హైదరాబాద్, సాక్షి: ఫోన్ ట్యాపింగ్ కేసులో తెరపైకి కొత్త పేరు వచ్చింది. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో(SIB)లో పని చేసిన మరో సీనియర్ అధికారిని విచారణ జరిపేందుకు అధికారులు సిద్ధం అయ్యారు. ఎస్‌ఐబీలో సుదీర్ఘకాలం పని చేసిన ఆ అధికారికి... ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏ1 అయిన ప్రభాకర్‌రావుకు అత్యంత నమ్మకస్తుడిగా పేరుంది.
సీనియర్ అధికారితో పాటు ఓ ఇన్‌స్పెక్టర్‌కు నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టాలని ఈ కేసు దర్యాప్తు చేపట్టిన స్పెషల్ టీం భావిస్తోంది. ఇప్పటికే కస్టడీలో ఉన్న అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను ఇవాళ నాలుగో రోజు విచారణ చేపట్టారు. అదే సమయంలో.. ప్రభాకర్ రావు పోలీసులు ఎదుట విచారణ హాజరయ్యే అవకాశాలున్నాయనే చర్చా నడుస్తోంది.
ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పాత్రధారిగా భావిస్తున్న టి.ప్రభాకర్‌రావు పోలీసుల ఎదుట లొంగిపోనున్నారా? ఇప్పటి వరకు అరెస్టయిన పోలీసు అధికారులు.. దర్యాప్తులో ‘‘ప్రభాకర్‌రావు చెప్పినట్లు చేశాం’’ అంటూ వాంగ్మూలం ఇవ్వడంతో అన్ని వేళ్లు ఎస్‌ఐబీ మాజీ చీఫ్ వైపే చూపుతున్నాయని తెలుస్తోంది. దీంతో ఈ వ్యవహారం ఇంటర్‌పోల్ దాకా వెళ్లకముందే.. ప్రభాకర్‌రావు లొంగిపోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అమెరికా నుంచి ఆయన తిరుగు ప్రయాణమయారని.. విచారణ బృందం ఎదుట హాజరు కావొచ్చని సమాచారం. ఒకవేళ ప్రభాకర్‌రావు అప్రూవర్‌గా మారితే గనుక ఈ కేసు కీలక మలుపు తిరిగే అవకాశాలు లేకపోలేదు.
రాధాకిషన్‌ను 10 రోజుల కస్టడీ కోరుతూ..
ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు నాంపల్లి కోర్టును అశ్రయించారు. మాజీ ఓఎస్‌డీ రాధాకిషన్‌రావును పదిరోజుల కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కోర్టు రాధాకిషన్‌ను నోటీసులు జారీ చేసింది. అయితే కౌంటర్ దాఖలు చేస్తామని రాధాకిషన్ తరఫు న్యాయవాది తెలిపారు. దీంతో మధ్యాహ్నాం ఈ పిటిషన్‌పై వాదనలు జరిగే అవకాశం ఉంది.
టెలిగ్రాఫ్ యాక్ట్‌పై ఉత్కంఠ
అదే సమయంలో ఈ కేసులో టెలిగ్రాఫ్ యాక్ట్ నమోదుపై వాదనలు జరగాల్సి ఉంది. మరోపక్క ఈ కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేశారు. ఇప్పటికే టెలిగ్రాఫ్ యాక్ట్ కింద కేసు నమోదు కోసం పోలీసులు మెమో దాఖలు చేశారు. దీనిపై ఇవాళ కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
బెయిల్ కోసం ప్రణీత్‌రావు
ఫోన ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టైన మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు బెయిల్ కోసం నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై కోర్టు విచారణ చేపట్టనుంది.
Comments
Please login to add a commentAdd a comment