యాచారం, న్యూస్‌లైన్: ప్రజలకు సెల్‌ఫోన్ వినియోగంపై ఉన్న ఆసక్తి.. మరుగుదొడ్ల వాడకంపై లేకుండాపోయిందని, అధికారులే వారిలో చైతన్యం తీసుకరావాల్సిన అవసరం ఉందని గ్రామీణ నీటి సరఫరా పథకం (ఆర్‌డబ్ల్యూఎస్) జాతీయ సంయుక్త కార్యదర్శి సత్య బ్రతసాహు అన్నారు. ఆదివారం ఆయన ఆర్‌డబ్ల్యూఎస్ విభాగం రాష్ట్ర కార్యదర్శి వికాస్‌రాజ్, ఇంజినీరింగ్ చీఫ్ చక్ర పాణి తదితర అధికారులతో మండలంలోని గునుగల్ పంచాయతీ కార్యాలయంలో గ్రామ శానిటేషన్ కమిటీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా.. గ్రామంలోని అన్ని ఇళ్లకు మరుగుదొడ్లు, నల్లా కనెక్షన్లు ఉన్నాయా... లేని వారు ఎందుకు నిర్మించుకోలేదు.. ఎందుకు తీసుకోలేదు అని మహిళలను ఆయన అడిగారు. గ్రామంలో నీటి సరఫరా, పారిశుద్ధ్యం పరిస్థితి ఎలా ఉంది. తాగునీటి వాడకం పన్నులు చెల్లిస్తున్నారా తదితర విషయాలను వారిని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా పలువురు మహిళలు.. తమకు మరుగుదొడ్లు లేవని, ఆర్థిక పరిస్థితుల కారణంగా నిర్మించుకోలేదని చెప్పారు. దీనికి స్పందించిన సత్యబ్రత సాహు వెంటనే మీ ఇంట్లో సెల్‌ఫోను ఉందా అని అడిగారు. ఉందని మహిళలు సమాధానమిచ్చారు. నల్లా కనెక్షన్ ఉందా అని అడగ్గా.. ఉందన్నారు. నెలకు ఎంత బిల్లు చెల్లిస్తున్నారు అని ఆయన అడగ్గా.. నెలకు రూ. 15 వరకు చెల్లిస్తున్నామని మహిళలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజల్లో సెల్‌ఫోన్ వాడకంపై ఉన్న శ్రద్ధ.. మరుగుదొడ్డి, నల్లా కనెక్షన్ తీసుకోవడంలో మాత్రం లేదని అన్నారు. పరిసరాల పరిశుభ్రత కోసం మరుగుదొడ్డి ఎంతో అవసరం, నీటి అవసరాల కోసం ఇంటి వద్ద నల్లా ఎంతో అవసరం కాని ఆ రెంటిపై లేని శ్రద్ధ రూ. వేలల్లో సెల్‌ఫోను సేవలకు పేదలు ఖర్చు చేస్తున్నార న్నారు. అధికారులే ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని, అప్పుడే ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి, నల్లా కనెక్షన్ ఉంటాయని చెప్పారు.
పేదలకు ఉచితంగా మరుగుదొడ్లు నిర్మిస్తాం
పేదలకు ఆర్‌డబ్ల్యూఎస్, ఈజీఎస్‌లు సంయుక్తంగా ఉచితంగా మరుగుదొడ్లు నిర్మించడానికి కృషి చేస్తున్నాయని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సత్యబ్రత సూచించారు. పేదలు మరుగుదొడ్డి నిర్మించుకునేలా, నల్లా కనెక్షన్ తీసుకునేలా గ్రామాల్లోని ఆశ, అంగన్‌వాడీ సిబ్బంది కృషి చేస్తే ఒక్కోదానికి రూ.75 చెల్లిస్తామని ఆయన స్పష్టంచేశారు. వందశాతం మరుగుదొడ్లు, నల్లా కనెక్షన్లు నిర్మించుకునేలా ఆశ, అంగన్‌వాడీ సిబ్బంది కృషి చేయాలని సూచించారు. దేశంలో పలు రాష్ట్రాల్లో నల్లా బిల్లు నెలకు రూ. 75 పైనే ఉందని ఇక్కడ కూడాఆ విధంగా వసూలు చేసి పంచాయతీ ఆదాయాన్ని పెంచుకునేలా అధికారులు, సర్పంచ్‌లు కృషి చేయాలని సూచించారు.
గునుగల్ రిజర్వాయర్ సందర్శన
అంతకుముందు సత్య బ్రతసాహు ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజవర్గాలకు కృష్ణా జలాలు సరఫరా చేసే గునుగల్‌లోని రిజర్వాయర్‌ను సందర్శించారు.సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. కృష్ణాజలాలు వాడుకోవడం కోసం ప్రజల నుంచి నెలకు ఎంత పన్ను వసూలు చేస్తున్నారని అడిగారు. గ్రామంలో అవసరమైన నీటి ట్యాంకు, సంప్, పైపులైన్ ఏర్పా టు కోసం నిధులు మంజూరు చేయాలని సత్యబ్రతసాహుకు సర్పం చ్ మల్లికార్జున్ వినతిపత్రం అందజేశారు. అవసరమైన నిధులు మంజూ రు చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ జగదీశ్వర్‌రెడ్డి, డీఈ విజయలక్ష్మి, ఏఈ రవికుమార్, యాచారం ఎంపీడీఓ ఉష, ఈఓఆర్డీ శంకర్‌నాయక్, సర్పంచ్ అచ్చెన మల్లికార్జున్, పంచాయతీ కార్యదర్శి మిస్కిన్ తదితరులు పాల్గొన్నారు.
సెల్‌ఫోన్‌కు ఇచ్చే ప్రాధాన్యం..మరుగుదొడ్లకు ఇవ్వడంలేదు
Published Mon, Dec 23 2013 12:42 AM | Last Updated on Tue, Aug 28 2018 5:25 PM
Advertisement
Advertisement