సాక్షి, అమరావతి: గ్రామ పంచాయతీలను ‘స్థానిక ప్రభుత్వాలు’గా తీర్చిదిద్దే దిశగా సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీలకు బదలాయించబడిన 29 రకాల అధికారాలను సదరు పంచాయతీలే సమర్థవంతంగా నిర్వహించేలా గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రవేశపెడుతూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 2వ తేదీ నుంచి ఏర్పాటయ్యే గ్రామ సచివాలయాల్లో పనిచేసేందుకు.. ప్రస్తుతం పంచాయతీ స్థాయిలో పనిచేస్తున్న వారు కాకుండా కొత్తగా 91,652 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గ్రామ సచివాలయాల ఏర్పాటు, సచివాలయాల నిర్వహణకు సంబంధించి విధి విధానాలను కూడా ఆ ఉత్తర్వుల్లో వివరించారు.
ప్రతి పంచాయతీ ఇక స్వతంత్ర ప్రతిపత్తి గల ప్రభుత్వమే
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరహాలోనే గ్రామ పంచాయతీల్లోనూ స్వతంత్ర ప్రతిపత్తి గల ప్రభుత్వం ఏర్పాటు కావాలనే లక్ష్యంతో 1994లో పార్లమెంట్‌లో 73వ రాజ్యాంగ సవరణ చేశారు. దీనికి అనుగుణంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉండే 13 శాఖలకు చెందిన 29 అధికారాలను గ్రామ పంచాయతీలతో కూడిన స్థానిక ప్రభుత్వాలకు బదలాయిస్తూ 2007, 2008 సంవత్సరాల్లో పలు ఉత్తర్వులు జారీ చేశారు. ఆ అధికారాలు నిర్వహించడానికి గ్రామ పంచాయతీల్లో తగిన సిబ్బంది నియామకానికి ఇప్పటివరకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టలేదు. నూతన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పంచాయతీలకు బదలాయించిన అధికారాలను స్థానికంగానే నిర్వహించుకునేలా పటిష్ట వ్యవస్థను నిర్మించేందుకు నిర్ణయించారు. దీంతోపాటు నవరత్నాల పథకాలు అట్టడుగు స్థాయిలో అర్హులందరికీ సమర్థవంతంగా అందజేసే లక్ష్యంతో గ్రామ సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నూతనంగా వ్యవస్థలో గ్రామ పంచాయతీ కార్యాలయాలను గ్రామ సచివాలయాలుగా మారుస్తారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించే గ్రామ వలంటీర్లు గ్రామ సచివాలయాల పరిధిలోకి వస్తారని ఉత్తర్వుల్లో వెల్లడించారు.
సచివాలయ కన్వీనర్ పంచాయతీ కార్యదర్శి
గ్రామ సచివాలయాలలో పనిచేసే ఉద్యోగులందరికీ గ్రామ కార్యదర్శి కన్వీనర్‌గా వ్యవహరిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జనాభా సంఖ్య ఆధారంగా కొన్నిచోట్ల రెండు లేక అంతకంటే ఎక్కువ గ్రామ పంచాయతీలకు ఒక గ్రామ సచివాలయం యూనిట్‌గా గ్రామ కార్యదర్శి, అతనికి అనుబంధ సిబ్బంది పనిచేస్తారని ఉత్తర్వులో పేర్కొన్నారు. కొన్ని పెద్ద గ్రామ పంచాయతీల్లో రెండు కంటే ఎక్కువ గ్రామ సచివాలయాలు ఏర్పాటవుతాయని, వాటిలోనూ పూర్తిస్థాయి సిబ్బంది పనిచేస్తారని పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్రంలో గల 13,065 గ్రామ పంచాయతీలను 11,114 గ్రామ సచివాలయాలుగా వర్గీకరిస్తున్నట్టు పేర్కొన్నారు. 2 వేల నుంచి 4 వేల మధ్య జనాభా ఉండే గ్రామ పంచాయతీల్లో ఒక గ్రామ సచివాలయం ఏర్పాటు చేస్తారు.
2 వేల లోపు జనాభా ఉన్నచోట వీలును బట్టి రెండు మూడు పంచాయతీలకు కలిపి ఒకే గ్రామ సచివాలయ యూనిట్ సిబ్బంది పనిచేస్తారని పేర్కొన్నారు. 4వేలకు పైబడి జనాభా ఉన్న ఒకే గ్రామ పంచాయతీలో రెండు లేదా అంతకంటే ఎక్కువ సచివాలయాలు ఏర్పాటు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో వివరించారు. గిరిజన ప్రాంతాల్లో 2వేల కంటే తక్కువ జనాభా ఉన్నచోట ఒక గ్రామ సచివాలయం ఏర్పాటుకు వీలు కల్పించారు. గ్రామ సచివాలయాల్లో పనిచేసే సిబ్బందితోపాటు ఆ గ్రామ సచివాలయం పరిధిలో పనిచేసే వలంటీర్లకు కన్వీనర్‌గా వ్యవహరించే గ్రామ కార్యదర్శి చేతుల మీదుగానే జీతాల చెల్లింపులు జరుగుతాయని పేర్కొన్నారు. కార్యదర్శి సహా గ్రామ సచివాలయాల్లో పనిచేసే సిబ్బందికి సెలవు మంజూరు చేసే అధికారాన్ని సర్పంచ్‌కు అప్పగించారు. గ్రామ సచివాలయ సిబ్బంది వివిధ లైన్ డిపార్ట్‌మెంట్స్‌తో కలిపి గ్రామాభివృద్ధి ప్రణాళికలు (జీపీడీపీ) రచించి అమలు చేస్తారు.
రెండేళ్ల పాటు రూ.15 వేలు జీతం.. తర్వాత రెగ్యులరైజేషన్
గ్రామ సచివాలయాల్లో పని చేయడానికి ప్రభుత్వం కొత్తగా నియమించే ఉద్యోగులకు మొదటి రెండేళ్ల పాటు ప్రొబెషనరీ పీరియడ్‌గా భావించి, ఆ కాలంలో నెలకు రూ.15 వేల చొప్పున స్టైఫండ్ రూపంలో వేతనంగా చెల్లిస్తారు. రెండేళ్ల తర్వాత వివిధ శాఖల నిబంధనల మేరకు వారిని రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గ్రామ సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగుల పనితీరును సమీక్షించడానికి మండల, జిల్లా స్థాయి అధికారుల ద్వారా ఎప్పటికప్పుడు నివేదికలను ప్రభుత్వం తెప్పించుకుంటుంది. ఇందుకోసం ఆన్‌లైన్ ద్వారా పర్యవేక్షణకు ప్రత్యేక మాడ్యూల్‌ను తయారు చేయనున్నట్టు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment