‘పథకం’ ప్రకారం ‘నీరు’గార్చారు!
- మాయమైన జేసీ నాగిరెడ్డి పథకం యంత్ర పరికరాలు
- ఇతర అవసరాలకు వినియోగం!
- నీరుగారిపోయిన భారీ పథకం
- ‘అపహరణ’పై ప్రభుత్వానికి నివేదిక
- ఈ విషయం తెలిసి ఉన్నతాధికారిపై ఓ ప్రజాప్రతినిధి చిందులు
అనంతపురం సిటీ : అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జేసీ నాగిరెడ్డి తాగునీటి పథకం నీరుగారిపోయింది. కొందరు నేతల స్వార్థం, అధికారుల అలసత్వం కారణంగా ఈ పథకం ఉద్దేశం నెరవేరలేదు. ఈ పథకానికి సంబంధించిన యంత్ర పరికరాలు సైతం మాయమైపోయాయి. వాటిని అపహరించి..ఇతర అవసరాలకు వినియోగిస్తున్నట్లు సమాచారం. 2007లో రూ.508 కోట్ల అంచనా వ్యయంతో ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. వైఎస్సార్ జిల్లాలోని గండికోట రిజర్వాయర్ నుంచి పైపులైన్ ద్వారా తాగునీటిని తీసుకొచ్చి తాడిపత్రి, శింగనమల, గుంతకల్లు నియోజకవర్గాలు, రాప్తాడు నియోజకవర్గంలోని కొన్నింటికి కలిపి...మొత్తం 514 గ్రామాలకు సరఫరా చేయాలన్నది ఈ పథకం ముఖ్యోద్దేశం. మొత్తం రూ. 508 కోట్ల పనుల్లో ఇప్పటిదాకా రూ.370 కోట్ల పనులు పూర్తి చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఇంకా రూ.138 కోట్ల నిధులు మిగిలివున్నాయి.
ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి రికార్డులు కూడా అధికారుల వద్ద లేవని తెలుస్తోంది. గతంలో పనిచేసిన ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు, కొందరు నేతలు కలిసి వీటిని మాయం చేసినట్లు సమాచారం. పథకం మొదలుపెట్టి పదేళ్లు అవుతున్నా, రూ.370 కోట్ల వరకు నిధులు ఖర్చు చేసినా.. కనీసం ఐదు శాతం గ్రామాలకు కూడా నీటిని అందించలేకపోతున్నారు. ప్రస్తుతం తాడిపత్రి నియోజకవర్గంలోని 14 గ్రామాలతో పాటు మునిసిపాలిటీకి మాత్రమే సరఫరా చేస్తున్నారు. పనులు అసంపూర్తిగా ఉండటంతో మిగిలిన నియోజక వర్గాలకు నీటి సరఫరా సాధ్యం కావడం లేదు. రెండేళ్ల క్రితమే పనుల కాంట్రాక్టు గడువు కూడా ముగిసింది. కొందరు నేతల స్వార్థం కారణంగానే సకాలంలో పూర్తి కాలేదన్న విమర్శలున్నాయి. పనులు వేగవంతం చేసిన అప్పటి అధికారులకు స్థానికంగా ఉన్న కొందరు నేతలు అడ్డు పడుతూ వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో అధికారులు కూడా ‘నీటి కొరత’ సాకుతో పథకాన్ని గాలికొదిలేశారు.
పత్తా లేని పరికరాలు
జేసీ నాగిరెడ్డి పథకానికి వినియోగించిన పైపులు, పంప్ హౌస్‌ల్లోని యంత్ర పరికరాలు చాలావరకు మాయమయ్యాయి. వాటి వివరాలు కూడా అధికారుల వద్ద లేవు. ఈ విషయంలో కాంట్రాక్టర్‌దే బాధ్యత అని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేయించాలని ప్రభుత్వానికి నివేదించారు. ‘అపహరణ’ వెనుక పెద్దల హస్తం ఉండటంతో ఈ తలనొప్పి తమకెందుకులే అనుకుని సర్కారుకే అప్పగించినట్లు తెలుస్తోంది. కాగా.. అపహరించిన పరికరాలను మరో చోట వినియోగించి బిల్లులు చేసుకున్నట్లు సమాచారం.
అధికారులకు ఓ నేత వార్నింగ్
యంత్ర పరికరాల అపహరణ విషయాన్ని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు గత కలెక్టర్ కోన శశిధర్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న ఓ ప్రజా ప్రతినిధి.. ఆర్‌డబ్ల్యూఎస్ ఉన్నతాధికారికి తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు. తమ పేర్లు బయటకు వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించినట్లు తెలిసింది.