వాన నీటిని ఒడిసి పట్టేందుకు.. | GHMC Planning For Ground Water Level | Sakshi
Sakshi News home page

వాన నీటిని ఒడిసి పట్టేందుకు..

Published Sat, Aug 3 2019 12:39 PM | Last Updated on Sat, Aug 3 2019 12:39 PM

GHMC Planning For Ground Water Level - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: రహదారులపై వరద నీటి సమస్యను తొలగించేందుకు, భూగర్భ జలాల పెంపు కోసం జీహెచ్‌ఎంసీ ఇటీవల చేపట్టిన ఇంజెక్షన్‌ బోర్‌వెల్స్‌ మంచి ఫలితాలిస్తున్నాయి. దీంతో ఇప్పటికే 70 ప్రాంతాల్లో రూ.1.10 కోట్లతో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు వాన నీటిని ఒడిసి పట్టేందుకు జీహెచ్‌ఎంసీ సర్కిల్, వార్డు, జోనల్‌ కార్యాలయాల్లోనూ ఇంజెక్షన్‌ బోర్‌వెల్స్‌ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. జోనల్, సర్కిల్, వార్డు కార్యాలయాలను పరిశీలించి అనువైన ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. దాదాపు 50 ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నామని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. మరోవైపు ప్రధాన రహదారులపై వరద నీరు చేరకుండా నిర్మించేందుకు ప్రతిపాదించిన ప్రాంతాల్లో దాదాపు 70 ఇంజెక్షన్‌ బోర్‌వెల్స్‌కు జేఎన్‌టీయూ నిపుణులు ఓకే చెప్పడంతో వాటికి ప్రతిపాదనలు రూపొందించారు.

అందులో భాగంగా ఇప్పటికే ఆయా సర్కిళ్ల పరిధిలో 10కి పైగా ఇంజెక్షన్‌ బోర్‌వెల్స్‌ ఏర్పాటు చేశారు. మలక్‌పేట సర్కిల్‌ పరిధిలో రూ.7.85 లక్షల వ్యయంతో 10 ఇంజెక్షన్‌ బోర్‌వెల్స్‌కు నిధులు మంజూరు చేయగా.. వాటిల్లో నాలుగింటి పనులు పూర్తయ్యాయి. అలాగే శేరిలింగంపల్లి పరిధిలో 10కి గాను రెండు పూర్తయ్యాయి. మిగతా 8 టెండర్ల ప్రక్రియలో ఉన్నాయి. చందానగర్‌ సర్కిల్‌ పరిధిలో 9 మంజూరు కాగా 2 పూర్తయ్యాయి. అంబర్‌పేట సర్కిల్‌లో మంజూరైన రెండు టెండర్‌ దశలో ఉన్నాయి. బేగంపేట సర్కిల్‌లో 3, ఖైరతాబాద్‌ సర్కిల్‌ పరిధిలో 4 టెండర్ల దశలో ఉన్నాయి. ఖైరతాబాద్‌ సర్కిల్‌ పరిధిలో లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్, విల్లామేరీ కాలేజ్‌ ప్రాంతాల్లో ఎక్కువ నీరు నిల్వ ఉంటుండడంతో.. అక్కడ ఎక్కువ నీరు భూమిలోకి ఇంకేలా పెద్ద ఇంకుడుగుంతలతో కూడిన ఇంజెక్షన్‌ బోర్‌వెల్స్‌ ఏర్పాటు చేయనున్నారు. ఇందుకుగాను రూ.4 లక్షలు ఖర్చు కాగలదని అంచనా వేశారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున, వర్షాలు వెలిశాక ఇంజెక్షన్‌ బోర్‌వెల్స్‌ పనులు జరుగుతాయని చీఫ్‌ ఇంజినీర్‌ జియావుద్దీన్‌ తెలిపారు. 

ఐటీ కారిడార్‌లో...  
జీహెచ్‌ఎంసీ కార్యాలయాలపై చేరే వాన నీటిని ఒడిసి పట్టేందుకు సిద్ధమైన జీహెచ్‌ఎంసీ.. గ్రేటర్‌లోని బహుళ అంతస్తుల భవనాల ప్రాంతాల్లో కూడా ఇంజెక్షన్‌ బోర్‌వెల్స్‌తో కూడిన ఇంకుడు గుంతలు ఏర్పాటు అవసరమని భావిస్తోంది. ముఖ్యంగా ఐటీ కారిడార్‌లో బహుళ అంతస్తుల భవనాలున్న ప్రాంతాల్లో నీరు బయటకు వెళ్లే మార్గం లేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఆయా భవనాలపై నుంచి వర్షపు నీరు రోడ్లపై వృథాగా పోకుండా ఇంజెక్షన్‌ బోర్‌వెల్స్‌తో ఇంకుడు గుంతలు ఏర్పాటుచేసుకోవాల్సిందిగా సూచించనున్నామని అధికారులు పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement