సాక్షి, హైదరాబాద్: జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకాలకు లైన్ క్లియర్ అయ్యింది. రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ఓటింగ్ ముగిసిన వెంటనే (ఈ నెల 11, 12 తేదీల్లో) ఎంపికైన జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు నియామకపత్రాలు అందజేయాలని జిల్లా కలెక్టర్లకు పంచాయతీరాజ్ శాఖ ఆదేశాలిచ్చింది. నియామకపత్రాలు అందజేసిన తర్వాత తమకు నివేదికలు సమర్పించాలని కలెక్టర్లకు సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ నియామక ఉత్తర్వులు జారీ అయ్యేలా పంచాయతీరాజ్ కమిషనర్ తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. బుధవారం ఈ మేరకు పీఆర్ శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ ఓ మెమో ద్వారా ఈ ఆదేశాలిచ్చారు. పంచాయతీ కార్యదర్శులకు నియామకపత్రాలు ఇచ్చేప్పుడు వారిని సొంత గ్రామపంచాయతీల్లో నియమించకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు పీఆర్ కమిషనర్ నీతూ కుమారీ ప్రసాద్ సూచించారు.
పరిషత్ ఎన్నికల నేపథ్యంలో...
రాష్ట్రంలో త్వరలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో వీరి నియామకాలకు ప్రాధాన్యత ఏర్పడింది. మండల, జిల్లా పరిషత్ ఎన్నికల విధుల నిర్వహణకు వీరి సేవలు అత్యంత అవసరమని ›ప్రభుత్వం భావిస్తోంది. గ్రామస్థాయిల్లో వివిధ సేవల నిర్వహణ, ఎండాకాలంలో గ్రామపంచాయతీల్లో వివిధ విధులు గ్రామ కార్యదర్శుల ఆధ్వర్యంలోనే నిర్వహిస్తున్నందున వీరి నియామకాలు వెంటనే చేపట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
గత అక్టోబర్ 10న రాతపరీక్ష
గతేడాది ఆగస్టు 30వ తేదీన 9,355 జూనియర్ పంచాయతీ సెక్రటరీ పోస్టుల భర్తీకి గానూ నోటిఫికేషన్ జారీ చేశారు. దీనికి అనుగుణంగా గత అక్టోబర్ 10వ తేదీన రాత పరీక్ష నిర్వహించారు. గత డిసెంబర్ 18వ తేదీన ఫలితాలు ప్రకటించారు. అయితే పోస్టుల భర్తీ విషయంలో నిబంధనలు సరిగా పాటించలేదంటూ కోర్టులో దాఖలైన కేసుల కారణంగా కొంతకాలం ఈ నియామకాల ప్రక్రియ నిలిచిపోయింది. ఈ ఏడాది ఫిబ్రవరి 24 నుంచి శాసనమండలి ఎన్నికల ప్రవర్తనా నియమావళి, ఆ తర్వాత మార్చి 10 నుంచి లోక్‌సభ ఎన్నికల నియమావళి అమల్లోకి రావడంతో ఎంపికైన అభ్యర్థులకు నియామకపత్రాలు జారీచేయలేదు.
ఈ అంశాన్ని పీఆర్ శాఖ, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వారా కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియజేసింది. ఎన్నికల నియామవళికి సంబంధించిన అంశం కావడంతో ఈసీ దీనిని స్క్రీనింగ్ కమిటీ పరిశీలనకు పంపించింది. పంచాయతీ సెక్రటరీల నియామకాలపై రాష్ట్ర సీఈవోతో పాటు రాష్ట్ర ఎన్నికల కమిషన్, స్క్రీనింగ్ కమిటీని సంప్రదించారు. నియామకాలకు వారు ఆమోదం తెలపడంతో గురువారం సాయంత్రం 5 గంటలకు రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ఓటింగ్ ముగిసిన తర్వాత నియామకపత్రాలు అందించాలని పీఆర్ శాఖ ఆదేశాలిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment