సాక్షి, విశాఖపట్నం: ఎండలు మండుతున్న వేళ విశాఖ జిల్లాలోని భూగర్భ జలాలు ఊరటనిస్తున్నాయి. ఇవి అందుబాటులో ఉంటూ జనానికి ఉపశమనం కలిగిస్తున్నాయి.
సాధారణంగా వేసవిలో భూగర్భ జలాలు అడుగంటుతుంటాయి. తాగునీటికి ఇబ్బందులు ఎదురవుతాయి. కానీ ప్రస్తుతం ఈ ఏడాది సమ్మర్‌లో ఆ పరిస్థితి లేదు. నీటి మట్టాలు ఆశాజనకంగానే ఉంటున్నాయి. భూగర్భ జల వనరులు, జలగణన శాఖ తరచూ నీటి మట్టాలను పరిశీలిస్తుంది. వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పీజోమీటర్ల ద్వారా వాటి స్థాయిలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటుంది.
భూగర్భ శాఖ జిల్లాలో నమోదు చేసిన వివరాల ప్రకారం మార్చి ఆఖరి వరకు భీమిలి మండలం చుక్కవానిపాలెంలో భూగర్భ జలాలు అత్యంత పైన అంటే మూడు మీటర్లకంటే తక్కువ లోతులోనే లభ్యమవుతున్నాయి.
ఎండాడ ప్రాంతంలో అత్యంత దిగువన అంటే 19.35 మీటర్ల లోతు వరకు లభ్యం కావడం లేదు. 0–3 మీటర్ల మధ్య చుక్కవానిపాలెంతో పాటు చిప్పాడ, పాలవలస, నరవ ప్రాంతాల్లో భూగర్భ జలాలు అందుబాటులో ఉన్నాయి.
అలాగే 3–10 మీటర్ల మధ్య నీటి లభ్యత పందలపాక, శొంఠ్యాం, వెల్లంకి, భీమిలి, నగరంపాలెం, అగనంపూడి, బీహెచ్‌పీవీ, గొల్లలపాలెం, గోపాలపట్నం, అనంతవరం, ఐనాడ, పాండ్రంగి, టి.దేవాడ, స్టీల్‌ప్లాంట్, అప్పుఘర్, విశాలాక్షినగర్, పాండురంగాపురం, మధురవాడ, మారికవలస, తాటిచెట్లపాలెం ప్రాంతాలున్నాయి.
కణితి కాలనీ, పెందుర్తి, ఆరిలోవ, పెద్ద రుషికొండ, శివాజీపాలెం, వైఎస్సార్ పార్కు ప్రాంతాలు 10–20 మీటర్ల లోతులో నీటిమట్టాలున్నాయి.
హెచ్చుతగ్గులు ఇలా..
మార్చి నెలలో విశాఖ జిల్లాలో సగటు నీటిమట్టం 7.48 మీటర్లుగా ఉంది. గత ఏడాది మార్చిలో 6.82 మీటర్లలో ఉండేది. గత మార్చితో పోల్చుకుంటే స్వల్పంగా 0.66 మీటర్ల దిగువకు వెళ్లినట్టయింది.
గత సంవత్సరం మార్చితో భూగర్భ జలాల పరిస్థితిని పరిశీలిస్తే మొత్తం 31 పీజోమీటర్లకు గాను 14 చోట్ల పెరగ్గా, 17 చోట్ల దిగువకు వెళ్లాయి. వీటిలో శొంఠ్యాం, వెల్లంకి, భీమిలి, చుక్కవానిపాలెం, నగరంపాలెం, గొల్లలపాలెం, కణితి కాలనీ, పాండ్రంగి, పాలవలస, టి.దేవాడ, నరవ, పెందుర్తి, స్టీల్‌ప్లాంట్, మారికవలస ప్రాంతాల్లో నీటిమట్టాల స్థాయి పెరుగుదల కనిపించింది.
అలాగే పందలపాక, చిప్పాడ, అగనంపూడి, బీహెచ్‌పీవీ, గోపాలపట్నం, అనంతవరం, ఐనాడ, ఏపీటీడీసీ, ఆరిలోవ, బీవీకే కాలేజీ, యోగా విలేజీ, పెద్ద రుషికొండ, ఎండాడ, మధురవాడ, ఏపీఎస్‌ఐడీసీ, శివాజీపాలెం, వైఎస్సార్ పార్క్ ప్రాంతాల్లో భూగర్భ జలాలు దిగువకు వెళ్లాయి. జిల్లా మొత్తమ్మీద 20 మీటర్లకంటే దిగువన నీటిమట్టాలున్న ప్రాంతాలు ఒక్కటీ లేకపోవడం విశేషం!
భూగర్భ జలాల సంరక్షణ అవసరం
భూగర్భ జలాలనూ అందరూ బాధ్యతగా సంరక్షించుకోవాలి. వర్షం నీరు వృథాగా పోకుండా ఇళ్ల వద్ద ఇంకుడు గుంతలు వంటి వాటిని ఏర్పాటు చేసుకోవాలి. దీనివల్ల వేసవిలో భూగర్భ జలాలు అందుబాటులో ఉంటూ నీటి ఎద్దడికి ఆస్కారం ఉండదు. ప్రస్తుతం జిల్లాలో భూగర్భ జలాల పరిస్థితి ఆశాజనకంగా ఉంది.
– లక్ష్మణరావు, జిల్లా భూగర్భ జల శాఖాధికారి
సగటు భూగర్భ జలాల లభ్యత మండలాల వివరాలు ఇలా..
3 నుంచి 8 మీటర్ల లోపలే
ఆనందపురం, భీమిలి,
గాజువాక, ములగాడ,
పద్మనాభం, పెందుర్తి,
గోపాలపట్నం, పెదగంట్యాడ
8 నుంచి 20 మీటర్ల లోపు
మహారాణిపేట, సీతమ్మధార
విశాఖపట్నం రూరల్
Comments
Please login to add a commentAdd a comment