సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పాతాళ గంగమ్మ పైపైకి వస్తోంది. మూడేళ్లుగా వర్షాలు సమృద్ధిగా కురవడం, ఆ వర్షపు నీరు వృథా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం జల సంరక్షణ చర్యలు చేపట్టడంతో భూగర్భ జలమట్టం గణనీయంగా పెరిగింది. ఎండిపోయిన బోర్లు, బావుల్లో కూడా నీటి లభ్యత పెరిగింది. దాంతో రైతుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. రబీలో సుమారు 24 లక్షల ఎకరాల్లో బోర్లు, బావుల కింద పంటలు సాగయ్యే అవకాశం ఉందని అధికారవర్గాలు చెబుతున్నాయి.
ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభానికి ముందు భూగర్భ జలమట్టం రాష్ట్రంలో సగటున 9.29 మీటర్లు ఉంటే.. వర్షాకాలం ముగిసే సరికి అది 5.78 మీటర్లకు చేరింది. అంటే.. ఏకంగా 3.51 మీటర్ల మేర భూగర్భ జలమట్టం పెరిగింది. 2018 సంవత్సరంలో వర్షాకాలం ముగిసిన తర్వాత భూగర్భ జలమట్టం 12.85 మీటర్ల లోతులో ఉండేది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జల సంరక్షణ చర్యలు ముమ్మరం చేసింది. దీంతో గత మూడేళ్లలో భూగర్భ జలాలు క్రమంగా పెరుగుతూ ప్రస్తుతం 5.78 మీటర్లలో అందుబాటులోకి వచ్చాయి. ఈ స్థాయిలో అందుబాటులోకి రావడం మూడు దశాబ్దాల తర్వాత ఇదే ప్రథమమని అధికారవర్గాలు చెబుతున్నాయి.
జల సంరక్షణపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ
రాష్ట్రంలో ఈ ఏడాది సగటున 850.5 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా 876.85 మిల్లీమీటర్లు కురిసింది. అంటే.. సాధారణం కంటే 3.15 శాతం అధికంగా కురిసింది. వాగులు, వంకలు, నదులు ఉరకలెత్తాయి. ప్రభుత్వం చేపట్టిన జల సంరక్షణ చర్యలతో కుంటలు, చెక్ డ్యామ్‌లు, చెరువులు, ప్రాజెక్టులు నిండాయి. దాంతో భూగర్భ జలాలు పుష్కలంగా పెరిగాయి.
రెయిన్ గేజ్‌ల ద్వారా వర్షపాతాన్ని, 1,868 ఫీజియో మీటర్ల ద్వారా భూగర్భ జలమట్టాన్ని నిత్యం లెక్క వేస్తున్న సర్కారు.. భూగర్భ జల మట్టాలను ఎప్పటికప్పుడు విశ్లేషించింది. వర్షపాతానికి అనుగుణంగా భూగర్భ జలాలు పెరగని ప్రాంతాల్లో ఇంకుడు గుంతలు, చెక్ డ్యామ్‌లు నిర్మించింది. ఫలితంగా ఎన్నడూ లేని రీతిలో భూగర్భ జలమట్టం పెరిగింది. ఎండిపోయిన బోర్లు, బావుల్లో కూడా నీరు వచ్చింది. సాగు, తాగు నీరు పుష్కలంగా అందుబాటులోకి వచ్చింది. భూగర్భ జలాలు పెరగడం వల్ల బోర్లు, బావుల్లో నీటి కాలుష్య తీవ్రత కూడా గణనీయంగా తగ్గిందని అధికారులు చెబుతున్నారు.
వైఎస్సార్ కడపలో అత్యధికం.. పశ్చిమగోదావరిలో అత్యల్పం
రాష్ట్రంలో వైఎస్సార్ కడప జిల్లాలో 2.69 మీటర్లలోనే భూగర్భ జలాలు లభ్యమవుతుండగా.. పశ్చిమగోదావరి జిల్లాలో 14.82 మీటర్లలో అందుబాటులో ఉన్నాయి. దుర్భిక్ష ప్రాంతమైన అనంతపురం జిల్లాలో కేవలం 8.11 మీటర్లలోనే లభ్యమవుతున్నాయి. ఉభయగోదావరి జిల్లాల కంటే అనంతపురం జిల్లాలో భూగర్భజలాలు పుష్కలంగా అందుబాటులో ఉండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment