సాక్షి, అమరావతి: పాతాళ గంగ పైపైకి వస్తోంది. దుర్భిక్ష ప్రాంతాల్లోనూ కరువు తీర్చే కల్పవల్లిగా అవతరిస్తోంది. ఈ ఏడాది రాష్ట్రంలో భూగర్భ జలమట్టాలు గణనీయంగా పెరిగాయి. మే 31 నాటికి రాష్ట్రంలో సగటున 9.88 మీటర్ల లోతున భూగర్భ జలాలు లభ్యమయ్యేవి. ఇప్పుడు సగటున 8.24 మీటర్లలో లోతులోనే భూగర్భ జలాలు లభ్యమవుతున్నాయి. రుతు పవనాల ప్రభావం వల్ల జూన్ నుంచి ఈ నెల 6 వరకూ రాష్ట్రంలో సగటున 433.59 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాలి. కానీ.. 382.55 మిల్లీమీటర్ల వర్షపాతమే కురిసింది. సాధారణం కంటే 11.77 శాతం తక్కువ వర్షపాతం నమోదైనా భూగర్భ జలమట్టం భారీగా పెరగడం గమనార్హం. దుర్భిక్ష ప్రాంతమైన అనంతపురం జిల్లాలో ఏకంగా 4.84 మీటర్ల మేర భూగర్భ జలమట్టం పెరిగింది.
163.55 టీఎంసీల భూగర్భ జలాలు
రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం 1,63,099 చదరపు కిలోమీటర్లు. రాష్ట్రంలో జూన్ 1 నుంచి ఇప్పటివరకూ కురిసిన వర్షపాతం పరిమాణం 2,233.47 టీఎంసీలు. ఇందులో 163.55 టీఎంసీలు భూగర్భ జలాల రూపంలోకి మారాయి. దాంతో భూగర్భ జలమట్టం 8.24 మీటర్లకు చేరుకుంది. గతేడాది సెప్టెంబర్ 6వ తేదీ నాటికి సగటున 13.27 మీటర్లలో భూగర్భ జలాలు లభ్యయ్యేవి. అంటే.. గతేడాది సెప్టెంబరు 6తో పోల్చితే ప్రస్తుతం రాష్ట్రంలో భూగర్భ జలమట్టం సగటున 5.03 మీటర్లు పెరిగినట్టు స్పష్టమవుతోంది. అనంతపురం జిల్లాలో మే 31 నాటికి 15.54 మీటర్లలో భూగర్భ జలమట్టం ఉండేది. ఇటీవల కురిసిన భారీ వర్షాల ప్రభావం వల్ల ఆ జిల్లాలో భూగర్భ జలమట్టం 10.70 మీటర్లకు చేరుకుంది. అంటే ఏకంగా 4.84 మీటర్ల మేర జలమట్టం పెరిగింది. రాష్ట్రంలో అత్యధికంగా భూగర్భ జలాలు పెరిగిన జిల్లా అనంతపురమే కావడం గమనార్హం. నెల్లూరు జిల్లాలో ఈశాన్య రుతుపవనాల ప్రభావం వల్ల అధికంగా వర్షాలు కురుస్తాయి. నైరుతి రుతుపవనాల ప్రభావం ఆ జిల్లాపై తక్కువగా ఉంటుంది. దీని వల్ల ఆ జిల్లాలో భూగర్భజలమట్టం తగ్గింది. అక్కడ భూగర్భ జలమట్టం మే 31 నాటితో పోల్చితే సోమవారం నాటికి 0.71 మీటర్లు తగ్గింది.
ఇబ్బందులు తప్పినట్టే..
రాష్ట్రంలో సుమారు 13 లక్షల బోరు బావుల కింద దాదాపు 24 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. తాగు, గృహ అవసరాల నీటి కోసం 2.33 లక్షల బోరు బావులపై ప్రజలు ఆధారపడతారు. భూగర్భ జలమట్టం భారీగా పెరిగిన నేపథ్యంలో ఈ ఏడాది సాగు, తాగునీటి ఇబ్బందులు తప్పినట్టేనని అధికారులు విశ్లేషిస్తున్నారు. నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల ఈ నెలతో పాటు అక్టోబర్‌లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తాయి. ఈశాన్య రుతుపవనాలతో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో తూర్పు ప్రాంతం, ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంతంపై అధికంగా వర్షాలు కురుస్తాయి. వీటిని పరిగణనలోకి తీసుకుంటే జలమట్టం మరింత పెరిగే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment