సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించి రాతపరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. జూలై చివరి వారంలో పరీక్షలు ప్రారంభించడానికి కసరత్తు ప్రారంభమైంది. 19 రకాల పోస్టులకు సంబంధించి గ్రామ సచివాలయాల్లో 14,062, వార్డు సచివాలయాల్లో 2,146 పోస్టుల భర్తీకి ఈ ఏడాది జనవరిలో పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి శాఖలు వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేసిన విషయం విదితమే. ఫిబ్రవరి ఏడో తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించగా, మొత్తం 11.06 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఆయా పోస్టుల భర్తీకి 14 రకాల పరీక్షలు నిర్వహించాల్సి ఉంది.
► రాత పరీక్షల నిర్వహణపై పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్ ఆధ్వర్వంలో ఇటీవల ఉన్నత స్థాయి సమావేశం జరిగింది.
► కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలు కూడా జూలైలోనే జరగనున్నాయి. ఈ సమాచారంతో సచివాలయ పరీక్షలకు హాజరయ్యే వారికి ఇతర పరీక్షల షెడ్యూళ్లతో ఇబ్బంది కలగకుండా తుది తేదీలను ప్రకటించాలని నిర్ణయించారు.
► 14 రకాల పరీక్షలను జూలై చివరిలో ప్రారంభించి 8 రోజులలో పూర్తి చేయాలని భావిస్తున్నారు.
► పంచాయతీ కార్యదర్శి గ్రేడ్–5, మహిళా పోలీసు, వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ పోస్టులకు కలిపి కేటగిరి –1లో నిర్వహించే పరీక్షకు 4,56,997 మంది దరఖాస్తు చేసుకున్నారు. రాత పరీక్షలు ప్రారంభించే తొలిరోజునే ఈ పరీక్షను నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నారు.
సచివాలయాల పోస్టుల రాత పరీక్షలకు ఏర్పాట్లు
Published Mon, Jun 8 2020 4:36 AM | Last Updated on Mon, Jun 8 2020 4:36 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment