
మహారాణిపేట (విశాఖ దక్షిణ): ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వరుణుడు చల్లని కబురు తీసుకొచ్చాడు. ఆదివారం రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. కేరళ, కర్ణాటక రాష్ట్రాలను దాటుకుని వచ్చి రాయలసీమను పలకరించాయి. పలు ప్రాంతాలకు విస్తరించాయి. దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక, తమిళనాడులోని పలు ప్రాంతాలు, నైరుతి, తూర్పు మధ్య బంగాళాఖాతంలో అన్ని ప్రాంతాలు, పశ్చిమ మధ్య, వాయవ్య, ఈశాన్య బంగాళాఖాతంలో మరికొన్ని ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు విస్తరించాయి.
గోవా, కొంకణ్ ప్రాంతాల్లో కొంత భాగాన్ని, ఈశాన్య భారత దేశంలో కొన్ని ప్రాంతాలను రుతుపవనాలు పలకరించాయి. కాగా, తూర్పు మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకొని ఉన్న ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతాల్లో ట్రోపోస్పియర్ స్థాయి వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించింది. దీని ప్రభావంతో రాగల 48 గంటల్లో తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. రాగల రెండ్రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.