pr department
-
పీఆర్ శాఖలో త్వరలో కారుణ్య నియామకాలు
సాక్షి, హైదరాబాద్: కొత్తగా నియమితులైన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు (ఏఈ ఈ) నాణ్యతపై రాజీలేకుండా, ప్రమాణాలు పాటిస్తూ శాశ్వతంగా నిలిచిపోయేలా పనులు చేపట్టాలని మంత్రి సీతక్క సూచించారు. తమ శాఖ పరిధిలో త్వరలోనే 500కు పైగా కారుణ్య నియామకాలు చేపట్టనున్నట్టు వెల్లడించారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వంతోపాటు సీఎం రేవంత్‌రెడ్డి అంగీకా రం తెలిపారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రూ.1, 375 కోట్లతో రోడ్లు వేయబోతున్నామని, ఏఈఈల ఆధ్వర్యంలో ఈ పనులు ప్రారంభం కావడం అదృష్టమని తెలిపారు. ‘అభివృద్ధి పనుల్లో మీ మార్కును చూపాలి. నాణ్యత లేని పనులు చేస్తే సస్పెండ్ అవుతారు’అని హెచ్చరించారు. ఇటీవల నియామక పత్రాలు అందుకున్న ఏఈఈలకు మంగళవారం పంచాయతీరాజ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ కార్యాలయంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ, అందరూ నిబద్ధతతో అంకితభావంతో ప్రజలకు సేవ చేయాలన్నారు. రాష్ట్రంలో సంక్షేమ గురుకులాలు మూతపడుతున్నాయని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆనందపడుతున్నారని, బీఆర్ఎస్ హయాంలోనే గురుకులాల అద్దె లు రూ. కోట్లలో పెండింగ్‌లో పెట్టారని చెప్పా రు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా పార్టీ సమీక్ష అనంతరం ఆమె గాం«దీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. -
పంచాయతీ సెక్రటరీలకు నియామకపత్రాలు
సాక్షి, హైదరాబాద్: జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకాలకు లైన్ క్లియర్ అయ్యింది. రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ఓటింగ్ ముగిసిన వెంటనే (ఈ నెల 11, 12 తేదీల్లో) ఎంపికైన జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు నియామకపత్రాలు అందజేయాలని జిల్లా కలెక్టర్లకు పంచాయతీరాజ్ శాఖ ఆదేశాలిచ్చింది. నియామకపత్రాలు అందజేసిన తర్వాత తమకు నివేదికలు సమర్పించాలని కలెక్టర్లకు సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ నియామక ఉత్తర్వులు జారీ అయ్యేలా పంచాయతీరాజ్ కమిషనర్ తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. బుధవారం ఈ మేరకు పీఆర్ శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ ఓ మెమో ద్వారా ఈ ఆదేశాలిచ్చారు. పంచాయతీ కార్యదర్శులకు నియామకపత్రాలు ఇచ్చేప్పుడు వారిని సొంత గ్రామపంచాయతీల్లో నియమించకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు పీఆర్ కమిషనర్ నీతూ కుమారీ ప్రసాద్ సూచించారు. పరిషత్ ఎన్నికల నేపథ్యంలో... రాష్ట్రంలో త్వరలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో వీరి నియామకాలకు ప్రాధాన్యత ఏర్పడింది. మండల, జిల్లా పరిషత్ ఎన్నికల విధుల నిర్వహణకు వీరి సేవలు అత్యంత అవసరమని ›ప్రభుత్వం భావిస్తోంది. గ్రామస్థాయిల్లో వివిధ సేవల నిర్వహణ, ఎండాకాలంలో గ్రామపంచాయతీల్లో వివిధ విధులు గ్రామ కార్యదర్శుల ఆధ్వర్యంలోనే నిర్వహిస్తున్నందున వీరి నియామకాలు వెంటనే చేపట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. గత అక్టోబర్ 10న రాతపరీక్ష గతేడాది ఆగస్టు 30వ తేదీన 9,355 జూనియర్ పంచాయతీ సెక్రటరీ పోస్టుల భర్తీకి గానూ నోటిఫికేషన్ జారీ చేశారు. దీనికి అనుగుణంగా గత అక్టోబర్ 10వ తేదీన రాత పరీక్ష నిర్వహించారు. గత డిసెంబర్ 18వ తేదీన ఫలితాలు ప్రకటించారు. అయితే పోస్టుల భర్తీ విషయంలో నిబంధనలు సరిగా పాటించలేదంటూ కోర్టులో దాఖలైన కేసుల కారణంగా కొంతకాలం ఈ నియామకాల ప్రక్రియ నిలిచిపోయింది. ఈ ఏడాది ఫిబ్రవరి 24 నుంచి శాసనమండలి ఎన్నికల ప్రవర్తనా నియమావళి, ఆ తర్వాత మార్చి 10 నుంచి లోక్‌సభ ఎన్నికల నియమావళి అమల్లోకి రావడంతో ఎంపికైన అభ్యర్థులకు నియామకపత్రాలు జారీచేయలేదు. ఈ అంశాన్ని పీఆర్ శాఖ, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వారా కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియజేసింది. ఎన్నికల నియామవళికి సంబంధించిన అంశం కావడంతో ఈసీ దీనిని స్క్రీనింగ్ కమిటీ పరిశీలనకు పంపించింది. పంచాయతీ సెక్రటరీల నియామకాలపై రాష్ట్ర సీఈవోతో పాటు రాష్ట్ర ఎన్నికల కమిషన్, స్క్రీనింగ్ కమిటీని సంప్రదించారు. నియామకాలకు వారు ఆమోదం తెలపడంతో గురువారం సాయంత్రం 5 గంటలకు రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ఓటింగ్ ముగిసిన తర్వాత నియామకపత్రాలు అందించాలని పీఆర్ శాఖ ఆదేశాలిచ్చింది. -
డిప్యు‘టెన్షన్’!
