కొండసాని సురేష్ రెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారుల సోదాలు
సాక్షి, అమరావతి/అనంతపురం సెంట్రల్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అనంతపురం పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కొండసాని సురేష్ రెడ్డి ఏసీబీ అధికారులకు చిక్కారు. మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి పీఏగా, అనుచరుడిగా సుపరిచితుడైన సురేష్ రెడ్డి ఇంటిపై శుక్రవారం కర్నూలు ఏసీబీ డీఎస్పీ నాగభూషణం ఆధ్వర్యంలో ఏకకాలంలో దాడులు చేశారు. రాంనగర్‌లో ఆయన నివాసంతో పాటు పుట్టపర్తిలో రెండు చోట్ల, కర్నూలు జిల్లా బేతంచర్లలోని అత్తారింట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. పుట్టపర్తిలో సాయి సంస్కృతి ఎడ్యుకేషన్ ట్రస్టు స్థాపించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో.. అతని భాగస్వామి విజయభాస్కర్‌రెడ్డి ఇంట్లో కూడా తనిఖీలు చేశారు. మొత్తం రూ.4.17 కోట్ల విలువైన ఆస్తులను కనుగొన్నామని ఏసీబీ డీజీ కుమార విశ్వజిత్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఇవీ అక్రమాస్తుల చిట్టా..
ఏసీబీ బయటపెట్టిన సురేష్ రెడ్డి అక్రమాస్తుల విలువ బహిరంగ మార్కెట్‌లో రూ. 100 కోట్లకు పైగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. 2018లో పుట్టపర్తిలో ఎకరం ఖాళీ స్థలాన్ని, పుట్టపర్తి మండలం ఎనుములపల్లిలో 1.63 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసినట్లు ఏసీబీ డీజీ వెల్లడించారు. తనిఖీల్లో 332.4 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.1.98 లక్షల విలువైన వస్తువులు, రూ.4.13 లక్షల నగదు గుర్తించారు. ఇన్నోవా, ఆల్టో కారు ఉన్నట్లు తెలిపారు బినామీ పేర్లతో ఆస్తులు కూడబెట్టి ఉండవచ్చనే కోణంలో విచారిస్తున్నారు.
ఎవరీ సురేష్ రెడ్డి ?
1991లో పంచాయతీరాజ్ శాఖలో ఉద్యోగిగా అడుగుపెట్టి.. 2004లో ఆ శాఖ మంత్రిగా ఉన్న జేసీ దివాకర్‌రెడ్డి పీఏగా వెళ్లారు. 2009లో జేసీ అండతో పుట్టపర్తి టికెట్ తనకే అనే ప్రచారం కూడా చేసుకుని.. పంచాయతీరాజ్ విభాగంలో ఏఈఈ ఉద్యోగానికి రాజీనామా చేశారు. టికెట్ రాకపోవడంతో తన పలుకుబడితో మళ్లీ ఉద్యోగం సంపాదించుకున్నారు. సెటిల్‌మెంట్లకు పాల్పడుతూ రూ.కోట్లు సంపాదించారనే ఆరోపణలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment