నిధులు ‘నీళ్ల’ధార | Decreased Ground Water Levels In Srikakulam District | Sakshi
Sakshi News home page

నిధులు ‘నీళ్ల’ధార

Published Sat, Aug 24 2019 8:39 AM | Last Updated on Sat, Aug 24 2019 8:54 AM

Decreased Ground Water Levels In Srikakulam District - Sakshi

ఒకవైపు నాగావళి, వంశధార, మహేంద్రతనయ, బాహుదా నదులు... మరోవైపు సముద్రం. కానీ భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. సాధారణంగా చుట్టూ నీటి వనరులు ఉండటం వలన రీచార్జ్‌ కావాలి. కానీ జిల్లాలో పరిస్థితి దయనీయంగా ఉంది. జల సంరక్షణ పేరుతో గత ప్రభుత్వం చేసిన ఆర్భాటం అంతా ఇంతా కాదు. వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. జల సంరక్షణైతే కన్పించలేదు గాని నిధుల స్వాహా మాత్రం పెద్ద ఎత్తున జరిగింది. టీడీపీ నేతల జేబులు నిండాయే తప్ప జిల్లాలో భూగర్భ జలాలు పెరగలేదు. ఖర్చు పెట్టిన కొద్దీ భూగర్భ జలాలు మరింత అడుగంటిపోయాయి. దోపిడీకి చూపించిన శ్రద్ధ తగ్గిపోయిన భూగర్భ జలాలపై చూపలేదు. దీంతో పరిస్థితి ప్రమాదకరంగా మారింది.                   

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: అభివృద్ధికి మూలం జలం అని చెప్పుకుని నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జల సంరక్షణ కోసం జిల్లాలో ఐదేళ్ల కాలంలో రూ.1026.19 కోట్ల వరకు ఖర్చు పెట్టారు. అనేక రకాల పథకాలు, కార్యక్రమాల పేరుతో పెద్ద ఎత్తున హడావుడి చేశారు. పనులు చేసినట్టు రికార్డుల్లో కూడా చూపించారు. కానీ జిల్లాలో భూగర్భ జలాలు పెరగలేదు సరికదా మరింత తగ్గిపోయాయి. దీంతో ప్రభుత్వ నిధులు నిరుపయోగమయ్యాయి. జల సంరక్షణ పనులు చేశాక కూడా భూగర్భ జలాలు మరింత దిగజారిపోయాయి. 2011 మే నాటికి 5.32 మీటర్ల లోతులో నీరు ఉండగా, 2015 మే నాటికి 5.88 మీటర్ల లోతుకు వెళ్లిపోయాయి. 2016 మే నాటికి 5.89 మీటర్ల లోతుకు చేరాయి. 2017మే నాటికైతే 6.82 మీటర్ల మరింత లోతుకు భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. 2018 మే నాటికి 6.05 మీటర్ల లోతుకు చేరగా, 2019 మే నాటికి 5.82 మీటర్ల లోతుకు వెళ్లాయి. 2018, 2019లో వరుసగా వచ్చిన తుపాన్లు కాసింత ప్రభావం చూపడంతో భూగర్భ జలాలు మరింత అడుగంటకుండా కాపాడాయి.  

నేతల ఆస్తులు పెరిగాయి... భూగర్భంలో నీళ్లు తగ్గాయి:
జల సంరక్షణ పేరుతో పనుల పందేరానికి తెరలేపారు. నామినేటెడ్‌ ముసుగులో నిధులు దోచి పెట్టారు. నేతలు సిండికేట్‌గా మారి పనులు చేపట్టారు. రికార్డుల్లో అంతా జరిగినట్టు చూపించారు. నిధులు ఎంచెక్కా డ్రా చేసేసుకున్నారు. కానీ భూగర్భ జలాలు మాత్రం పెరగలేదు. జిల్లాలో నీరు చెట్టు అక్రమాలు ఏ స్థాయిలో జరిగాయో అందరికీ తెలుసు. నేతల మేతకు బాగా పనిచేసింది. చెరువుల తవ్వకాలు, రిటైనింగ్‌ వాల్, చెక్‌డ్యామ్‌లు, స్లూయిజ్‌... ఇలా రకరకాల కాంక్రీట్‌ పనుల రూపంలో పెద్ద ఎత్తున నిధుల స్వాహా చేశారు. చెరువు పనుల్లో మట్టి అమ్మకాల ద్వారా కోట్లాది రూపాయలు ఆర్జించారు. ఇక, కాంక్రీటు పనుల విషయానికొస్తే కొన్ని పనులు నాసిరకంగా, మరికొన్ని అసంపూర్తిగా చేపట్టిన దాఖలాలు ఉన్నాయి. కొన్నిచోట్లయితే పనులు చేపట్టకుండానే నిధులు డ్రా చేసిన సందర్భాలు ఉన్నాయి. మరికొన్నిచోట్లయితే పాత పనులకే పైపై మెరుగులు దిద్ది బిల్లులు చేసేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

ఇదిలా ఉండగా ఇంకుడు గుంతలు, పంట సంజీవిని, కాంటూరు ట్రెంచెస్, రాక్‌ఫీల్డ్‌ డ్యామ్‌లు... తదితర కార్యక్రమాల పేరుతో ఇరిగేషన్, డ్వామా, అటవీ శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పనులు చేపట్టారు. వాటికి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. వీటిలో కూడా దాదాపు అక్రమాలు చోటు చేసుకున్నాయి. విజిలెన్స్‌ వరకు ఫిర్యాదులు కూడా వెళ్లాయి. విజిలెన్స్‌ విచారణలో కూడా అక్రమాలు వెలుగు చూశాయి. ముఖ్యంగా నీరు చెట్టు పూర్తిగా దోపిడీకి గురైందని తేలింది. చెప్పాలంటే జల సంరక్షణ పేరుతో నిధులు తినేశారు. దీంతో టీడీపీ నేతల ఆస్తులు గణనీయంగా పెరిగాయి. నేతల మేతకు పనికొచ్చాయే తప్ప నీటిమట్టాన్ని పెంచలేకపోయాయి.

భవిష్యత్‌పై బెంగ.. 
వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని అధికారుల రికార్డులు చెబుతున్నాయి. కానీ, భూగర్భ జలాలు మాత్రం ఎక్కడా పెరగలేదు సరికదా మరింత తగ్గిపోయాయి. 2014కు, ఇప్పటికీ చూస్తే మీటర్‌ లోతుకి భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. వరుస తుపాన్లు వచ్చినా కూడా మునుపటి స్థాయికి భూగర్భ జలాలు చేరలేదు. దీంతో ఆందోళన నెలకొంది. జిల్లాలో వంశధార, నాగావళి, బాహుదా, మహేంద్రతనయ వంటి నదులున్నాయి. వీటి వలన రీచార్జ్‌ జరిగి భూగర్భ జలాలు మరింత పెరగాల్సి ఉంది. అలాగే, మరోవైపు సముద్రం కూడా ఉంది. దాని వలన రీచార్జ్‌ జరిగే అవకాశం ఉంది. కానీ, ఊహించని విధంగా భూగర్భ జలాలు తగ్గిపోయాయి. నిధుల మేతపై చూపిన శ్రద్ధ భూగర్భ జలాల పరిరక్షణ కోసం చూపి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

జిల్లాలో గత ఐదేళ్లలో జల సంరక్షణకు చేసిన ఖర్చు..  
-నీరు చెట్టు పనులకు : రూ.427 కోట్లు
-మంచినీటి చెరువుల పూడిక తీతకు : రూ.113.91 కోట్లు
-సాగునీటి చెరువుల పనులకు: రూ.344.91 కోట్లు
-కొత్త పశువుల చెరువులు/చెరువుల డీసిల్టింగ్‌ పనులకు: రూ.83.28 కోట్లు
-ఇంకుడు గుంతల తవ్వకానికి: రూ.22.88 కోట్లు
-రజక చెరువుల పూడిక తీతకు : రూ.44.07 లక్షలు
-వ్యవసాయ చెరువు (ఫారమ్‌ ఫాండ్‌)లకు  : రూ.9.62 కోట్లు 
-మినీ పెర్కోలేషన్‌ పనులకు : రూ.44.35 లక్షలు
-అస్థిర కందకం కోసం: రూ.1.02 కోట్లు 
-బావుల తవ్వకానికి: రూ.31.83 లక్షలు 
-రెయిన్‌ వాటర్‌ హార్వెస్టింగ్‌ నిర్మాణాలకు: రూ.1.24 కోట్లు 
-సరిహద్దు కందకాల నిర్మాణం కోసం: రూ.2.31 కోట్లు 
-ఎస్‌ఎంసీ ట్రెంచెస్‌ నిర్మాణాలకు: రూ.2.72 కోట్లు 
-రాతి కట్టడాలకు: రూ.55.59 లక్షలు 
-ఇతర పనుల కోసం : రూ.15.54 కోట్లు   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement