గ్రామాల్లో పాతాళ గంగ.. ఇక తీరింది బెంగ | Ap: State Full Of Ground Water Harvest Government Taken Precaution | Sakshi
Sakshi News home page

పాతాళ గంగ.. తీరింది బెంగ

Published Thu, Jun 17 2021 10:21 PM | Last Updated on Thu, Jun 17 2021 10:34 PM

Ap: State Full Of Ground Water Harvest Government Taken Precaution - Sakshi

సాక్షి, అమరావతి: సమృద్ధిగా వర్షాలు కురవటం, ప్రభుత్వం చేపట్టిన జల సంరక్షణ చర్యల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో భూగర్భ జలసిరులు భారీగా పెరిగాయి. చుక్క నీరు కూడా లేకుండా వట్టిపోయిన పరిస్థితుల్లో.. బోర్లు వేయడానికి అనుమతులు నిషేధించిన 706 గ్రామాల్లో సైతం ఇప్పుడు కొత్త బోర్లు వేసుకునేందుకు అనువైన పరిస్థితులు ఏర్పడ్డాయి. 2016–17 ఆర్థిక సంవత్సరంలో 1,093 గ్రామాల్లో భూగర్భ జలాలు వట్టిపోగా.. తాజాగా ప్రకటించిన జాబితా ప్రకారం ఆ గ్రామాల సంఖ్య 387కు తగ్గింది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది నోటిఫికేషన్‌ జారీ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 387 గ్రామాల్లో భూగర్భ జలాలను అధిక మొత్తంలో వినియోగిస్తున్నట్టు (ఓవర్‌ ఎక్స్‌ప్లాయిటెడ్‌ విలేజెస్‌)గా ప్రభుత్వం ప్రకటించింది. 8 జిల్లాల పరిధిలోని ఆయా గ్రామాల్లో వాల్టా చట్టం ప్రకారం భూగర్భ జలాల వినియోగంపై ఆంక్షలు అమలు చేయడంతో పాటు కొత్తగా బోర్ల తవ్వకంపై నిషేధాన్ని కొనసాగించాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ఆయా గ్రామాల్లో నిషేధాజ్ఞలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. 

రెండేళ్ల క్రితం 1,093 గ్రామాల్లో..
2016–17 ఆర్థిక సంవత్సరంలో అప్పటి భూగర్భ జల మట్టాల పరిస్థితి, గ్రామాలు, ప్రాంతాల వారీగా వాటి వినియోగం ఆధారంగా భూగర్భ జల శాఖ రాష్ట్ర వ్యాప్తంగా 1,093 గ్రామాలను ఓవర్‌ ఎక్స్‌ప్లాయిటెడ్‌ విలేజెస్‌గా అప్పట్లో ప్రకటించింది. ఆ గ్రామాల్లో ఇప్పటివరకు వాల్టా చట్టం ప్రకారం భూగర్భ జలాల వినియోగంపై నియంత్రణతో పాటు కొత్తగా బోర్ల తవ్వకంపై నిషేధం అమలు చేస్తున్నారు. తాజాగా 2019–20 ఆర్థిక సంవత్సరం నాటి భూగర్భ జలాల పరిస్థితి, వినియోగం అంచనాలతో 387 గ్రామాలను ఓవర్‌ ఎక్స్‌ప్లాయిటెడ్‌ విలేజెస్‌ కేటగిరీగా గుర్తించినట్టు భూగర్భ జల శాఖ డైరక్టర్‌ ఎ.వరప్రసాద్‌ ‘సాక్షి’కి తెలిపారు. రెండేళ్లుగా సమృద్ధి వర్షాలు కురవడంతో రాయలసీమ ప్రాంతంలోని పలు జిల్లాల్లో అంతకు ముందు ఓవర్‌ ఎక్స్‌ప్లాయిటెడ్‌ విలేజెస్‌ కేటగిరీలో ఉన్న గ్రామాల్లో భూగర్భ జలాలు మెరుగుపడటంతో ఈ కేటగిరీ గ్రామాల సంఖ్యలో తగ్గుదల కనిపిస్తోందని ఆయన చెప్పారు. ఇటీవల కాలంలో భూగర్భ జల మట్టాలను భారీగా పెంచేందుకు ఉపాధి హామీ పథకం, వాటర్‌ షెడ్‌ పథకాల కింద పెద్దఎత్తున పనులు చేపట్టడంతో అన్ని ప్రాంతాలలో భూగర్భ జలాల్లో పెరుగుదల కనిపిస్తోందని అధికార వర్గాలు తెలిపాయి. 

ఓవర్‌ ఎక్స్‌ప్లాయిటెడ్‌ విలేజెస్‌ అంటే..
వర్షపు నీటితో పాటు వాగు, వంకల ద్వారా భూగర్భంలోకి ఇంకే నీటి పరిమాణం కంటే అధిక మొత్తంలో నీటిని వినియోగిస్తున్న పరిస్థితి ఉన్నప్పుడు ఆయా గ్రామాలను ఈ కేటగిరీ కింద చేరుస్తారు. ఈ మదింపు జరిగే సమయంలో రాష్ట్ర భూగర్భ జల శాఖ 11 ఇతర ప్రభుత్వ శాఖల నుంచి సమాచారం సేకరించి ఆయా గ్రామాల్లో అందుబాటులో ఉండే భూగర్భ జల మట్టం, వాటి వినియోగం తీరును అంచనా వేసి, ఈ జాబితాను ప్రకటిస్తుంది. రాష్ట్ర భూగర్భ జల శాఖ తయారు చేసే ఈ నివేదికను కేంద్ర జల వనరుల శాఖ ఆమోదం తర్వాతే అధికారికంగా ప్రకటిస్తారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా భూగర్భ జల శాఖ ఎప్పటికప్పుడు తాజా నివేదికలను వెల్లడిస్తుంటుంది.

చదవండి: విజయనగరం యువత సంచలనం: యమా క్రేజీ.. ఫిల్మీమోజీ!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement