అనంతపురం అగ్రికల్చర్: జిల్లాలో పాతాళగంగ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రోజురోజుకు భూగర్భ జలాలు క్షీణిస్తున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు వెంటాడటంతో ఁఅనంత* జలాలు అడుగంటిపోతున్నాయి. బోరుబావుల నుంచి గుక్కెడు నీరు రావడం గగనంగా మారింది. చాలా బోర్లు ఇప్పటికే కట్టిపెట్టారు. వచ్చే వేసవిలో జిల్లా ప్రజలకు తాగునీటి గండం పొంచివుందనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. 190 ఫిజోమీటర్ల నుంచి భూగర్భ జల శాఖ తాజాగా సేకరించిన వివరాల ప్రకారం సగటు నీటి మట్టం 20 మీటర్లుగా పేర్కొన్నారు. రానున్న కాలంలో నీటి మట్టం మరింత లోతుకు పడిపోయే ప్రమాదం ఉందని ఆ శాఖ డెప్యూటీ డెరైక్టర్ (డీడీ) పి.పురుషోత్తమరెడ్డి చెబుతున్నారు.
44 శాతం తక్కువగా వర్షపాతం
ఈ ఏడాది జూన్ నుంచి ఇప్పటివరకు సాధారణ వర్షపాతం కన్నా 44 శాతం తక్కువగా వర్షాలు పడటంతో కనీసం ఒక్క మండలంలో కూడా సాధారణం కన్నా ఎక్కువగా వర్షం కురిసిన దాఖలాలు లేవు. జిల్లా వార్షిక వర్షపాతం 552 మిల్లీమీటర్లు (మి.మీ)కాగా అందులో ఇప్పటి వరకు 484 మి.మీ నమోదు కావాల్సివుండగా 44 శాతం తక్కువగా 276 మి.మీ కురిసింది. ఫలితంగా కేవలం 9 మండలాల్లో సాధారణం, 20 నుంచి 59 శాతం తక్కువగా 43 మండలాల్లో, 60 నుంచి 99 శాతం తక్కువగా 11 మండలాల్లో వర్షాలు పడ్డాయి. ఈ గణాంకాలు పరిశీలిస్తే జిల్లాలో వరుణుడి కటాక్షం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకట్రెండు భారీ వర్షాలు మినహా ఎక్కడా ఎపుడూ చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షాలు పడలేదు. అనంతపురం రెవెన్యూ డివిజన్ పరిధిలో 475 మి.మీ పడాల్సివుండగా 41 శాతం తక్కువగా 280 మి.మీ వర్షం పడింది. ధర్మవరం డివిజన్‌లో 463 మి.మీ గానూ 47 శాతం తక్కువగా 247 మి.మీ, కదిరి డివిజన్‌లో 549 మి.మీ గానూ 54 శాతం తక్కువగా 251 మి.మీ, కళ్యాణదుర్గం డివిజన్‌లో 404 మి.మీ గానూ 16 శాతం తక్కువగా 341 మి.మీ, పెనుకొండ రెవెన్యూ డివిజన్‌లో 517 మి.మీ వర్షం పడాల్సి వుండగా 50 శాతం తక్కువగా 257 మి.మీ వర్షపాతం నమోదైంది.
39 మండలాల్లో పరిస్థితి దారుణం
తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల 39 మండలాల్లో రోజురోజుకు పాతాళగంగ పడిపోతోంది. అందులో 100 శాతం నీటిని తోడేస్తున్న మండలాల (ఓవర్‌ఎక్సాప్లయిటెడ్) జాబితాలో 24 మండలాలు ఉన్నాయి. రొద్దం, తలుపుల మండలాల్లో 90 శాతంకు పైబడి నీటిని వినియోగిస్తుండటంతో సెమీ క్రిటికల్ జాబితాలో ఉన్నాయి. 70 నుంచి 90 శాతం నీటిని వాడుతున్న క్రిటికల్ జాబితాలో 16 మండలాలు ఉన్నాయి. మరో 24 మండలాల్లో పరిస్థితి కొంత వరకు ఫరవాలేదని అధికారులు చెబుతున్నారు. పెనుకొండ, కదిరి, అనంతపురం డివిజన్ పరిధిలో ఎక్కువ మండలాలు ఒత్తిడికి గురవుతున్నాయి.
అతిగా వినియోగిస్తున్న మండలాలు
నీటిని అతిగా వినియోగిస్తున్న మండలాల్లో అగళి, అమడగూరు, బత్తలపల్లి, బ్రహ్మసముద్రం, గాండ్లపెంట, హిందూపురం, కళ్యాణదుర్గం, కంబదూరు, కొత్తచెరువు, కుందుర్పి, లేపాక్షి, మడకశిర, పరిగి, పెద్దపపప్పూరు, పుట్లూరు, రొళ్ల, తాడిమర్రి, తాడిపత్రి, యాడికి, యల్లనూరు ఉన్నాయి.
70 నుంచి 90 శాతం వినియోగిస్తున్న మండలాల జాబితాలో బెళుగుప్ప, బుక్కపట్టణం, ధర్మవరం, గార్లదిన్నె, గుడిబండ, గుమ్మగట్ట, కనగానపల్లి, కూడేరు, నార్పల, ఓడీ చెరువు, పెనుకొండ, పుట్టపర్తి, రాప్తాడు, రాయదుర్గం, సోమందేపల్లి, తనకల్లు ఉన్నాయి. సురక్షిత జాబితాలో అనంతపురం, ఆత్మకూరు, బుక్కరాయసముద్రం, బొమ్మనహాల్, చెన్నేకొత్తపల్లి, చిలమత్తూరు, డి.హిరేహాల్, గుత్తి, గోరంట్ల, గుంతకల్లు, కదిరి, కనేకల్లు, ముదిగుబ్బ, ఎన్‌పీ కుంట, నల్లచెరువు, నల్లమాడ, పామిడి, పెద్దవడుగూరు, రామగిరి, శెట్టూరు, శింగనమల, ఉరవకొండ, వజ్రకరూరు, విడపనకల్ ఉన్నాయి.
కొన్ని గ్రామాల్లో దారుణం
190 ఫిజోమీటర్ల నుంచి భూగర్భ జలశాఖ సేకరించిన వివరాలను బట్టి చూస్తే 12 ప్రాంతాల్లో 2 నుంచి 5 మీటర్లలోతులో ఉండగా 24 గ్రామాల్లో 5 నుంచి 10 మీటర్లు, 10 నుంచి 20 మీటర్ల లోతులో 60 గ్రామాలు, 20 నుంచి 30 మీటర్ల లోతులో 34 గ్రామాలున్నారుు. 30 మీటర్లకు పైబడి నీటి మట్టం కలిగిన గ్రామాలు 25 ఉండటం విశేషం. అందులోనూ అగళి మండలం మధూడి గ్రామంలో 70.98 మీటర్ల లోతుకు చేరుకున్నాయి. కక్కలపల్లి, పుట్లూరు, యల్లనూరు, మడ్డిపల్లి, కోన ఉప్పలపాడు, నగరూరు, తిమ్మంపల్లి, గాండ్లపర్తి, పిన్నదరి, అమడగూరు, మహమ్మదాబాద్, మారాల, గాండ్లపెంట, తలుపుల, హనిమిరెడ్డిపల్లి, బ్రహ్మసముద్రం, తాళ్లకెరె, కనేకల్లు క్రాస్, పులగూర్లపల్లి, మనేసముద్రం, కొండూరు, పులమతి, శిరవరం, ఆర్.అనంతపురం, పరిగి, కోగిర, చాలకూరు, సోమందేపల్లి గ్రామాల్లో భూగర్భ జలాల పరిస్థితి దయనీయంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. వచ్చే వేసవిలో తాగునీటికి సైతం కటకటలాడే దుస్థితి పొంచివుందనే హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నారుు.
పాతాల గంగమ్మా.. పైకి రావమ్మా
Published Sat, Dec 13 2014 1:45 AM | Last Updated on Fri, Jun 1 2018 8:59 PM
Advertisement
Advertisement