హైదరాబాద్, సాక్షి: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పరారీలో ఉన్న మాజీ ఐపీఎస్‌లు ప్రభాకర్‌రావు, శ్రవణ్ రావుల మీద రెడ్‌కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. సీబీఐ సాయంతో తెలంగాణ సీఐడీ ఈ నోటీసుల్ని జారీ చేయించింది. తద్వారా ఇంటర్‌పోల్ ద్వారా వాళ్లను స్వదేశానికి రప్పించాలని చూస్తోంది.
ట్యాపింగ్ వ్యవహారంలో ప్రణీత్‌రావు అరెస్ట్ అయిన వెంటనే ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు విదేశాలకు వెళ్లిపోయారు. ఈ కేసును విచారించిన ప్రత్యేక బృందం(సిట్).. ప్రణీత్‌రావు వాంగ్మూలం ఆధారంగా ప్రభాకర్‌రావు కనుసైగల్లోనే ట్యాపింగ్ వ్యవహారమంతా జరిగిందని నిర్ధారించుకుంది. ఏ1గా ప్రభాకర్‌రావు పేరును చేర్చింది. అటుపై ఆయన అమెరికాలో ఉన్నట్లు గుర్తించింది. అయితే..
ఈలోపు ప్రభాకర్‌రావుపై నాన్ బెయిలబుల్ వారెంట్లు, లుక్ అవుట నోటీసులు జారీ అయ్యాయి. అయితే తనకు ఆరోగ్యం బాగోలేదని, ఇప్పట్లో హైదరాబాద్ రాలేనని ప్రభాకర్‌రావు బదులు పంపించారు. కావాలంటే వర్చువల్‌గా విచారణకు హాజరవుతానని తెలియజేశారు. ప్రభాకర్‌రావు పంపిన లేఖను పోలీసులు నాంపల్లి కోర్టు దృష్టికి తీసుకెళ్లగా.. ఆ విజ్ఞప్తిని న్యాయస్థానం తిరస్కరించింది. వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రభాకర్‌రావుతో పాటు ఈ కేసులో ఏ6గా ఉన్న శ్రవణ్ కుమార్‌ను కూడా హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. అయితే శ్రవణ్ ఆచూకీని గుర్తించలేకపోయామని పోలీసులు కోర్టుకు తెలియజేశారు.
దీంతో ఏపీ సీఐడీ సాయంతో సీబీఐ ద్వారా ప్రభాకర్‌రావు, శ్రవణ్ మీద రెడ్‌కార్నర్ నోటీసులు జారీ చేయించింది సిట్. ఏ1గా ఉన్న ప్రభాకర్‌రావును విచారిస్తే కీలక విషయాలు బయటకు వస్తాయని దర్యాప్తు బృందం భావిస్తోంది. ఎలాగైనా ఆయన్ని భారత్‌కు రప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇంటర్‌పోల్ సాయం కోరే ప్రయత్నాల్లో ఉంది. త్వరలో ప్రత్యేక దర్యాప్తు అధికారుల బృందం అమెరికాకు వెళ్లే అవకాశం కూడా ఉందని సిట్ అధికారులు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. గతంలోనే ప్రభాకర్‌రావు మీద రెడ్‌కార్నర్ నోటీసులు జారీ అయ్యాయని మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే ఆ టైంలో అధికారులు అదంతా ఉత్తదేనని తేల్చారు.
రెడ్ కార్నర్ నోటీసులు.. ఇతర దేశాలకు పరారైన నిందితుల్ని కోర్టు విచారణ కోసం రప్పించేందుకు లేదంటే దోషుల శిక్ష అమలు కోసం రప్పించేందుకు జారీ చేసే నోటీసులు రెడ్ కార్నర్ నోటీసులు. ప్రపంచంలో ఉన్న 195 దేశాల జాతీయ దర్యాప్తు సంస్థల ఒప్పందం మేరకే ఈ వ్యవహారం నడుస్తుంది. ఇందుకోసం ఇంటర్‌పోల్ మధ్యవర్తితత్వం వహిస్తుంది. భారత్‌లో సీబీఐ సంస్థ రెడ్ కార్నర్ నోటీసుల జారీ, నిర్వహణను చూసుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment