కోడూరులో డీడబ్ల్యూఎల్‌ఆర్ వద్ద వాటర్ లెవల్ చూస్తున్న భూగర్భజల అధికారి హరీశ్‌బాబు
సాక్షి, మహబూబ్‌నగర్: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భూగర్భజలాల లెక్కింపు సులభతరం కానున్నది. గతంలో నెలకు ఒకసారి ఆయా ప్రాంతాలకు వెళ్లి భూగర్భజల శాఖ అధికారులు జలమట్టాన్ని లెక్కించేవారు. ఇకపై అలా కాకుండా కార్యాలయం నుంచే ఒక్క క్లిక్ ద్వారా భూగర్భ జలమట్టాన్ని తెలుసుకునే వెసులుబాటు కలిగింది. ప్రతి ఆరు గంటలకోసారి లెక్కించేందుకు ప్రభుత్వం నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి జిల్లాలోని ఆరు ప్రాంతాల్లో భూగర్భ జలాలను కొలిచేందుకు డిజిటల్ వాటర్ లెవల్ రికార్డు (డీడబ్ల్యూఎల్ ఆర్)ను ఉపయోగించనున్నారు. తొలిసారిగా ఆరు ప్రాంతాల్లో ఈ విధానంతో భూగర్భ జలాలను కొలుస్తున్నారు.
గతంలో నెలకోసారి..
జిల్లాలోని 16 మండలాల పరిధిలో 25 ఫిజోమీటర్ల ద్వారా నీటి మట్టాన్ని నెలకోసారి కొలిచేవారు. అయితే జలాన్ని కొ లిచేందుకు జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి ఫిజోమీటర్ల నుంచి డీడబ్ల్యూఎల్‌ఆర్‌ను ఉపయోగించి నీటిని కొలత వేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా తొలిసారి ఆరు ప్రాంతాల్లో ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రతి ఆరు గంటలకోసారి భూగర్భ జలాలను లెక్కించడంతో అది నెట్‌వర్క్ ద్వారా సర్వర్‌కు అప్‌లోడ్ అవుతుంది. భూగర్భ జలమట్టంతో పాటు భూగర్భ పీడనం ఉష్ణోగ్రత, బారోమెట్రిక్ పీడనంను కొలుస్తారు. నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టు ప్రపంచ బ్యాంక్ సహకారంతో ఈ పథకాన్ని అమలు చేస్తోంది.
కార్యాలయం నుంచే పర్యవేక్షణ..
కొత్త విధానంతో భూగర్భ జలమట్టాన్ని కార్యాలయంలో ఉండి వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. కొత్తగా ఏర్పాటు చేసిన డీడబ్ల్యూఎల్‌ఆర్ ద్వారా ప్రతి ఆరు గంటలకోసారి భూగర్భ జలాన్ని లెక్కిస్తారు. అధికారులు ఫిజియోమీటర్ వద్దకు వెళ్లి మానవాధారంగా నీటిని లెక్కించినప్పుడు ఆ ప్రాంతాల్లో బోరు నడవకపోతే ఒకలా లెక్క చూపుతుంది. అధికారులు వెళ్లిపోయిన తర్వాత ఆ ప్రాంతంలో బోర్లు నడిస్తే భూగర్భ జలాలు తగ్గిపోయే అవకాశం ఉంది.
చదవండి: కరోనా: ఆ కళ్లు మమ్మల్ని నిలదీస్తున్నాయి
తాజా సాంకేతిక పరిజ్ఞానంతో ప్రతి ఆరు గంటలకోసారి ఫిజియోమీటర్ వద్ద ఎంత భూగర్భ జలస్థాయి పడిపోయిందన్నది తెలుసుకోవచ్చు. ఫిజయోమీటర్ల వద్ద కొత్త సాంకేతిక పరిజ్ఞానం కలిగిన డీడబ్ల్యూఎల్‌ఆర్‌ను ఏర్పాటు చేశారు. ఈ సాంకేతిక సాఫ్ట్‌వేర్‌కు ఫిజియోమీటర్ అనుసంధానమై ఉండటంతో ఫిజియోమీటర్ కేంద్రానికి వెళ్లి భూగర్భజల మట్టాన్ని లెక్కించాల్సిన అవసరం లేదు. ప్రతి ఆరు గంటలకు ఒకసారి వెబ్‌సైట్ దానంతట అదే భూగర్భజల మట్టాన్ని నమోదు చేసుకుంటుంది.
ఆరు గంటలకోసారి తెలుసుకోవచ్చు
నూతన విధానం ద్వారా ప్రతి ఆరు గంటలకు ఒకసారి భూగర్భ జల నీటిమట్టం సులభంగా తెలుసుకునే అవకాశం ఉంది. గతంలో నెలకు ఒకసారి ఫిజియోమీటర్ వద్దకు వెళ్లి కొలతలు తీసుకునే వాళ్లం. డీడబ్ల్యూఎల్‌ఆర్ ద్వారా నీటిమట్టం ప్రతి ఆరు గంటలకోసారి నేరుగా వెబ్‌సైట్‌కు నమోదవుతుంది. నీటి మట్టాల్లో ఏమైనా తేడాలు ఉన్నట్లు తెలియగానే స్థానికులను అప్రమత్తం చేసేందుకు వీలుంటుంది.
– రాజేందర్‌కుమార్, భూగర్భ జలశాఖ అధికారి, మహబూబ్‌నగర్ జిల్లా
ఆరు ప్రాంతాలు ఇవే
► మహబూబ్‌నగర్ అర్బన్ మండలం ఏనుగొండ
► గండీడ్ మండలంలో సల్కర్‌పేట
► భూత్పూర్ మండలం భూత్పూర్
► నవాబుపేట మండలం నవాబుపేట
► మహబూబ్‌నగర్ రూరల్ మండలం కోడూర్
► దేవరకద్ర మండలం దేవరకద్ర
Comments
Please login to add a commentAdd a comment