న్యూఢిల్లీ/బెంగళూరు: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో సీబీఐ కేసును కొట్టేయాలంటూ ఆయన వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది.
ఈ పరిణామంపై బెంగళూరులో డీకేఎస్ మీడియాతో మాట్లాడారు. ‘‘ఇది కచ్చితంగా ఎదురుదెబ్బే. ఏం చేయమంటారు?. పైగా ఇది అన్యాయం’’ అని అన్నారాయన. నాపై సీబీఐ కేసు.. దర్యాప్తు రాజకీయ ప్రతీకార చర్య అని ప్రతీ ఒక్కరికీ తెలుసు. బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ కేసు దర్యాప్తు కోసం సీబీఐకి అన్ని అనుమతులు ఇచ్చింది. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సీబీఐకి ఇచ్చిన అనుమతుల్ని వెనక్కి తీసుకుని, లోకాయుక్తాకు ఆ కేసు అప్పగించింది. అయినా కూడా సీబీఐ దర్యాప్తు చేస్తోంది.
ఇది ప్రభుత్వ నిర్ణయానికి సంబంధించిన అంశం. ఈ విషయాలన్నీ పరిగణనలోకి తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించా. కానీ, వాళ్లు(సుప్రీం ధర్మాసనం) కుదరదని చెప్పారు అని డీకే శివకుమార్ అన్నారు. అయితే న్యాయపరంగా ఉన్న అన్నిమార్గాలను పరిశీలించి.. మరోసారి అప్పీల్ చేస్తానని చెప్పారాయన.
ఇదిలా ఉంటే.. ఇవాళ సుప్రీం కోర్టులో డీకేఎస్ పిటిషన్‌ను జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ద్విసభ్య ధర్మాసం విచారణ చేపట్టింది. అయితే.. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని, ఇందులో జోక్యం చేసుకునేందుకు ఏ కారణం కనిపించడం లేదని బెంచ్ వ్యాఖ్యానిస్తూ ఆ పిటిషన్‌ను తిరస్కరించింది.
2013-18 కాంగ్రెస్ అధికారంలో ఉండగా.. మంత్రి హోదాలో డీకే శివకుమార్ అక్రమాస్తులు కూడబెట్టారన్నది ప్రధాన అభియోగం. 2020లో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా.. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పజెప్పింది. దర్యాప్తు జరిపిన సీబీఐ దాని విలువ రూ.74 కోట్ల రూపాయలపైమాటేనని అభియోగాలు నమోదు చేసింది. ఈ ఎఫ్‌ఐఆర్‌ను ఆయన కర్ణాటక హైకోర్టులో సవాల్ చేయగా.. కోర్టు సైతం దర్యాప్తు సంస్థకు అనుకూలంగా ఆదేశాలు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment