పాతాళానికి గంగ | Ground Water Levels Down Fall in Prakasam | Sakshi
Sakshi News home page

పాతాళానికి గంగ

Published Fri, Jan 11 2019 11:39 AM | Last Updated on Fri, Jan 11 2019 11:39 AM

Ground Water Levels Down Fall in Prakasam - Sakshi

పుల్లలచెరువు మండలంలో ట్యాకర్‌ నీటి కోసం ఎగబడుతున్న స్థానికులు

ఒంగోలు సబర్బన్‌: భూగర్భ జలం అడుగడుగుకు ఒక నిక్షేపం అంటారు. ఒక్కోసారి బోరు పక్కనే బోరు వేసినా నీరు పడని దృష్టాంతాలు ఎన్నో ఉన్నాయి. అలాంటిది వరుసగా ఐదేళ్లు సక్రమంగా వర్షాలు పడకపోతే భూగర్భ జలాల పరిస్థితి ఏవిధంగా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడు జిల్లాలో అదే జరుగుతోంది. ప్రకాశం ప్రజలు తీవ్ర దుర్భిక్షాన్ని ఎదుర్కొంటున్నారు. మునుపెన్నడూ లేనివిధంగా భూగర్భ జలం అడుగంటి పోతోంది. గత 15 సంవత్సరాల్లో ఇలాంటి పరిస్థితి జిల్లాలో ఎదురుకాలేదంటే పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో అర్ధమవుతోంది. పశ్చిమ ప్రాంతంలో భూగర్భ జలాల పరిస్థితి మరీ దారుణంగా మారింది. జిల్లాలోని 20 మండలాల్లో కనీసంతాగటానికి మంచినీరు దొరికే పరిస్థితి కూడా లేదు. గడచిన ఐదేళ్లుగా జిల్లాలో వర్ష ఛాయలే కనపడలేదు. సాధారణ వర్షపాతం కంటే సగం కూడా పడని పరిస్థితి నెలకొంది. కొన్ని మండలాల్లో 50 మీటర్ల నుంచి 65 మీటర్ల లోతున కానీ నీరు లభ్యమయ్యే పరిస్థితి లేదు.

కొన్ని ప్రాంతాల్లో బావులు నిలువునా ఎండిపోయాయి. బోర్లు కూడా ఎండిపోయిన పరిస్థితులు పశ్చిమ ప్రాంతంలో నెలకొని ఉంది. ప్రమాదంగా కొమరోలు మండలం దద్దవాడ గ్రామంలో బోర్లలో 200 అడుగుల్లో ఉంది. పెదారవీడు మండలం కంభంపాడు గ్రామంలోనూ ఇదే పరిస్ధితి నెలకొంది. రాష్ట్ర ముఖ్యమంత్రి డాష్‌ బోర్డులోనూ జిల్లాలోని ఈ రెండు గ్రామాలు అత్యంత లోతులో నీరు అందే గ్రామాలుగా పేర్లు నమోదు అయి ఉన్నాయి.  అదీ పాత బోర్లలోని కొన్ని బోర్లలో మాత్రమే 200 అడుగుల్లో నీరు లభ్యమవుతోంది. కొత్తగా బోరు వేయాలంటే దాదాపు 500 నుంచి 800 అడుగుల వరకు భూమి లోపలకు వెళ్లినా గంగమ్మ పైకి ఉబికే పరిస్థితి లేదు. ఒక్కో గ్రామంలో అయితే 1,000 అడుగులు దాటినా బోర్లలో నీరు పడటం లేదు. చివరకు జిల్లాలోని 56 మండలాల్లో 41 మండలాల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. సముద్ర తీర ప్రాంత మండలాల్లో కొంతమేర భూగర్భ జలాలు ఒకమోస్తరులో ఉండగా పశ్చిమ ప్రాంతంలో పరిస్థితి మరీ దారుణంగా మారింది. తాగునీటికి కూడా గ్రామాలు అల్లాడిపోతున్నాయి. సుదూర ప్రాంతాల నుంచి తాగునీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఎక్కువ శాతం గ్రామాల్లో ఉంది. చివరకు గ్రామాల్లో కూడా బబుల్‌ క్యాన్లపై ఆధార పడాల్సిన పరిస్థితి నెలకొంది.

15 మండలాల్లో 20 మీటర్ల నుంచి 65 మీటర్ల లోతులో..
జిల్లాలోని 15 మండలాల్లో 20 మీటర్ల నుంచి 65 మీటర్ల లోతులో నీరు అందే పరిస్థితి నెలకొంది. వాటిలో ప్రధానంగా కొమరోలు, పెదారవీడు గిద్దలూరు, తర్లుపాడు, మార్కాపురం, రాచర్ల, బేస్తవారిపేట, పుల్లల చెరువు, దోర్నాల, వెలిగండ్ల, ఎర్రగొండపాలెం, కొరిశపాడు, కొనకనమిట్ల, దొనకొండ, కంభం మండలాలు ఉన్నాయి. ఇకపోతే 8 నుంచి 20 మీటర్ల లోతులో నీరు అందే పరిస్థితిలో 26 మండలాలు  ఉన్నాయి. అవి పొన్నలూరు, పామూరు, వీవీపాలెం, పీసీపల్లి, లింగసముద్రం, ముండ్లమూరు, చీమకుర్తి, సీఎస్‌ పురం, కొండపి, తాళ్ళూరు, హె చ్‌ఎం పాడు, కనిగిరి, గుడ్లూరు, సంతనూతలపాడు, పొదిలి, మర్రిపూడి,దర్శి, అర్ధవీడు, యద్దనపూడి, బల్లికురవ, అద్దంకి, ఒంగో లు, టంగుటూరు, జరుగుమల్లి, ఇంకొల్లు, జె.పంగులూరు మండలాలు ఉన్నాయి. జిల్లాలో మిగతా మండలాలు 3 నుంచి 8 మీటర్ల లోతులో నీరు అందుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement