‘స్వచ్ఛ’ గ్రామం.. జగనన్న సంకల్పం | AP govt has a huge program aimed at cleaning the villages in AP | Sakshi
Sakshi News home page

‘స్వచ్ఛ’ గ్రామం.. జగనన్న సంకల్పం

Published Sat, Mar 27 2021 3:21 AM | Last Updated on Sat, Mar 27 2021 9:48 AM

AP govt has a huge program aimed at cleaning the villages in AP - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని గ్రామాలన్నింటినీ పరిశుభ్రంగా ఉంచాలని, వాటిని ‘స్వచ్ఛ’ గ్రామాలుగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా పట్టణ ప్రాంతాల్లో మాదిరి గ్రామాల్లోనూ ప్రతిరోజూ ఇంటింటి నుంచి చెత్తను సేకరించడం, ప్రతిరోజూ రోడ్లను ఊడ్చే కార్యక్రమాలను చేపట్టనుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి రోజైన జూలై 8వ తేదీ నుంచి ‘జగనన్న స్వచ్ఛ సంకల్పం’ పేరుతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది.

గ్రామాల్లోని వీధుల్లో చెత్తకుప్పలు ఉండరాదు.. ఇళ్ల మధ్య నీటిగుంతలు కనిపించకూడదు.. రోడ్లపై చెత్త, మురుగునీరు ఎక్కడా నిల్వ ఉండరాదు.. వీధులన్నీ పరిశుభ్రంగా ఉండాలి.. అనే సంకల్పంతో ఈ కార్యక్రమం చేపడుతోంది. పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో 100 రోజులపాటు ఈ బృహత్తర కార్యక్రమం కొనసాగుతుంది. ఆయా అంశాలపై గ్రామాల్లోని ప్రజల్లో అవగాహన కల్పించనుంది.

అయితే గ్రామాల పరిశుభ్రతకు ఎన్ని కోట్ల నిధులు వెచ్చించినా ప్రజల భాగస్వామ్యం లేనిదే అనుకున్న లక్ష్యాలను సాధించడం కష్టమనే భావనతో పంచాయతీరాజ్‌ శాఖ ఉన్నతాధికారులు ఈ భారీ కార్యక్రమంలో ప్రణాళికాబద్ధంగా ప్రజలను పూర్తిగా భాగస్వాములను చేస్తూ అమలు చేసేందుకు ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేశారు. 

కార్యక్రమం అమలు ఇలా.. 
► వీధుల్లో చెత్తకుప్పలు లేని.. చెత్తకుండీలు సైతం అవసరం లేని.. ఇళ్లమధ్య నీటి గుంతలకు తావులేని.. పూర్తి పరిశుభ్రమైన గ్రామంగా ఉండడానికి ప్రతిరోజూ ఎలాంటి పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలో, వాటన్నింటినీ రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో జూలై 8వ తేదీ నుంచి వంద రోజులపాటు పంచాయతీరాజ్‌ శాఖ అధికారులే అమలు చేసి చూపిస్తారు. ఈ వంద రోజుల కార్యక్రమానికయ్యే ఖర్చును పంచాయతీరాజ్‌ శాఖ నిధుల నుంచే వ్యయం చేస్తారు.   
► వందరోజుల సమయంలోనే గ్రామం పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల కుటుంబ ఆరోగ్య విషయాల్లో కనిపించే ప్రయోజనాలపై గ్రామస్తులకు అవగాహన పెంచే ప్రచార కార్యక్రమాలను కొనసాగిస్తారు. 


► గ్రామాల్లో విచ్చలవిడిగా ప్లాస్టిక్‌ వినియోగం జరుగుతుండడం వల్ల జరిగే అనర్థాలపైనా ప్రజలలో అవగాహన కల్పిస్తారు. 
► వంద రోజులపాటు రాష్ట్రంలోని గ్రామాలన్నింటినీ పూర్తి పరిశుభ్రంగా ఉంచడాన్ని చూపించి.. ఆ తర్వాత తమ ఊరిని పరిశుభ్రంగా ఉంచుకునే బాధ్యతను గ్రామ పంచాయతీకి, స్థానిక ప్రజలకు అప్పగిస్తారు. ఇందుకు గ్రామ పంచాయతీలో ఉన్న నిధులు సరిపోనిపక్షంలో ప్రజల భాగస్వామ్యం అవసరాన్ని అధికారులు ప్రత్యేక ప్రచార కార్యక్రమాల ద్వారా తెలియచెబుతారు. చెత్తను ఇష్టానుసారం రోడ్లపైన వేయడం, మురుగునీటిని రోడ్లపైకి మళ్లించడం వంటి అపరిశుభ్ర కార్యక్రమాలకు పాల్పడేవారిపై అవసరమైతే పెనాల్టీలు వసూలు చేసుకునే అధికారాలను గ్రామపంచాయతీలకు అప్పగిస్తారు. 

ఏప్రిల్‌ 7 నుంచి సన్నాహక కార్యక్రమాలు 
ప్రపంచ ఆరోగ్య దినోత్సవమైన ఏప్రిల్‌ 7వ తేదీ నుంచే సన్నాహక కార్యక్రమాలను పంచాయతీరాజ్‌ శాఖ మొదలుపెట్టనుంది. గ్రామాలు పరిశుభ్రంగా ఉంచడానికి అవసరమైన అన్నిరకాల ఆధునిక పనిముట్లను ఈ సందర్భంగా గుర్తించి ఆయా గ్రామ పంచాయతీలకు అందజేస్తుంది. గ్రామంలో ఎవరూ చెత్తను రోడ్డుపై పడవేయకుండా ఇంటింటి నుంచి చెత్త సేకరణకు ట్రైసైకిళ్లు, మురుగు కాల్వలు శుభ్రం చేసేందుకు హై ప్రెజర్‌ టాయిలెట్‌ క్లీనర్లు, ఫాగింగ్‌ మిషన్లను అన్ని గ్రామ పంచాయతీల వద్ద అందుబాటులో ఉంచనుంది. ఇప్పటికే గ్రామ పంచాయతీల వద్ద అందుబాటులో ఉన్న పరికరాలకు అదనంగా కావాల్సినచోట మరికొన్నింటిని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ నిధుల ద్వారా కొనుగోలు చేస్తారు. సేకరించిన చెత్తను ప్రాసెస్‌ చేయడానికి గ్రామాల్లో అవసరమైన చోట్ల షెడ్లను ఉపాధి హామీ పథకం నిధుల ద్వారా నిర్మిస్తారు. 

అధికారులతో ద్వివేది వీడియో కాన్ఫరెన్స్‌
‘జగనన్న స్వచ్ఛ సంకల్పం’ పేరుతో గ్రామాల పరిశుభ్రతకు రాష్ట్ర ప్రభుత్వం జూలై 8 నుంచి మొదలుపెట్టే వంద రోజుల భారీ ప్రచార కార్యక్రమం అమలుపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది శుక్రవారం అన్ని జిల్లాల జెడ్పీ సీఈవోలు, డీపీవోలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. గ్రామాల పరిశుభ్రత విషయంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో ఉన్నారని ఆయన చెబుతూ.. సొంత ఊరిని పరిశుభ్రంగా ఉంచుకోవడంలో ప్రజలను భాగస్వాములను చేసేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై జిల్లా అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ ఎండీ సంపత్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.   
(చదవండి: పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్‌.. 100 రోజుల ప్రచారం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement