కన్నీళ్లే!
– దాహార్తి తీర్చని జేసీ నాగిరెడ్డి పథకం
– వృథాగా సంపులు, సబ్‌స్టేషన్లు
– విలువైన పరికరాలకు భద్రత కరువు
– నిర్వహణ బాధ్యత మరచిన ఆర్‌డబ్ల్యూఎస్
–––––––––––––––––––––––––––––––––
ఒకట్రెండు కాదు.. ఏకంగా 1,200 గ్రామాల దాహార్తి తీర్చేందుకు ఉద్దేశించిన పథకమది. వందలు, లక్షలు కాదు.. రూ.కోట్ల నిధులతో నిర్మాణం చేపట్టారు. తొలినాళ్లలో పనులు చకచకా సాగాయి. వాటిని చూసి ఇక తమ దాహార్తి తీరినట్లేనని ఆయా గ్రామాల ప్రజలు సంబరపడ్డారు. అయితే.. వారి ఆనందం ఎంతో కాలం నిలువ లేదు. పథకం నిరుపయోగంగా మారింది. సంపులు, సబ్‌స్టేషన్లు ఎందుకూ పనికి రాకుండా పోయాయి. విలువైన పరికరాలు కొన్ని మాయమయ్యాయి. మరికొన్ని తుప్పు పట్టిపోతున్నాయి. ఇదీ జేసీ నాగిరెడ్డి తాగునీటి పథకం తీరు.
––––––––––––––––––––––––––––––––––––––
తాడిపత్రి : జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు రక్షిత నీటిని అందించాలన్న ఉద్దేశంతో జేసీ నాగిరెడ్డి తాగునీటి పథకాన్ని చేపట్టారు. ఈ పథకం పరిధిలోకి తాడిపత్రి, శింగనమల, అనంతపురం, గుంతకల్లు, ధర్మవరం నియోజకవర్గాల్లోని 1,200 గ్రామాలు వస్తాయి. వైఎస్సార్ జిల్లాలోని గండికోట రిజర్వాయర్ నుంచి 1.2 టీఎంసీల నీటిని శుద్ధి చేసి.. అనంతరం ఆయా గ్రామాలకు సరఫరా చేయాలన్న లక్ష్యంతో చేపట్టారు. ఇందుకోసం రూ.508 కోట్లు కేటాయించారు. ఇప్పటికే 90 శాతం పనులు పూర్తయ్యాయి.
ఐదింటికే నీరు
ప్రస్తుతం ఈ పథకం ద్వారా రోజూ మూడు లక్షల లీటర్ల నీరు మాత్రమే సరఫరా అవుతోంది. అది కూడా తాడిపత్రి టౌన్, గన్నెవారిపల్లి, చల్లవారిపల్లి, జమ్ములపాడుకు సరఫరా చేస్తున్నారు. ఈ పథకం కింద ఒక్కో సంప్‌నకు రూ.60 లక్షల చొప్పున ఖర్చు పెట్టి మొత్తం 15 సంపులు నిర్మించారు. పంపింగ్ కేంద్రాలు, సబ్ స్టేషన్లు సైతం ఏర్పాటు చేశారు. ఇందులో రెండు మాత్రమే నడుస్తున్నాయి. మిగిలిన 13 సంపులు, పంపింగ్ కేంద్రాలు, సబ్‌స్టేషన్లు వథాగా మారాయి. పర్యవేక్షణ లేకపోవడంతో విలువైన పరికరాలకు భద్రత లేకుండా పోయింది. ఇప్పటికే కొన్ని పరికరాలను దుండగులు ఎత్తుకెళ్లారు. మరికొన్ని తుప్పుపట్టిపోతున్నాయి. సంపులు, సబ్‌స్టేషన్లు, పంపింగ్ హౌస్‌ల చుట్టూ కంపచెట్లు విపరీతంగా పెరిగిపోయాయి. అటువైపు వెళ్లేందుకు ఎవరూ సాహసించడం లేదు. రూ.కోట్ల విలువైన పథకం కళ్లెదుటే నిరుపయోగంగా మారినా ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు పట్టించుకోవడం లేదు. పరికరాలను ఉపయోగించకపోయినా వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఉందన్న విషయాన్ని మరచిపోయారు.
ప్రణాళిక రూపొందించాం – ఫయాజ్, డీఈ, జేసీ నాగిరెడ్డి పథకం
సంపుల్లో రెండు మాత్రమే ఉపయోగిస్తున్నాం. మిగిలిన వాటిని పని చేసే స్థితికి తీసుకొచ్చేందుకు ప్రణాళిక తయారు చేశాం. దశల వారీగా చర్యలు తీసుకుంటాం.