సాక్షి, అమరావతి: కోర్టు ధిక్కార వ్యాజ్యాల్లో హైకోర్టు ప్రామాణిక రూపంలో జారీచేసే ఫాం–1 నోటీసులో అదనపు వాక్యాలు చేరుస్తూ ఇద్దరు హైకోర్టు అధికారులు వ్యవహరించిన తీరుపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం మండిపడింది. ప్రామాణిక రూపానికి అదనపు వాక్యాలు చేర్చడం న్యాయస్థాన రాజ్యాంగ విధుల్లో జోక్యం చేసుకోవడమే అవుతుందని స్పష్టంచేసింది. ఇందుకు బాధ్యులైన ఆ ఇద్దరు అధికారులపై సుమోటో కింద కోర్టు ధిక్కార చర్యలు చేపట్టాలని రిజిస్ట్రార్ జనరల్‌ను ఆదేశించింది. పరిపాలనాపరంగా వారిపై తగిన చర్యలు తీసుకునేందుకు వీలుగా ఈ వ్యవహారాన్ని ప్రధాన న్యాయమూర్తి ముందుంచాలని రిజిస్ట్రార్ జనరల్‌కు స్పష్టంచేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు.
సర్వీసు క్రమబద్ధీకరణకు పిటిషన్..
తన నియామకం జరిగిన నాటి నుంచి బిల్ కలెక్టర్‌గా తన సర్వీసును క్రమబద్ధీకరించేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చెందిన ఎస్. భైరవమూర్తి 2019లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. భైరవమూర్తి సర్వీసును క్రమబద్ధీకరించాలంటూ పంచాయతీరాజ్ శాఖను ఆదేశించింది. ఈ ఆదేశాలను అధికారులు అమలుచేయకపోవడంతో వారిపై భైరవమూర్తి 2020లో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ, కమిషనర్ గిరిజా శంకర్, జిల్లా కలెక్టర్ మురళీధర్‌రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) ఎస్వీ నాగేశ్వర నాయక్‌లను ప్రతివాదులుగా చేర్చారు. చివరకు 2021 మే 31న అధికారులు కోర్టు ఆదేశాలను పూర్తిస్థాయిలో అమలుచేశారు. కోర్టు ఆదేశాల అమలులో జాప్యానికి డీపీఓ, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ కారణమని న్యాయస్థానం తేల్చింది. కానీ, ఇందులో జిల్లా కలెక్టర్ మురళీధర్‌రెడ్డికి ఎలాంటి సంబంధం లేదంటూ అతని పేరు తొలగించింది. అనంతరం డీపీవో, ద్వివేదీలు కోర్టు ఆదేశాల అమల్లో జాప్యానికి క్షమాపణ కోరి భవిష్యత్తులో జాగ్రత్తగా ఉంటామన్నారు. దీంతో హైకోర్టు వారిపై కోర్టు ధిక్కార కేసును మూసివేసింది.
ఆ ఇద్దరు అధికారులు బాధ్యులు
ప్రామాణిక రూపంలో ఉండే ఫాం–1 నోటీసులో అదనపు వాక్యాలు చేర్చడాన్ని న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ తీవ్రంగా పరిగణించారు. దీనిపై విచారణ జరిపి బాధ్యులెవరో గుర్తించాలని రిజిస్ట్రార్(జ్యుడీషియల్)ను ఆదేశించారు. విచారణ జరిపిన రిజిస్ట్రార్.. ఇందుకు ఇద్దరు అధికారులను బాధ్యులుగా తేల్చారు. వారిపై పాలనాపరమైన చర్యల నిమిత్తం ఈ వ్యవహారాన్ని ప్రధాన న్యాయమూర్తి ముందుంచాలని రిజిస్ట్రార్ జనరల్‌ను జస్టిస్ దేవానంద్ ఆదేశించారు.
‘ఆ ఇద్దరిపై చర్యలు తీసుకోండి’
Published Sun, Jul 18 2021 3:32 AM | Last Updated on Sun, Jul 18 2021 3:32 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment