రాయవరం : స్వచ్ఛభారత్ పథకంలో భాగంగా ప్రతి ఇంటికీ ఓ మరుగుదొడ్డి ఉండాలని ప్రభుత్వం చెబుతోంది. వాటి నిర్మాణం కోసం పేదలకు ఆర్థిక సాయం కూడా అందిస్తోంది. వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణానికి దరఖాస్తు చేసుకునే విధానం.. ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం వివరాలివీ..
ఎవరు అర్హులంటే..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా గ్రామీణ నీటి సరఫరా (ఆర్‌డబ్ల్యూఎస్) విభాగం ఆధ్వర్యాన పేదలకు మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాయి. తెలుపురంగు రేషన్‌కార్డు, ఆధార్ కార్డు కలిగిన వారు ప్రభుత్వ ఆర్థిక సాయంతో మరుగుదొడ్లు నిర్మించుకోవడానికి అర్హులు. మరుగుదొడ్డి నిర్మించుకోవాలనుకునేవారు ముందుగా దరఖాస్తు పూర్తి చేసి, రేషన్, ఆధార్‌కార్డులు, బ్యాంకు పాస్ పుస్తకం జిరాక్స్ కాపీలను జత చేసి పంచాయతీ కార్యదర్శికి అందజేయాలి.
లబ్ధిదారులను ఇలా ఎంపిక చేస్తారు
వచ్చిన దరఖాస్తులను పంచాయతీ కార్యదర్శి పరిశీలించి పంచాయతీ పాలకవర్గంలో తీర్మానం చేసి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ఎంపికైనవారి జాబితాను ఎంపీడీవోకు పంపిస్తారు. ఆయన ఆ జాబితాను ఆర్‌డబ్ల్యూఎస్ పర్యవేక్షక ఇంజనీర్‌కు పంపిస్తారు. అక్కడ పరిశీలన అనంతరం ఆ దరఖాస్తులు జిల్లా కలెక్టర్‌కు చేరుతాయి. కలెక్టర్ ఆమోదంతో మరుగుదొడ్లు మంజూరవుతాయి.
కొలతల ప్రకారం నిర్మాణం
అధికారులు ఇచ్చిన కొలతల ప్రకారమే లబ్ధిదారులు మరుగుదొడ్డి నిర్మించుకోవాల్సి ఉంటుంది. ఇవి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ఆరడుగుల పొడవు, నాలుగడుగుల వెడల్పు, రెండోది నాలుగు అడుగుల పొడవు, మూడడుగుల వెడల్పు. ఏ కొలత ప్రకారం నిర్మించుకున్నా పైకప్పుగా రేకు వేసుకోవాలి.
ఆర్థిక సాయం ఎంతంటే..
లబ్ధిదారుడు నిర్మించుకున్న మరుగుదొడ్డి కొలతలనుబట్టి ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది. ఆరడుగుల పొడవు, నాలుగడుగుల వెడల్పున నిర్మించుకుంటే రూ.15 వేలు, నాలుగడుగుల పొడవు, మూడడుగుల వెడల్పున నిర్మించుకుంటే రూ.12 వేలు చొప్పున లబ్ధిదారునికి రెండు దశల్లో చెల్లిస్తారు. ఈ మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం, కేంద్ర ప్రభుత్వం 75 శాతం సమకూరుస్తాయి. ఈ సాయాన్ని లబ్ధిదారుని బ్యాంకు ఖాతాకు నేరుగా జమ చేస్తారు.
‘స్వచ్ఛత’వైపు అడుగులేయండిలా..
Published Sat, Feb 27 2016 1:45 AM | Last Updated on Tue, Aug 28 2018 5:25 PM
Advertisement
Advertisement