జలదరింపే! | water problems | Sakshi
Sakshi News home page

జలదరింపే!

Published Sat, May 9 2015 11:37 PM | Last Updated on Sat, Sep 29 2018 5:21 PM

water problems

సీపీడబ్ల్యూఎస్ పథకాల నిర్వహణ నుంచి తప్పుకొన్న ఆర్‌డబ్ల్యూఎస్
ఈ పథకాల బాధ్యతంతా జలమండలి పరిధిలోకి..
నీటి చార్జీల వసూలు మొదలు కేటాయింపులపై వాటర్‌బోర్డుదే తుదినిర్ణయం

 
సాక్షి, రంగారెడ్డి జిల్లా : జిల్లాలో సమగ్ర రక్షిత మంచినీటి పథకాల (సీపీడబ్ల్యూఎస్) అమలు బాధ్యత నుంచి గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్‌డబ్ల్యూఎస్) తప్పుకుంది. ఈ పథకాల నిర్వహణను జలమండలి (హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ)కి అప్పగించింది. ఇకపై పథకాల నిర్వహణతోపాటు పర్యవేక్షణ బాధ్యతలన్నీ జలమండలే చూసుకోనుంది. నీటి కేటాయింపులు మొదలు.. చార్జీల వసూలులో వాటర్‌బోర్డు అధికారుల నిర్ణయమే కీలకం కానుంది. ప్రస్తుతం జిల్లాలో 11 సీపీడబ్ల్యూఎప్ పథకాలు కొనసాగుతున్నాయి. వీటి ద్వారా ఔటర్ రింగ్‌రోడ్డు లోపల, వెలుపల ఉన్న 161 గ్రామ పంచాయతీలు, హాబిటేషన్లలోని ప్రజలకు రక్షిత నీటిని అందిస్తోంది.

బకాయిలపై బ్రహ్మాస్త్రమే..!
 ఇప్పటివరకు ఆర్‌డబ్ల్యూఎస్ విభాగం ఆధీనంలో ఉన్న సీపీడబ్ల్యూఎస్ పథకాలన్నీ తాజాగా జలమండలి పరిధిలోకి వచ్చాయి. జిల్లాలో నీటి బకాయిలపై గత కొన్నేళ్లుగా పేచీ పెడుతున్న వాటర్‌బోర్డు అధికారులు.. ప్రస్తుత బకాయిలపై కఠినంగా వ్యవహరించనున్నారు. గతేడాది ఏప్రిల్ వరకు జిల్లా యంత్రాంగం వాటర్‌బోర్డుకు రూ.86.50 కోట్లు బకాయిపడింది. బకాయిల చెల్లించాలంటూ రెండు, మూడు సార్లు నీటి సరఫరాను నిలిపివేసిన సందర్భాలున్నాయి. ఈ క్రమంలో తాజాగా సీపీడబ్ల్యూఎస్ పథకాల పగ్గాలు తీసుకున్న జలమండలి యంత్రాంగం.. బకాయిలపై సర్‌చార్జీలతో సహా వసూళ్ళుకు దిగనుందని ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి.

 ఆర్థికసంఘం నిధులకు మంగళం..
 గ్రామీణ ప్రాంతాల్లో రక్షిత మంచినీటి సరఫరాకు ఫైనాన్స్ కమిషన్ ప్రత్యేకంగా నిధులిస్తోంది. గత 13వ ఆర్థిక సంఘం ద్వారా ఏటా రూ.13.25 కోట్లు జిల్లాకు విడుదలయ్యేవి. వీటిని నేరుగా తాగునీటి అవసరాల్లో భాగంగా జలమండలికి బిల్లుల రూపంలో నిధులు చెల్లించేవారు. ప్రస్తుతం సీపీడబ్ల్యూఎస్ పథకాలపై జిల్లా గ్రామీణ నీటిసరఫరా విభాగం తప్పుకోవడంతో ఆ నిధులు ఆర్‌డబ్ల్యూఎస్ ఖాతాకు వచ్చే అవకాశంలేదని ఆ శాఖ అధికారి ఒకరు ‘సాక్షి’తో పేర్కొన్నారు.

కొత్త పథకాలు గగనమే..
 ఇదిలాఉండగా కొత్త పథకాలపై జలమండలి ఆచితూచి స్పందించనుంది. ప్రస్తుత పథకాలకు సంబంధించి భారీ బకాయిలున్న నేపథ్యంలో కొత్త పథకాలు అంత త్వరగా కార్యరూపం దాల్చే అవకాశంలేదని తెలుస్తోంది. జిల్లాలో కొత్తగా ఆరు సీపీడబ్ల్యూఎస్ పథకాలు చేపట్టాలని జిల్లా గ్రామీణ నీటి సరఫరా విభాగం ప్రణాళికలు రూపొందించింది. వీటికిగాను రూ. 36.16కోట్లు అవసరమని గుర్తిస్తూ ప్రభుత్వానికి నివేదికలిచ్చింది. తాజాగా సీపీడబ్ల్యూఎస్ పథకాలన్నీ జలమండలి ఖాతాలోకి వెల్లడంతో గత బకాయిలు వసూళ్ల ప్రక్రియ పూర్తయితే తప్ప కొత్తవి చేపట్టే అవకాశంలేదని తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement