కన్నీటి వ్యథేనా?
అనంతపురం అగ్రికల్చర్ : వరుణుడు మొహం చాటేయడంతో జిల్లాలో భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. జిల్లా వార్షిక వర్షపాతం 522 మిల్లీమీటర్లు (మి.మీ) కాగా.. అందులో డిసెంబర్ చివరి నాటికి 494 మి.మీ వర్షం పడాల్సి ఉండేది. ఈ సారి 274 మి.మీ మాత్రమే వర్షం కురిసింది. అంటే 45 శాతం తక్కువగా పడింది. జిల్లాలోని 63 మండలాల్లోనూ వర్షపాతం తక్కువగానే నమోదైంది.
అందులోనూ అనంతపురం, బత్తలపల్లి, బుక్కపట్నం, బుక్కరాయసముద్రం, చిలమత్తూరు, ధర్మవరం, గాండ్లపెంట, కొత్తచెరువు, ముదిగుబ్బ, పామిడి, పరిగి, పెద్దపప్పూరు, పెనుకొండ, పుట్లూరు, పుట్టపర్తి, రాప్తాడు, రొద్దం, శింగనమల, సోమందేపల్లి, తలుపుల, తనకల్లు తదితర మండలాల్లో 50 నుంచి 75 శాతం తక్కువగా వర్షపాతం నమోదు కావడం గమనార్హం.
దీనివల్ల భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. కనిష్టస్థాయికి పడిపోతున్నాయి. ఆగస్టు, సెప్టెంబర్ లాంటి కీలకమైన మాసాల్లో కూడా వర్షాలు మొహం చాటేయడంతో పరిస్థితి దారుణంగా తయారైంది. భూగర్భజల శాఖ అధికారులు జిల్లాలో బోరుబావులకు అనుసంధానం చేసిన 192 ఫిజోమీటర్ల నుంచి ఈ నెల మొదటి వారంలో వివరాలు సేకరించారు. వాటి ప్రకారం సగటు నీటి మట్టం 20.41 మీటర్లుగా నమోదైంది. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే వచ్చే వేసవిలో ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.
ఇప్పటికే వ్యవసాయ బోర్లు చాలా వరకు ఎండిపోయూరుు. 800 నుంచి 1000 అడుగుల లోతుకు కొత్తగా బోర్లు వేయిస్తున్నా నీరు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో వ్యవసాయ, ఉద్యాన పంటలను కాపాడుకోవడం ఈ వేసవిలో కష్టంగానే కనిపిస్తోంది. మరోవైపు తాగునీటి ముప్పును ఎలా ఎదుర్కోవాలనే దానిపై అధికార యంత్రాంగంలో ఆందోళన కనిపిస్తోంది.
డిసెంబర్ మొదటి వారంలో 19.53 మీటర్లు ఉన్న భూగర్భజల మట్టం ఇప్పుడు 20.41 మీటర్లకు చేరుకుంది. ఇలా నెలా నెలా ఒక మీటర్ లోతుకు పడిపోతే ఏప్రిల్, మే, జూన్ మాసాల నాటికి చరిత్రలో ఎన్నడూ లేని కనిష్టస్థాయికి చేరుకునే ప్రమాదం లేకపోలేదని భూగర్భజల శాఖ డిప్యూటీ డెరైక్టర్ పి.పురుషోత్తమరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
నగరూరులో 82.15 మీటర్లు
జిల్లా సగటు నీటి మట్టం 20.41 మీటర్లుగా నమోదైనా... కొన్ని ప్రాంతాల్లో మరీ లోతుకు పడిపోరుుంది. యాడికి మండలం నగరూరు గ్రామంలో ఏకంగా 82.15 మీటర్ల లోతులో నీరు ఉండడం గమనార్హం. అగళి మండలం మధూడిలో 71.03 మీటర్లు, గాండ్లపెంట 69.38 మీటర్లు, అమడగూరు మండలం మహమ్మదాబాద్‌లో 63.06 మీటర్లు, తలుపులలో 60.36 మీటర్లు, తాడిమర్రి మండలం పిన్నదరిలో 51.47 మీటర్లు, సోమందేపల్లి మండలం చాలకూరులో 48.34 మీటర్లు, గోరంట్ల మండలం పులగూర్లపల్లిలో 42.91 మీటర్లు, గుమ్మఘట్ట మండలం తాళ్లకెరెలో 41.08 మీటర్లు... ఇలా చాలా మండలాలు, గ్రామాల్లో నీటిమట్టం కనిష్టస్థారుుకి చేరుకుంది. 15 మండలాల్లో మాత్రమే పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంది. ముందస్తు చర్యలు చేపట్టకపోతే వేసవిలో వందలాది గ్రామాల్లో క‘న్నీటి’ కష్టాలు తప్పవు.