jc nagireddy scheme
-
‘పథకం’ ప్రకారం ‘నీరు’గార్చారు!
- మాయమైన జేసీ నాగిరెడ్డి పథకం యంత్ర పరికరాలు - ఇతర అవసరాలకు వినియోగం! - నీరుగారిపోయిన భారీ పథకం - ‘అపహరణ’పై ప్రభుత్వానికి నివేదిక - ఈ విషయం తెలిసి ఉన్నతాధికారిపై ఓ ప్రజాప్రతినిధి చిందులు అనంతపురం సిటీ : అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జేసీ నాగిరెడ్డి తాగునీటి పథకం నీరుగారిపోయింది. కొందరు నేతల స్వార్థం, అధికారుల అలసత్వం కారణంగా ఈ పథకం ఉద్దేశం నెరవేరలేదు. ఈ పథకానికి సంబంధించిన యంత్ర పరికరాలు సైతం మాయమైపోయాయి. వాటిని అపహరించి..ఇతర అవసరాలకు వినియోగిస్తున్నట్లు సమాచారం. 2007లో రూ.508 కోట్ల అంచనా వ్యయంతో ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. వైఎస్సార్ జిల్లాలోని గండికోట రిజర్వాయర్ నుంచి పైపులైన్ ద్వారా తాగునీటిని తీసుకొచ్చి తాడిపత్రి, శింగనమల, గుంతకల్లు నియోజకవర్గాలు, రాప్తాడు నియోజకవర్గంలోని కొన్నింటికి కలిపి...మొత్తం 514 గ్రామాలకు సరఫరా చేయాలన్నది ఈ పథకం ముఖ్యోద్దేశం. మొత్తం రూ. 508 కోట్ల పనుల్లో ఇప్పటిదాకా రూ.370 కోట్ల పనులు పూర్తి చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఇంకా రూ.138 కోట్ల నిధులు మిగిలివున్నాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి రికార్డులు కూడా అధికారుల వద్ద లేవని తెలుస్తోంది. గతంలో పనిచేసిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, కొందరు నేతలు కలిసి వీటిని మాయం చేసినట్లు సమాచారం. పథకం మొదలుపెట్టి పదేళ్లు అవుతున్నా, రూ.370 కోట్ల వరకు నిధులు ఖర్చు చేసినా.. కనీసం ఐదు శాతం గ్రామాలకు కూడా నీటిని అందించలేకపోతున్నారు. ప్రస్తుతం తాడిపత్రి నియోజకవర్గంలోని 14 గ్రామాలతో పాటు మునిసిపాలిటీకి మాత్రమే సరఫరా చేస్తున్నారు. పనులు అసంపూర్తిగా ఉండటంతో మిగిలిన నియోజక వర్గాలకు నీటి సరఫరా సాధ్యం కావడం లేదు. రెండేళ్ల క్రితమే పనుల కాంట్రాక్టు గడువు కూడా ముగిసింది. కొందరు నేతల స్వార్థం కారణంగానే సకాలంలో పూర్తి కాలేదన్న విమర్శలున్నాయి. పనులు వేగవంతం చేసిన అప్పటి అధికారులకు స్థానికంగా ఉన్న కొందరు నేతలు అడ్డు పడుతూ వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో అధికారులు కూడా ‘నీటి కొరత’ సాకుతో పథకాన్ని గాలికొదిలేశారు. పత్తా లేని పరికరాలు జేసీ నాగిరెడ్డి పథకానికి వినియోగించిన పైపులు, పంప్ హౌస్‌ల్లోని యంత్ర పరికరాలు చాలావరకు మాయమయ్యాయి. వాటి వివరాలు కూడా అధికారుల వద్ద లేవు. ఈ విషయంలో కాంట్రాక్టర్‌దే బాధ్యత అని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేయించాలని ప్రభుత్వానికి నివేదించారు. ‘అపహరణ’ వెనుక పెద్దల హస్తం ఉండటంతో ఈ తలనొప్పి తమకెందుకులే అనుకుని సర్కారుకే అప్పగించినట్లు తెలుస్తోంది. కాగా.. అపహరించిన పరికరాలను మరో చోట వినియోగించి బిల్లులు చేసుకున్నట్లు సమాచారం. అధికారులకు ఓ నేత వార్నింగ్ యంత్ర పరికరాల అపహరణ విషయాన్ని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు గత కలెక్టర్ కోన శశిధర్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న ఓ ప్రజా ప్రతినిధి.. ఆర్డబ్ల్యూఎస్ ఉన్నతాధికారికి తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు. తమ పేర్లు బయటకు వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించినట్లు తెలిసింది. -
కన్నీళ్లే!
– దాహార్తి తీర్చని జేసీ నాగిరెడ్డి పథకం – వృథాగా సంపులు, సబ్స్టేషన్లు – విలువైన పరికరాలకు భద్రత కరువు – నిర్వహణ బాధ్యత మరచిన ఆర్డబ్ల్యూఎస్ ––––––––––––––––––––––––––––––––– ఒకట్రెండు కాదు.. ఏకంగా 1,200 గ్రామాల దాహార్తి తీర్చేందుకు ఉద్దేశించిన పథకమది. వందలు, లక్షలు కాదు.. రూ.కోట్ల నిధులతో నిర్మాణం చేపట్టారు. తొలినాళ్లలో పనులు చకచకా సాగాయి. వాటిని చూసి ఇక తమ దాహార్తి తీరినట్లేనని ఆయా గ్రామాల ప్రజలు సంబరపడ్డారు. అయితే.. వారి ఆనందం ఎంతో కాలం నిలువ లేదు. పథకం నిరుపయోగంగా మారింది. సంపులు, సబ్స్టేషన్లు ఎందుకూ పనికి రాకుండా పోయాయి. విలువైన పరికరాలు కొన్ని మాయమయ్యాయి. మరికొన్ని తుప్పు పట్టిపోతున్నాయి. ఇదీ జేసీ నాగిరెడ్డి తాగునీటి పథకం తీరు. –––––––––––––––––––––––––––––––––––––– తాడిపత్రి : జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు రక్షిత నీటిని అందించాలన్న ఉద్దేశంతో జేసీ నాగిరెడ్డి తాగునీటి పథకాన్ని చేపట్టారు. ఈ పథకం పరిధిలోకి తాడిపత్రి, శింగనమల, అనంతపురం, గుంతకల్లు, ధర్మవరం నియోజకవర్గాల్లోని 1,200 గ్రామాలు వస్తాయి. వైఎస్సార్ జిల్లాలోని గండికోట రిజర్వాయర్ నుంచి 1.2 టీఎంసీల నీటిని శుద్ధి చేసి.. అనంతరం ఆయా గ్రామాలకు సరఫరా చేయాలన్న లక్ష్యంతో చేపట్టారు. ఇందుకోసం రూ.508 కోట్లు కేటాయించారు. ఇప్పటికే 90 శాతం పనులు పూర్తయ్యాయి. ఐదింటికే నీరు ప్రస్తుతం ఈ పథకం ద్వారా రోజూ మూడు లక్షల లీటర్ల నీరు మాత్రమే సరఫరా అవుతోంది. అది కూడా తాడిపత్రి టౌన్, గన్నెవారిపల్లి, చల్లవారిపల్లి, జమ్ములపాడుకు సరఫరా చేస్తున్నారు. ఈ పథకం కింద ఒక్కో సంప్‌నకు రూ.60 లక్షల చొప్పున ఖర్చు పెట్టి మొత్తం 15 సంపులు నిర్మించారు. పంపింగ్ కేంద్రాలు, సబ్ స్టేషన్లు సైతం ఏర్పాటు చేశారు. ఇందులో రెండు మాత్రమే నడుస్తున్నాయి. మిగిలిన 13 సంపులు, పంపింగ్ కేంద్రాలు, సబ్స్టేషన్లు వథాగా మారాయి. పర్యవేక్షణ లేకపోవడంతో విలువైన పరికరాలకు భద్రత లేకుండా పోయింది. ఇప్పటికే కొన్ని పరికరాలను దుండగులు ఎత్తుకెళ్లారు. మరికొన్ని తుప్పుపట్టిపోతున్నాయి. సంపులు, సబ్స్టేషన్లు, పంపింగ్ హౌస్‌ల చుట్టూ కంపచెట్లు విపరీతంగా పెరిగిపోయాయి. అటువైపు వెళ్లేందుకు ఎవరూ సాహసించడం లేదు. రూ.కోట్ల విలువైన పథకం కళ్లెదుటే నిరుపయోగంగా మారినా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పట్టించుకోవడం లేదు. పరికరాలను ఉపయోగించకపోయినా వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఉందన్న విషయాన్ని మరచిపోయారు. ప్రణాళిక రూపొందించాం – ఫయాజ్, డీఈ, జేసీ నాగిరెడ్డి పథకం సంపుల్లో రెండు మాత్రమే ఉపయోగిస్తున్నాం. మిగిలిన వాటిని పని చేసే స్థితికి తీసుకొచ్చేందుకు ప్రణాళిక తయారు చేశాం. దశల వారీగా చర్యలు తీసుకుంటాం.