– ఆర్‌డబ్ల్యూఎస్, పీఆర్‌లో నేతల పెత్తనం
– అడుగులకు మడుగులొత్తే వారికే ప్రాధాన్యత
– మానసిక ఒత్తిడితో ఆత్మహత్యకు పాల్పడుతున్న ఉద్యోగులు
– పంచాయతీరాజ్ శాఖలో ఒకే జేఈ మూడు చోట్ల విధులు
– ఆదాయం తెచ్చి పెడితే కోరిన చోటుకు డిప్యూటేషన్
అనంతపురం సిటీ : గ్రామీణ రక్షిత మంచినీటి విభాగం (ఆర్‌డబ్ల్యూఎస్), పంచాయతీరాజ్ (పీఆర్) శాఖలో అధికార పార్టీ నేతల పెత్తనం పెరిగిపోయింది. తమకు కావలసిన వారిని కోరుకున్న చోటుకు డిప్యూటేషన్‌పై పంపాల్సిందే. మాట వినకుంటే ఉన్నతస్థాయి అధికారులకైనా ప్రత్యక్ష నరకం చూపుతున్నారు. తాజాగా ఈ శాఖలోని ఓ ఉన్నతాధికారి తనకు అనుకూలంగా పనులు చేసి పెట్టలేదన్న కారణంగా ఓ ప్రజాప్రతినిధి నేరుగా కార్యాలయానికి వచ్చి తీవ్రస్థాయిలో మందలించినట్లు తెలిసింది. మానసిక ఒత్తిడికి గురై కొందరు అధికారులు, ఉద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలూ లేకపోలేదు. జిల్లా పరిషత్ సీఈఓ పర్యవేక్షణలో జరగాల్సిన డిప్యూటేషన్‌లను ఆయా శాఖల ఉన్నతాధికారులు తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. ఆదాయం తెచ్చిపెడితే కోరిన చోటుకు డిప్యూటేషన్ వేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అత్యవసరమైతే తప్ప సీఈఓ స్థాయి అధికారి ఈ డిప్యూటేషన్‌లలో సిబ్బందిని విధులకు పంపరాదు. కానీ ఈ రెండు శాఖల్లో నిబంధనలు అమలు కావడం లేదు. ప్రధానంగా పంచాయతీరాజ్ శాఖలో లోపాయికారి ఒప్పందాలు చాలా ఎక్కువని ఉద్యోగులు వాపోతున్నారు.
విధులక్కడ.. జీతమిక్కడ
పంచాయతీరాజ్ శాఖలో ఐదేళ్లు పదవి కాలం పూర్తయిన వారికి తప్పని సరి బదిలీ ఉంటుంది. కాగా, ఉన్నతాధికారికి సన్నిహితంగా.. రాజకీయ నేతల అడుగులకు మడుగులు ఒత్తే వారికి కోరుకున్న చోటుకు పోస్టింగ్ ఇస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. తాడిపత్రిలో డీఈ అసలు స్థానాన్ని వదిలేసి రాయదుర్గంలో విధులు నిర్వహిస్తున్నారు. జీతం తీసుకుంటోంది మాత్రం తాడిపత్రిలోనే... ఇందులో మరో విశేషం ఏమిటంటే అనంతపురం ఎస్‌ఈ ఆఫీసులో విధులు నిర్వహించే అధికారిని తాడిపత్రికి డిప్యూటేషన్‌పై పంపారు.
జేఈ ఒకరే.. విధులు మూడు చోట్ల
గుత్తిలో విధులు నిర్వహించాల్సిన జేఈ మడకశిరతో పాటు కదిరిలో కూడా జేఈగా కొనసాగుతున్నారు. జీతం గుత్తిలోనే తీసుకుంటున్నారు. ఇదెలా సాధ్యమని తోటి ఉద్యోగులు మండి పడుతున్నారు. ఎవరు చేతులు తడిపితే వారికి ఉన్నతాధికారులు జీ హుజూర్ అంటున్నారని విమర్శిస్తున్నారు. కణేకల్ జేఈగా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి పుట్లూరులో జీతం తీసుకుంటున్నారు. ఇక ధర్మవరంలో విధులు నిర్వహించాల్సిన వ్యక్తి పెద్దవడుగూరులో డిప్యూటేషన్‌పై కొనసాగుతున్నారు.
డిప్యూటేషన్ల విషయమై పంచాయతీరాజ్ ఎస్‌ఈ సుబ్బారావును వివరణ కోరగా.. తాను కొత్తగా వచ్చానని, ఎవరెవరు ఎక్కడెక్కడ విధులు నిర్వహిస్తున్నారనే వివరాలు పూర్తిగా తెలియదని చెప్పారు.
రెండ్రోజుల క్రితం యథాస్థానాలకు పంపాం - ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ, హరేరామ్‌నాయక్
రెండు రోజుల క్రితం 28 మంది డిప్యూటేషన్‌లను రద్దు చేసి యథాస్థానాలకు పంపాం. మొదటి నుంచి పోస్టింగ్ ఎక్కడకు వస్తే అక్కడికే అధికారులను పంపాం. వారికున్న ఇబ్బందుల రీత్యా విధులకు వెళ్లలేని స్థితిలో ఉంటే సర్కిల్ కార్యాలయంలోనే అవకాశం కల్పించాం. మా వద్ద డిప్యూటేషన్‌పై వెళ్లిన వారు లేరు.
డిప్యు‘టెన్షన్’!
Published Tue, May 2 2017 11:50 PM | Last Updated on Tue, Sep 5 2017 10:13 AM
Advertisement
Advertisement