ఎడ్లబండ్లపై డ్రమ్ములతో తాగునీటిని తెచ్చుకుంటున్న వీరు నార్నూర్ మండలం సుంగాపూర్ గ్రామస్తులు
ఎడ్లబండ్లపై డ్రమ్ములతో తాగునీటిని తెచ్చుకుంటున్న వీరు నార్నూర్ మండలం సుంగాపూర్ గ్రామస్తులు. గ్రామంలో భూగర్భ జలాలు అడుగంటి చేతి పంపులు పనిచేయడం లేదు. నీటి ఎద్దడి నెలకొనడంతో ఇలా కిలోమీటర్ దూరం నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. గొంతు తడుపుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. వేసవి వచ్చిందంటే చాలు గ్రామంలో నిత్యం ఇదే పరిస్థితి. ఏటా తాగునీటి సమస్య తలెత్తుతున్నా పాలకులు మాత్రం స్పందించడం లేదు. ఒక్క సుంగాపూర్ మాత్రమే కాదు.. జిల్లాలో చాలా గ్రామాలు నీళ్ల గోసతో అవస్థలు పడుతున్నాయి.
సాక్షి, ఆదిలాబాద్‌అర్బన్: జిల్లాలోని పలు గ్రామాలు వేసవి నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. పల్లెల్లో మంచినీటి పథకాలు, చేతిపంపులు పనిచేయకపోవడం, భూగర్భ జలాలు అడుగంటడంతో పరిస్థితి దారుణంగా మారింది. తాగునీటి కోసం అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజల దాహార్తిని మాత్రం పూర్తిస్థాయిలో తీర్చలేకపోతున్నారు. గ్రామాల్లో ఓ వైపు జనం నీటి ఇబ్బందులు ఎదుర్కొంటుంటే అధికారులు మాత్రం మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయంటూ వేసవిని గడిపేస్తున్నారు. వేసవిలో తాగునీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తున్నా నీటి సమస్య పరిష్కారం కాలేకపోతోంది. గత ఫిబ్రవరి, మార్చిలో పుష్కలంగా నీళ్లు వచ్చిన కొన్ని చేతిపంపులు మే నెలలో పూర్తిగా అడుగంటిపోవడంతో అవి ఇప్పుడు పని చేయడం లేదు. దీంతో మరిన్ని గ్రామాలు తాగునీటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది. జిల్లాలోని నీటి ఎద్దడి ఉన్న 17 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
జిల్లాలో పరిస్థితి ఇదీ..
వేసవిలో గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు గ్రామీణ నీటి సరఫరా విభాగం ఏటా క్రాష్ ప్రోగ్రాం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలో ఎన్ని హ్యాబిటేషన్లు, వాటి పరిధిలో పని చేస్తున్న చేతిపంపులు ఎన్ని? పని చేయనివి ఎన్ని? మంచినీటి పథకాలెన్ని? అందులో పనిచేస్తున్నవి ఎన్ని? ఎన్ని బోర్లు ఉన్నాయి.. వేటికి మరమ్మతు చేయించాలి.. దానికి అయ్యే అంచనా వ్యయం.. కొన్ని గ్రామాల్లో నీటి పథకాలు లేకపోవడంతో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయడం, ఇలా అన్నింటీని క్రాష్ ప్రోగ్రాం ద్వారా అంచనా వేసి ఓ నివేదిక తయారు చేస్తారు. ఆ నివేదిక ప్రకారం జిల్లాలోని మొత్తం 243 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 502 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల పరిధిలో 5,219 చేతిపంపులు ఉన్నాయి. ఇందులో 4,718 మాత్రమే పని చేస్తున్నాయి. పని చేయని చేతిపంపుల్లో సగానికిపైగా నీరు అందకపోవడం, ఈ రెండు నెలల్లో 110పైగా చేతిపంపులు మరమ్మతుకు గురికావడంతో తాగునీటి కోసం తండ్లాట ఎక్కువైంది.
కొన్ని గ్రామాలకు రెండు, మూడు చేతిపంపులు ఉన్న చోట భూగర్భ జలాలు అడుగంటడంతో ఆ గ్రామాలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. అయితే చెడిపోయిన చేతిపంపులకు అప్పటికప్పుడే మరమ్మతు చేయిస్తున్నామని చెబుతున్నా అధికారులు తాగునీటి ఇబ్బందులు ఎందుకు తలెత్తుతున్నాయో స్పష్టం చేయలేకపోతున్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో మెకానిక్‌ను అందుబాటులో ఉంచి ఎప్పటికప్పుడు చేతిపంపులను పర్యవేక్షిస్తున్నామని మాత్రం పేర్కొంటున్నారు. జిల్లాలో మరో 585 బావులు ఉన్నాయి. ఇందులో 492 బావులు పని చేయగా, మిగతా 93 బావులు పని చేయడం లేదు. తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ఒక్కో గ్రామ పంచాయతీ ఖాతాలో రూ.3 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు నిధులు అందుబాటులో ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా అన్ని జీపీల నిధులు కలిపి సుమారు రూ.13 కోట్ల నిధులు అందుబాటులో ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా, మిషన్ భగీరథ పనుల్లో అధికారులు బీజీగా ఉన్నారు. ఏప్రిల్ చివరి నాటికే మిషన్ నీళ్లను అందిస్తామనుకున్నా ఇంకా చాలా గ్రామాలకు పైపులైన్ పనులు పూర్తి కాకపోవడంతో అది సాధ్యం కాలేకపోయింది.
అడుగంటిన భూగర్భజలాలు
జిల్లాలో గతేడాదితో పోల్చితే ఈ ఏడాది భూగర్భ జలాలు గణనీయంగా పడిపోవడంతో తాగునీటి ఎద్దడి తీవ్రమైంది. గతేడాది జనవరితో పరిగణలోకి తీసుకుంటే ఈ ఏడాది జనవరిలో మరింత లోతుకు పడిపోయాయి. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఎండలు తక్కువగా ఉండడంతో చేతిపంపులకు అందిన నీరు ఏప్రిల్, మేలో ఉష్ణోగ్రతల కారణంగా భూగర్భ జలాలు మరింత లోతుకు పడిపోవడంతో చేతిపంపులకు నీరందక వృథాగా మారుతున్నాయి. అయితే మరో నెల పాటు నీటి ఎద్దడి ఉంటుందని, వర్షాలు పడితేనే బోర్లకు, బావులకు నీళ్లు వచ్చే ఆస్కారం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.
జిల్లాలోని అనుబంధ గ్రామాలు : 1,175
చేతిపంపులు : 5,219
పని చేయనివి : 501
పని చేస్తున్నవి : 4,718
బావులు : 585
పని చేయనివి : 93
పని చేస్తున్నవి : 492
అందుబాటులో ఉన్న నిధులు : రూ.13 కోట్లు
పంచాయతీల్లో నిధులున్నాయి
గ్రామాల్లో తాగునీటి ఎద్దడి సమస్యను అధిగమించేందుకు, చేతిపంపుల మరమ్మతు చేయించేందుకు సరిపడా నిధులు అందుబాటులో ఉన్నాయి. తాగునీటికి ఇబ్బంది రాకుండా ముందస్తుగానే చర్యలు తీసుకున్నాం. జిల్లాలోని జీపీలో సుమారు రూ.13 కోట్లు అందుబాటులో ఉన్నాయి. నిధుల కొరత లేదు.– జితేందర్‌రెడ్డి, ఇన్‌చార్జి డీపీవో
Comments
Please login to add a commentAdd a comment