– ఆర్డబ్ల్యూఎస్, పీఆర్లో నేతల పెత్తనం – అడుగులకు మడుగులొత్తే వారికే ప్రాధాన్యత – మానసిక ఒత్తిడితో ఆత్మహత్యకు పాల్పడుతున్న ఉద్యోగులు – పంచాయతీరాజ్ శాఖలో ఒకే జేఈ మూడు చోట్ల విధులు – ఆదాయం తెచ్చి పెడితే కోరిన చోటుకు డిప్యూటేషన్ అనంతపురం సిటీ : గ్రామీణ రక్షిత మంచినీటి విభాగం (ఆర్డబ్ల్యూఎస్), పంచాయతీరాజ్ (పీఆర్) శాఖలో అధికార పార్టీ నేతల పెత్తనం పెరిగిపోయింది. తమకు కావలసిన వారిని కోరుకున్న చోటుకు డిప్యూటేషన్‌పై పంపాల్సిందే. మాట వినకుంటే ఉన్నతస్థాయి అధికారులకైనా ప్రత్యక్ష నరకం చూపుతున్నారు. తాజాగా ఈ శాఖలోని ఓ ఉన్నతాధికారి తనకు అనుకూలంగా పనులు చేసి పెట్టలేదన్న కారణంగా ఓ ప్రజాప్రతినిధి నేరుగా కార్యాలయానికి వచ్చి తీవ్రస్థాయిలో మందలించినట్లు తెలిసింది. మానసిక ఒత్తిడికి గురై కొందరు అధికారులు, ఉద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలూ లేకపోలేదు. జిల్లా పరిషత్ సీఈఓ పర్యవేక్షణలో జరగాల్సిన డిప్యూటేషన్లను ఆయా శాఖల ఉన్నతాధికారులు తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. ఆదాయం తెచ్చిపెడితే కోరిన చోటుకు డిప్యూటేషన్ వేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అత్యవసరమైతే తప్ప సీఈఓ స్థాయి అధికారి ఈ డిప్యూటేషన్లలో సిబ్బందిని విధులకు పంపరాదు. కానీ ఈ రెండు శాఖల్లో నిబంధనలు అమలు కావడం లేదు. ప్రధానంగా పంచాయతీరాజ్ శాఖలో లోపాయికారి ఒప్పందాలు చాలా ఎక్కువని ఉద్యోగులు వాపోతున్నారు. విధులక్కడ.. జీతమిక్కడ పంచాయతీరాజ్ శాఖలో ఐదేళ్లు పదవి కాలం పూర్తయిన వారికి తప్పని సరి బదిలీ ఉంటుంది. కాగా, ఉన్నతాధికారికి సన్నిహితంగా.. రాజకీయ నేతల అడుగులకు మడుగులు ఒత్తే వారికి కోరుకున్న చోటుకు పోస్టింగ్ ఇస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. తాడిపత్రిలో డీఈ అసలు స్థానాన్ని వదిలేసి రాయదుర్గంలో విధులు నిర్వహిస్తున్నారు. జీతం తీసుకుంటోంది మాత్రం తాడిపత్రిలోనే... ఇందులో మరో విశేషం ఏమిటంటే అనంతపురం ఎస్ఈ ఆఫీసులో విధులు నిర్వహించే అధికారిని తాడిపత్రికి డిప్యూటేషన్‌పై పంపారు. జేఈ ఒకరే.. విధులు మూడు చోట్ల గుత్తిలో విధులు నిర్వహించాల్సిన జేఈ మడకశిరతో పాటు కదిరిలో కూడా జేఈగా కొనసాగుతున్నారు. జీతం గుత్తిలోనే తీసుకుంటున్నారు. ఇదెలా సాధ్యమని తోటి ఉద్యోగులు మండి పడుతున్నారు. ఎవరు చేతులు తడిపితే వారికి ఉన్నతాధికారులు జీ హుజూర్ అంటున్నారని విమర్శిస్తున్నారు. కణేకల్ జేఈగా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి పుట్లూరులో జీతం తీసుకుంటున్నారు. ఇక ధర్మవరంలో విధులు నిర్వహించాల్సిన వ్యక్తి పెద్దవడుగూరులో డిప్యూటేషన్‌పై కొనసాగుతున్నారు. డిప్యూటేషన్ల విషయమై పంచాయతీరాజ్ ఎస్ఈ సుబ్బారావును వివరణ కోరగా.. తాను కొత్తగా వచ్చానని, ఎవరెవరు ఎక్కడెక్కడ విధులు నిర్వహిస్తున్నారనే వివరాలు పూర్తిగా తెలియదని చెప్పారు. రెండ్రోజుల క్రితం యథాస్థానాలకు పంపాం - ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ, హరేరామ్‌నాయక్ రెండు రోజుల క్రితం 28 మంది డిప్యూటేషన్లను రద్దు చేసి యథాస్థానాలకు పంపాం. మొదటి నుంచి పోస్టింగ్ ఎక్కడకు వస్తే అక్కడికే అధికారులను పంపాం. వారికున్న ఇబ్బందుల రీత్యా విధులకు వెళ్లలేని స్థితిలో ఉంటే సర్కిల్ కార్యాలయంలోనే అవకాశం కల్పించాం. మా వద్ద డిప్యూటేషన్‌పై వెళ్లిన వారు లేరు.