![Telangana Launches Web Portal Roadmap On EVs - Sakshi](/styles/webp/s3/article_images/2022/06/12/PRESS-PHOTO.jpg.webp?itok=ZQEHyjWG)
‘రెడ్కో’ నివేదికను ఆవిష్కరిస్తున్న ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్‌శర్మ బ్రిటన్ మంత్రి నైజెల్ ఆడమ్స్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌ను ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో గ్లోబల్ లైట్‌హౌస్ సిటీగా అభివృద్ధి చేయడానికి బ్రిటన్ సహకారంతో రాష్ట్ర పునరుత్పాదక ఇంధన వనరుల సంస్థ(రెడ్కో) రూపొందించిన నివేదికను రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్‌శర్మ బ్రిటన్ మంత్రి నైజెల్ ఆడమ్స్‌తో కలసి శనివారం ఇక్కడ ఆవిష్కరించారు. ఎలక్ట్రిక్ వాహన రంగంలో పరిశోధనలపై పెట్టుబడులు పెట్టి, పరీక్షించి చూసే ప్రయోగశాలను లైట్‌హౌస్ సిటీగా పరిగణిస్తారు.
దశలవారీగా అమలు చేయాల్సిన ప్రణాళికలను ఈ నివేదికలో సిఫారసు చేశారు. ప్రధానంగా యూకేలో అమలు చేస్తున్న ఉత్తమ విధానాల ఆధారంగా ఈ సిఫారసులు చేశారు. ఈ సిఫారసులు అమలులోకి వస్తే రూ.30,360 కోట్ల పెట్టుబడులతోపాటు 1.20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలంగాణ రెడ్కో ఒక ప్రకటనలో తెలిపింది. దీనికితోడు 2030 నాటికి వాతావరణంలో 45.84 మిలియన్ టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ కాలుష్యాన్ని నివారించగలమని తెలిపింది.
రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడానికి నీతి ఆయోగ్, యూకే ప్రభుత్వ సహకారంతో రూపలక్పన చేసిన ‘టీఎస్‌ఈవీ’వెబ్‌పోర్టల్‌ను సైతంఈ కార్యక్రమంలో ఆవిష్కరించారు. సాంకేతిక మార్పిడికి యూకే, భారత ప్రధానుల మధ్య గతంలో జరిగిన ఒప్పందంలో భాగంగా యూకే ఈ మేరకు సహకారాన్ని అందించింది. కార్యక్రమంలో రెడ్‌కో వైస్ చైర్మన్, ఎండీ జానయ్య, బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment