pathala ganga
-
శ్రీశైలం పాతాళగంగలో నీటి కుక్కల సందడి
సాక్షి, నంద్యాల: నంద్యాల జిల్లా శ్రీశైలంలోని పాతాళ గంగలో నీటి కుక్కలు(Otters) సందడి చేశాయి. ఏపీ టూరిజం శాఖ ఏర్పాటు చేసిన జెట్టుపై విన్యాసాలు చేస్తూ యాత్రికులకు కనిపించాయి. అవి నీటి నుండి బయటకు వచ్చి పుణ్య స్థానాలు చేస్తున్న భక్తులను ఆకర్షింస్తున్నాయి. భక్తులు అలా వాటిని చూస్తుండిపోయేలా కట్టిపడేస్తున్నాయి. శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం తగ్గడంతో నీటి కుక్కలు పాతాళగంగ ఒడ్డుకొచ్చాయి. మెట్ల మార్గంలో నీటి కుక్కలు(Otters)కనిపించడంతో సందర్శకులు పెద్ద ఎత్తున ఫొటోలు, వీడియోల్లో వాటిని బంధించారు. ఇది కూడా చదవండి: పోలవరంపై కేంద్రం పిటిషన్: ఏపీ హైకోర్టు నుంచి బదిలీకి సుప్రీం కోర్టు నిరాకరణ -
పాతాళగంగ ఉప్పొం'గంగ'
గురజాల డివిజన్లోని బొల్లాపల్లి, వెల్దుర్తి తదితర మండలాల్లో గత ఏడాది మేనెలలో భూగర్భ జలాలు భారీగా అడుగంటాయి. గతేడాది జనవరి, మే నెలల్లో డివిజన్ సరాసరి భూగర్భ జల మట్టాలు వరుసగా 11.10, 13.27 మీటర్లుగా నమోదయ్యాయి. అనంతరం జూన్ నుంచి సమృద్ధిగా వానలు కురవడంతో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. గత ఆరునెలల కాలంలో సాధారణంగా 666.68 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 808.93 మిల్లీమీటర్ల వాన కురిసింది. ఇది సాధారణం కన్నా 21.33 శాతం అధికం. ప్రస్తుతం గురజాల డివిజన్లో భూగర్భ జలాలు 7.58 మీటర్లకు ఎగబాకాయి. అంటే మేనెలతో పోలిస్తే 5.69 మీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగాయి ’’. సాక్షి, అమరావతి బ్యూరో: జిల్లాలో పాతాళ గంగ పైపైకి ఎగబాకుతోంది. చుక్క నీరు కూడా లేక ఎండిన పోయిన బోర్లు నిండైన నీటి ధారతో ఉప్పొంగుతున్నాయి. ఈ ఏడాది విస్తారంగా వర్షాలు పడడం, కృష్ణానదికి వరుసగా వరదలు రావడంతో జిల్లాలోని నాలుగు డివిజన్లలోనూ భూగర్భ నీటిమట్టాలు గణనీయంగా పెరిగాయి. కరువుసీమ పల్నాడులోనూ జలసిరులు ఉబికివస్తున్నాయి. ఫలితంగా సర్వత్రా ఆనందం వ్యక్తమవుతోంది. గత మే నెలతో పోలిస్తే.. జిల్లాలో గత ఏడాది మే నెలతో పోలిస్తే 2.89 మీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగాయి. గత మే నెలలో జిల్లాలో సరాసరి భూగర్భ నీటిమట్టం 8.07 మీటర్లుగా నమోదైంది. ప్రస్తుతం 5.18 మీటర్లకు భూగర్భ జలాలు ఎగబాకాయి. ప్రస్తుతం న్యూజెండ్ల మండలం చింతలచెరువు గ్రామంలో 0.31 మీటర్ల లోతులోనే భూగర్భ జలాలు లభ్యమవుతున్నాయి. గురజాల డివిజన్లోని వెల్దుర్తి గ్రామంలో 46.24 మీటర్ల లోతుకు నీటిమట్టం పడిపోయింది. జిల్లాలో 57 మండలాలు ఉండగా, 34 మండలాల్లో 0 నుంచి 3 మీటర్లలోపు, 18 మండలాల్లో 3 నుంచి 8మీటర్లలోపు, రెండు మండలాల్లో 8 నుంచి 15 మీటర్లలోపు, మూడు మండలాల్లో 15 మీటర్ల కన్నా ఎక్కువ లోతులో నీరు అందుబాటులో ఉంది. నీటికి కటకటలాడే బొల్లాపల్లి, వెల్దుర్తి మండలాల్లోనూ భూగర్భ జలాలు బాగా వృద్ధి చెందడం విశేషం. ఈ మండలాల్లో ఏప్రిల్ వరకు బోర్లలో నీరు వచ్చే అవకాశం పుష్కలంగా ఉండటంతో రైతులు పంటల సాగు చేపట్టారు. కృష్ణానది పరీవాహక ప్రాంతాల్లో మాత్రం ఒక మీటరు లోతులోపే భూగర్భజలాలు లభ్యమవుతుండడం గమనార్హం. గురజాల మండలం చర్లగుడిపాడులో ఓ వ్యవసాయ బోరు నుంచి మోటారు పెట్టకముందే నీరు బయటకు వస్తున్న దృశ్యం (ఫైల్) భూగర్భంలోకి 30.02 టీఎంసీలు గతేడాది జూన్ నుంచి ఇప్పటివరకు సగటు సాధారణ వర్షపాతం 746.08 మిల్లీమీటర్లుగా నమోదుకాగా, 820.31 మిల్లీమీటర్ల వాన కురిసింది. అంటే 9.94 శాతం అధిక సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా గురజాల డివిజన్లో 21.33 శాతం అధిక వర్షపాతం నమోదైంది. వర్షాల వల్ల 333.57 టీఎంసీల నీరు జిల్లా భూమిపైకి చేరగా, అందులో 30.02 టీఎంసీల నీరు భూమిలోకి ఇంకింది. ప్రభుత్వ చర్యల వల్లే మార్పు ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్లే భూగర్భ జలాలు గణనీయంగా పెరిగినట్టు అధికారులు చెబుతున్నారు. ఇంకుడు గుంతలు, చెరువుల పూడిక తీత పనులు అధికమొత్తంలో చేపట్టడం సత్ఫలితాలనిస్తోందని పేర్కొంటున్నారు. ప్రజలు మరింత చైతన్యంతో వ్యవహరించి ఇంకుడు గుంతలు ఎక్కువగా తవ్వితే.. ఇంకా మంచి ఫలితాలు వస్తాయని, జిల్లాలో నీటికి కొదవ ఉండదని అధికారులు సూచిస్తున్నారు. నీటి మట్టాలు పెరిగాయి గతంలో వర్షాలు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డాం. తాగడానికి గుక్కెడు మంచినీరు దొరకని పరిస్థితి ఉండేది. ప్రస్తుతం సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా భూగర్భ జలాలు పెరిగాయి. దీంతో బోర్లలోనూ నీటి మట్టం పెరిగింది. తాగు, సాగునీటి సమస్య తీరింది. బోరు నుంచి ప్రస్తుతం సమృద్ధిగా నీరువస్తోంది. ఐదెకరాల్లో మిరప, శనగ పంట సాగుచేశా. ఇప్పుడు సంతోషంగా పంటలు పండించుకుంటున్నాం. – తవనం వెంగళరెడ్డి, రైతు, రెమిడిచర్ల గ్రామం, బొల్లాపల్లి మండలం పొదుపుగా వాడుకోవాలి వర్షాలు అధికంగా నమోదు కావడంతో భూగర్భ నీటిమట్టాలు పెరిగాయి. సాధారణ వర్షపాతం కన్నా 9.94 శాతం అధిక వర్షాలు నమోదయ్యాయి. గత ఆరు నెలల కాలంలో 30 టీఎంసీల నీరు భూమిలోకి ఇంకింది. జిల్లాలో 34 మండలాల్లో 3 మీటర్ల కన్నా లోపే భూగర్భ జలాలు లభిస్తున్నాయి. రైతులు జలాలను పొదుపుగా వాడుకోవాలి. – బి నాగరాజు, ఇన్చార్జ్ డీడీ, భూగర్భ జలవనరుల శాఖ, గుంటూరు -
పైపైకి పాతాళగంగ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పాతాళ గంగమ్మ పైపైకి వస్తోంది. మూడేళ్లుగా వర్షాలు సమృద్ధిగా కురవడం, ఆ వర్షపు నీరు వృథా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం జల సంరక్షణ చర్యలు చేపట్టడంతో భూగర్భ జలమట్టం గణనీయంగా పెరిగింది. ఎండిపోయిన బోర్లు, బావుల్లో కూడా నీటి లభ్యత పెరిగింది. దాంతో రైతుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. రబీలో సుమారు 24 లక్షల ఎకరాల్లో బోర్లు, బావుల కింద పంటలు సాగయ్యే అవకాశం ఉందని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభానికి ముందు భూగర్భ జలమట్టం రాష్ట్రంలో సగటున 9.29 మీటర్లు ఉంటే.. వర్షాకాలం ముగిసే సరికి అది 5.78 మీటర్లకు చేరింది. అంటే.. ఏకంగా 3.51 మీటర్ల మేర భూగర్భ జలమట్టం పెరిగింది. 2018 సంవత్సరంలో వర్షాకాలం ముగిసిన తర్వాత భూగర్భ జలమట్టం 12.85 మీటర్ల లోతులో ఉండేది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జల సంరక్షణ చర్యలు ముమ్మరం చేసింది. దీంతో గత మూడేళ్లలో భూగర్భ జలాలు క్రమంగా పెరుగుతూ ప్రస్తుతం 5.78 మీటర్లలో అందుబాటులోకి వచ్చాయి. ఈ స్థాయిలో అందుబాటులోకి రావడం మూడు దశాబ్దాల తర్వాత ఇదే ప్రథమమని అధికారవర్గాలు చెబుతున్నాయి. జల సంరక్షణపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ రాష్ట్రంలో ఈ ఏడాది సగటున 850.5 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా 876.85 మిల్లీమీటర్లు కురిసింది. అంటే.. సాధారణం కంటే 3.15 శాతం అధికంగా కురిసింది. వాగులు, వంకలు, నదులు ఉరకలెత్తాయి. ప్రభుత్వం చేపట్టిన జల సంరక్షణ చర్యలతో కుంటలు, చెక్ డ్యామ్‌లు, చెరువులు, ప్రాజెక్టులు నిండాయి. దాంతో భూగర్భ జలాలు పుష్కలంగా పెరిగాయి. రెయిన్ గేజ్‌ల ద్వారా వర్షపాతాన్ని, 1,868 ఫీజియో మీటర్ల ద్వారా భూగర్భ జలమట్టాన్ని నిత్యం లెక్క వేస్తున్న సర్కారు.. భూగర్భ జల మట్టాలను ఎప్పటికప్పుడు విశ్లేషించింది. వర్షపాతానికి అనుగుణంగా భూగర్భ జలాలు పెరగని ప్రాంతాల్లో ఇంకుడు గుంతలు, చెక్ డ్యామ్‌లు నిర్మించింది. ఫలితంగా ఎన్నడూ లేని రీతిలో భూగర్భ జలమట్టం పెరిగింది. ఎండిపోయిన బోర్లు, బావుల్లో కూడా నీరు వచ్చింది. సాగు, తాగు నీరు పుష్కలంగా అందుబాటులోకి వచ్చింది. భూగర్భ జలాలు పెరగడం వల్ల బోర్లు, బావుల్లో నీటి కాలుష్య తీవ్రత కూడా గణనీయంగా తగ్గిందని అధికారులు చెబుతున్నారు. వైఎస్సార్ కడపలో అత్యధికం.. పశ్చిమగోదావరిలో అత్యల్పం రాష్ట్రంలో వైఎస్సార్ కడప జిల్లాలో 2.69 మీటర్లలోనే భూగర్భ జలాలు లభ్యమవుతుండగా.. పశ్చిమగోదావరి జిల్లాలో 14.82 మీటర్లలో అందుబాటులో ఉన్నాయి. దుర్భిక్ష ప్రాంతమైన అనంతపురం జిల్లాలో కేవలం 8.11 మీటర్లలోనే లభ్యమవుతున్నాయి. ఉభయగోదావరి జిల్లాల కంటే అనంతపురం జిల్లాలో భూగర్భజలాలు పుష్కలంగా అందుబాటులో ఉండటం గమనార్హం. -
పాతాళగంగలో యువకుడి మృత్యువాత
శ్రీశైలం (కర్నూలు) : శ్రీశైల దేవస్థానం పరిధిలోని పాతాళగంగలో మంగళవారం మధ్యాహ్నం ప్రకాశం జిల్లాకు చెందిన యువకుడి(23) మృతదేహాన్ని కనుగొన్నారు. స్థానిక జాలర్లు వన్‌టౌన్ పోలీసులకు సమాచారం అందజేశారు. మృతుడి వద్ద ఉన్న సెల్ ఫోన్ ఆధారంగా ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన ప్రదీప్‌గా గుర్తించారు. అతని సెల్ ఫోన్ నంబర్ 9133818891 కాగా, ఆ సెల్‌కు వచ్చిన చివరి కాల్ గుంటూరు జిల్లా వినుకొండకు చెందిన వీరాంజనేయులు ఫోన్ 9642351322గా నమోదైందని ఏఎస్సై రామచంద్రగౌడ్ తెలిపారు. అయితే ఆ నెంబరుకు ఎన్ని సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు. సీఐ చక్రవర్తి ఆధ్వర్యంలో కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని శ్రీశైలం ప్రాజెక్టు వైద్యశాలకు తరలించారు. కాగా ఇది ప్రమాదమా లేక ఆత్మహత్యా అనే విషయం తెలియాల్సి ఉంది. -
పాతాల గంగమ్మా.. పైకి రావమ్మా
అనంతపురం అగ్రికల్చర్: జిల్లాలో పాతాళగంగ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రోజురోజుకు భూగర్భ జలాలు క్షీణిస్తున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు వెంటాడటంతో ఁఅనంత* జలాలు అడుగంటిపోతున్నాయి. బోరుబావుల నుంచి గుక్కెడు నీరు రావడం గగనంగా మారింది. చాలా బోర్లు ఇప్పటికే కట్టిపెట్టారు. వచ్చే వేసవిలో జిల్లా ప్రజలకు తాగునీటి గండం పొంచివుందనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. 190 ఫిజోమీటర్ల నుంచి భూగర్భ జల శాఖ తాజాగా సేకరించిన వివరాల ప్రకారం సగటు నీటి మట్టం 20 మీటర్లుగా పేర్కొన్నారు. రానున్న కాలంలో నీటి మట్టం మరింత లోతుకు పడిపోయే ప్రమాదం ఉందని ఆ శాఖ డెప్యూటీ డెరైక్టర్ (డీడీ) పి.పురుషోత్తమరెడ్డి చెబుతున్నారు. 44 శాతం తక్కువగా వర్షపాతం ఈ ఏడాది జూన్ నుంచి ఇప్పటివరకు సాధారణ వర్షపాతం కన్నా 44 శాతం తక్కువగా వర్షాలు పడటంతో కనీసం ఒక్క మండలంలో కూడా సాధారణం కన్నా ఎక్కువగా వర్షం కురిసిన దాఖలాలు లేవు. జిల్లా వార్షిక వర్షపాతం 552 మిల్లీమీటర్లు (మి.మీ)కాగా అందులో ఇప్పటి వరకు 484 మి.మీ నమోదు కావాల్సివుండగా 44 శాతం తక్కువగా 276 మి.మీ కురిసింది. ఫలితంగా కేవలం 9 మండలాల్లో సాధారణం, 20 నుంచి 59 శాతం తక్కువగా 43 మండలాల్లో, 60 నుంచి 99 శాతం తక్కువగా 11 మండలాల్లో వర్షాలు పడ్డాయి. ఈ గణాంకాలు పరిశీలిస్తే జిల్లాలో వరుణుడి కటాక్షం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకట్రెండు భారీ వర్షాలు మినహా ఎక్కడా ఎపుడూ చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షాలు పడలేదు. అనంతపురం రెవెన్యూ డివిజన్ పరిధిలో 475 మి.మీ పడాల్సివుండగా 41 శాతం తక్కువగా 280 మి.మీ వర్షం పడింది. ధర్మవరం డివిజన్లో 463 మి.మీ గానూ 47 శాతం తక్కువగా 247 మి.మీ, కదిరి డివిజన్లో 549 మి.మీ గానూ 54 శాతం తక్కువగా 251 మి.మీ, కళ్యాణదుర్గం డివిజన్లో 404 మి.మీ గానూ 16 శాతం తక్కువగా 341 మి.మీ, పెనుకొండ రెవెన్యూ డివిజన్లో 517 మి.మీ వర్షం పడాల్సి వుండగా 50 శాతం తక్కువగా 257 మి.మీ వర్షపాతం నమోదైంది. 39 మండలాల్లో పరిస్థితి దారుణం తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల 39 మండలాల్లో రోజురోజుకు పాతాళగంగ పడిపోతోంది. అందులో 100 శాతం నీటిని తోడేస్తున్న మండలాల (ఓవర్ఎక్సాప్లయిటెడ్) జాబితాలో 24 మండలాలు ఉన్నాయి. రొద్దం, తలుపుల మండలాల్లో 90 శాతంకు పైబడి నీటిని వినియోగిస్తుండటంతో సెమీ క్రిటికల్ జాబితాలో ఉన్నాయి. 70 నుంచి 90 శాతం నీటిని వాడుతున్న క్రిటికల్ జాబితాలో 16 మండలాలు ఉన్నాయి. మరో 24 మండలాల్లో పరిస్థితి కొంత వరకు ఫరవాలేదని అధికారులు చెబుతున్నారు. పెనుకొండ, కదిరి, అనంతపురం డివిజన్ పరిధిలో ఎక్కువ మండలాలు ఒత్తిడికి గురవుతున్నాయి. అతిగా వినియోగిస్తున్న మండలాలు నీటిని అతిగా వినియోగిస్తున్న మండలాల్లో అగళి, అమడగూరు, బత్తలపల్లి, బ్రహ్మసముద్రం, గాండ్లపెంట, హిందూపురం, కళ్యాణదుర్గం, కంబదూరు, కొత్తచెరువు, కుందుర్పి, లేపాక్షి, మడకశిర, పరిగి, పెద్దపపప్పూరు, పుట్లూరు, రొళ్ల, తాడిమర్రి, తాడిపత్రి, యాడికి, యల్లనూరు ఉన్నాయి. 70 నుంచి 90 శాతం వినియోగిస్తున్న మండలాల జాబితాలో బెళుగుప్ప, బుక్కపట్టణం, ధర్మవరం, గార్లదిన్నె, గుడిబండ, గుమ్మగట్ట, కనగానపల్లి, కూడేరు, నార్పల, ఓడీ చెరువు, పెనుకొండ, పుట్టపర్తి, రాప్తాడు, రాయదుర్గం, సోమందేపల్లి, తనకల్లు ఉన్నాయి. సురక్షిత జాబితాలో అనంతపురం, ఆత్మకూరు, బుక్కరాయసముద్రం, బొమ్మనహాల్, చెన్నేకొత్తపల్లి, చిలమత్తూరు, డి.హిరేహాల్, గుత్తి, గోరంట్ల, గుంతకల్లు, కదిరి, కనేకల్లు, ముదిగుబ్బ, ఎన్పీ కుంట, నల్లచెరువు, నల్లమాడ, పామిడి, పెద్దవడుగూరు, రామగిరి, శెట్టూరు, శింగనమల, ఉరవకొండ, వజ్రకరూరు, విడపనకల్ ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో దారుణం 190 ఫిజోమీటర్ల నుంచి భూగర్భ జలశాఖ సేకరించిన వివరాలను బట్టి చూస్తే 12 ప్రాంతాల్లో 2 నుంచి 5 మీటర్లలోతులో ఉండగా 24 గ్రామాల్లో 5 నుంచి 10 మీటర్లు, 10 నుంచి 20 మీటర్ల లోతులో 60 గ్రామాలు, 20 నుంచి 30 మీటర్ల లోతులో 34 గ్రామాలున్నారుు. 30 మీటర్లకు పైబడి నీటి మట్టం కలిగిన గ్రామాలు 25 ఉండటం విశేషం. అందులోనూ అగళి మండలం మధూడి గ్రామంలో 70.98 మీటర్ల లోతుకు చేరుకున్నాయి. కక్కలపల్లి, పుట్లూరు, యల్లనూరు, మడ్డిపల్లి, కోన ఉప్పలపాడు, నగరూరు, తిమ్మంపల్లి, గాండ్లపర్తి, పిన్నదరి, అమడగూరు, మహమ్మదాబాద్, మారాల, గాండ్లపెంట, తలుపుల, హనిమిరెడ్డిపల్లి, బ్రహ్మసముద్రం, తాళ్లకెరె, కనేకల్లు క్రాస్, పులగూర్లపల్లి, మనేసముద్రం, కొండూరు, పులమతి, శిరవరం, ఆర్.అనంతపురం, పరిగి, కోగిర, చాలకూరు, సోమందేపల్లి గ్రామాల్లో భూగర్భ జలాల పరిస్థితి దయనీయంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. వచ్చే వేసవిలో తాగునీటికి సైతం కటకటలాడే దుస్థితి పొంచివుందనే హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నారుు.