్తిగా విచారించకుండానే సంజాయిషీ ఇవ్వాలని నోటీసు ఇవ్వడం.. అదేరోజు అకౌంటెంట్ రూ.5లక్షలు ఠంచన్‌గా జమ చేసేయడాన్ని చూసిన వారంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ విషయం ఆ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో వారు ఇక్కడి డీటీసీపై సీరియస్ అయ్యారు. రికార్డులు తీసుకురావాలని ఆదేశాలు జారీ చేశారు. అంతేగాకుండా బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించిన అకౌంటెంట్ చక్రపాణిని సస్పెండ్ చేశారు.
 
డీసీసీ బ్యాంక్‌లో బంగారు మాయ...
చెన్నూరుకు చెందిన సాదక్ అలీ 2012 మే 4న తన అవసరం కోసం 9.5 తులాల బంగారు ఆభరణాలను జిల్లా కో ఆపరేటివ్ సొసైటీ బ్యాంక్‌లో తాకట్టు పెట్టి రూ.1.36లక్షలను రుణంగా తీసుకున్నాడు. రుణం తీసుకునే సమయంలో బ్యాంకు అప్రైజర్ వీరబ్రహ్మాచారి నగలను పరిశీలించి వాటి నాణ్యత, విలువను నిర్ధారించాకే రుణం మంజూరైంది. మరలా 2013 జులై 25న రెన్యువల్ చేసేటప్పుడు కూడా అదే అప్రైజర్ బంగారు ఆభరణాలను సరిచూశారు. ఈ నేపథ్యంలో బ్యాంక్ అధికారుల ఆదేశాల మేరకు గత నెల 27వ తేదీన వీరబ్రహ్మాచారి, మరో అప్రైజర్ పి.గిరి 520 ఖాతాలకు సంబంధించిన బంగారు ఆభరణాలను రెండు రోజుల్లో సరి చూశారు.
 
ఈ క్రమంలో సాదక్ అలీ రెండు రోజుల క్రితం రెన్యువల్ కోసం డబ్బు కట్టేందుకు వెళ్లాడు. ఆ సమయంలో తన నగలు నకిలీవని బ్యాంక్ అధికారులు తె లపడంతో అవాక్కైన సాదక్ అలీ పోలీసులను ఆశ్రయించాడు. మరోవైపు డీసీసీ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ ఎస్‌కె వలీచాంద్ కూడా తమ సిబ్బందితో వచ్చి సాదక్ అలీ ఇచ్చిన నగలు నకిలీవని ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు విచారించి ఆ నగలను తీసుకురావాలని చెప్పినప్పటికీ బ్యాంకు అధికారులు నగలను అప్పజెప్పకుండానే కేసు నమోదు చేయాలని కోరడం గమనార్హం. ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపితే  వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉంది.
 
ఇవే కాకుండా ఇటీవల ఎర్రగుంట్ల ఎంపీడీఓ జయసింహ సాక్షరభారత్ నిధులను స్వాహా చేశారనే కారణంగా అతనిపై క్రిమినల్ కేసు నమోదైంది. గతంలో కడపలో ఓ స్టేట్‌బ్యాంక్ అధికారి కూడా ఇదే రీతిలో మోసాలకు పాల్పడ్డాడు.  ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ఉదాహరణలు కనిపిస్తాయి. జిల్లా ఉన్నతాధికారులు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో మరొకరు ఇలాంటి చర్యలకు పాల్పడే అవకాశం ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
 
ఆర్ట్స్ కళాశాలలో ఏం జరిగిందంటే..
ఆర్ట్స్ కళాశాలలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రఘురామిరెడ్డి 2013లో తమ కళాశాలలో డిగ్రీ చదివి వెళ్లిన మారుతీనగర్‌కు చెందిన కృపాకర్ అనే విద్యార్థి పేరు మీద సెంట్రల్ బ్యాంక్‌లో ఖాతా ఉండటంతో తన దగ్గరున్న చెక్కు బుక్కుతో అక్షరాలా రూ.4.30 లక్షలను రాయించి ఇచ్చాడు. ఆంధ్రాబ్యాంక్‌కు చెక్కు వెళ్లి సెంట్రల్ బ్యాంక్‌లో కృపాకర్ ఖాతాలో రూ.4.30లక్షలు జమ అయింది. కృపాకర్‌ను అడ్డుపెట్టుకొని రఘురామిరెడ్డి, అతని స్నేహితుడు ఎంఎం బాషా, వారి సహచరులు చిన్ని, మ్యారేజ్ బ్యూరో నడుపుతున్న కవిత అనే వారు ఎంచక్కా రూ.4.25లక్షలను డ్రా చేసుకున్నారు.
 
సెంట్రల్ బ్యాంక్ మేనేజర్‌కు అనుమానం వచ్చి ఆర్ట్స్ కళాశాల ఖాతా నుంచి ఒకే విద్యార్థికి రూ.4.30లక్షలు ఎందుకు జమ అయిందో సంజాయిషీ అడిగారు. సదరు విద్యార్థిని పిలిపించి అథారిటీ లెటర్ తీసుకురావాలని కోరారు. కృపాకర్ రఘురామిరెడ్డిని సంప్రదించగా కవిత ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ వెంకటలక్షుమ్మ సంతకాన్ని ఫోర్జరీ చేసి అథారిటీ లెటర్ తయారుచేసి ఇచ్చింది. ఆ సంతకాలలో ఒకటి నకిలీదని బ్యాంక్ మేనేజర్ గుర్తించి నిలదీశారు. ప్రిన్సిపల్‌ను పిలిపించి వ్యవహారాన్ని తేల్చమని చెప్పారు. దీంతో ఆమె రఘురామిరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగడంతో రఘురామిరెడ్డి అండ్ పార్టీ వ్యవహారం బయటపడింది. కడప నగరంలో ఆర్ట్స్ కళాశాలకు సంబంధించిన ఖాతాలు బోలెడున్నాయి. ఇదే అదనుగా భావించిన రఘురామిరెడ్డి మొదట తన స్నేహితుడు ఎంఎంబాషా పేరుతో రూ.4600 చెక్కును రాయించి ఎస్‌బీఐ బ్యాంక్‌కు పంపించాడు.
 
వెంటనే ఆ మొత్తం ఎంఎంబాషా పేరు మీద ట్రాన్స్‌ఫర్ అయింది. ఆ తర్వాత మారుతీనగర్‌కు చెందిన కృపాకర్ పేరు మీద రూ.4.30 లక్షలు, రామిరెడ్డి అనే వ్యక్తి పేరు మీద రూ.4,84,500,  రూ.4,74,500 అనే రెండు చెక్కులు రాయించాడు. ఇతను బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతా తెరిచి ఈ మొత్తం ఖాతాలో పడగానే డబ్బును డ్రా చేసుకొని వెంటనే ఖాతా కూడా రద్దు చేసుకున్నాడు. రఘురామిరెడ్డి బంధువు మనోరంజన్‌రెడ్డి అనంతపురంలో వ్యాపారం చేస్తున్నాడు. అతని స్నేహితుడు సర్దార్ ఖాతాలో రూ.4.70లక్షల మొత్తాన్ని జమచేసి వెంటనే డ్రా చేసుకున్నాడు. ఇలా మొత్తం రూ.18.60లక్షలను స్వాహా చేసిన రఘురామిరెడ్డి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఇన్ని లక్షల రూపాయలను స్వాహా చేస్తుంటే ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారనేది అర్థంకాని ప్రశ్న.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement