Illegal assets case
-
ఇది అన్యాయం: డీకే శివకుమార్
న్యూఢిల్లీ/బెంగళూరు: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో సీబీఐ కేసును కొట్టేయాలంటూ ఆయన వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది.ఈ పరిణామంపై బెంగళూరులో డీకేఎస్ మీడియాతో మాట్లాడారు. ‘‘ఇది కచ్చితంగా ఎదురుదెబ్బే. ఏం చేయమంటారు?. పైగా ఇది అన్యాయం’’ అని అన్నారాయన. నాపై సీబీఐ కేసు.. దర్యాప్తు రాజకీయ ప్రతీకార చర్య అని ప్రతీ ఒక్కరికీ తెలుసు. బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ కేసు దర్యాప్తు కోసం సీబీఐకి అన్ని అనుమతులు ఇచ్చింది. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సీబీఐకి ఇచ్చిన అనుమతుల్ని వెనక్కి తీసుకుని, లోకాయుక్తాకు ఆ కేసు అప్పగించింది. అయినా కూడా సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఇది ప్రభుత్వ నిర్ణయానికి సంబంధించిన అంశం. ఈ విషయాలన్నీ పరిగణనలోకి తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించా. కానీ, వాళ్లు(సుప్రీం ధర్మాసనం) కుదరదని చెప్పారు అని డీకే శివకుమార్ అన్నారు. అయితే న్యాయపరంగా ఉన్న అన్నిమార్గాలను పరిశీలించి.. మరోసారి అప్పీల్ చేస్తానని చెప్పారాయన.ఇదిలా ఉంటే.. ఇవాళ సుప్రీం కోర్టులో డీకేఎస్ పిటిషన్‌ను జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ద్విసభ్య ధర్మాసం విచారణ చేపట్టింది. అయితే.. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని, ఇందులో జోక్యం చేసుకునేందుకు ఏ కారణం కనిపించడం లేదని బెంచ్ వ్యాఖ్యానిస్తూ ఆ పిటిషన్‌ను తిరస్కరించింది.2013-18 కాంగ్రెస్ అధికారంలో ఉండగా.. మంత్రి హోదాలో డీకే శివకుమార్ అక్రమాస్తులు కూడబెట్టారన్నది ప్రధాన అభియోగం. 2020లో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా.. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పజెప్పింది. దర్యాప్తు జరిపిన సీబీఐ దాని విలువ రూ.74 కోట్ల రూపాయలపైమాటేనని అభియోగాలు నమోదు చేసింది. ఈ ఎఫ్ఐఆర్ను ఆయన కర్ణాటక హైకోర్టులో సవాల్ చేయగా.. కోర్టు సైతం దర్యాప్తు సంస్థకు అనుకూలంగా ఆదేశాలు జారీ చేసింది. -
ఉమా మహేశ్వర ‘అక్రమ’రూపస్య
సాక్షి, హైదరాబాద్: ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో (సీసీఎస్) ఏసీపీగా పని చేస్తున్న టీఎస్ ఉమామహేశ్వరరావును ఏసీబీ అరెస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో ఆయన బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. న్యాయం కోసం వెళ్లిన వారిని ఆయన తీవ్ర ఇబ్బందులకు గురిచేసినట్టు అధికారులు గుర్తించారు.ఇక, ఏసీపీ ఉమా మహేశ్వరరావు వ్యవహారశైలిపై కూడా గతంలోనే ఫిర్యాదులు వచ్చాయి. అతనిపై ఇప్పటికే మూడుసార్లు సస్పెన్షన్ వేటుగా పడింది. అయినా కూడా ఆయన తన తీరు మార్చుకోలేదు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని సివిల్ కేసులను క్రిమినల్ కేసులుగా మార్చి లక్షల రూపాయలను కాజేశారు.సీసీఎస్‌లో బాధితులకు న్యాయం చేయాల్సిన హోదాలో ఉంటూ వారితోనే బేరసారాలాడారు. కాగా, ఓ ఎన్నారై ఫిర్యాదు చేయడానికి రావడంతో అతడిని సైతం బెదిరించి డబ్బులు దండుకున్నట్టు అధికారులు గుర్తించారు. ఇక, తోటి సిబ్బందిని బూతులు తిడుతూ, అవహేళన, వారిపై అసహనం వ్యక్తం చేసిన సందర్భాలు చాలానే పోలీసులు చెబుతున్నారు. తన దగ్గరికి వచ్చిన ప్రతీ కేసులోనూ ఉమా మహేశ్వర రావు చేతివాటం చూపించినట్టు సమాచారం. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆయన, ఆయన బంధువుల నివాసాలపై మంగళవారం దాడులు చేశారు. తెలంగాణ, ఏపీలోని ఉమామహేశ్వరావు ఇళ్లు, ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లతో సహా మొత్తం 11 చోట్ల సోదాలు నిర్వహించారు. తనిఖీల్లో నగదు, బంగారం, ఆస్తి పత్రాలతో పాటు రెండు బ్యాంకు లాకర్లను గుర్తించినట్లు తెలిసింది.అక్రమ ఆస్తుల కూడబెట్టుకుని నగర శివారులో విలాసవంతమైన విల్లాలు కొనుగోలు చేశారు. శామీర్‌పేటలో విల్లా, ఘట్కేసర్లో ఐడు ప్లాట్స్ కొనుగోలు చేశారు. అంతేకాకుండా తన ఇంట్లో నగదు ఉంచకుండా.. తన అత్తామామల ఇంట్లోనే డబ్బును దాచిపెట్టారు. లావాదేవీల మొత్తం సమాచారాన్ని ఆయన ట్యాబ్‌లో స్టోర్ చేసుకున్నారు. ఇక, ఉమా మహేశ్వరరావు ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో 50కోట్లకు వరకు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇక, తెలుగు రాష్ట్రాల్లో 17చోట్ల ఆస్తులను గుర్తించారు. సోదాల్లో భాగంగా ఇప్పటి వరకు రూ.38లక్షల నగదు, 60 తులాల బంగారం సీజ్. కాగా, కాసేపట్లో ఉమా మహేశ్వర్‌ను అధికారులు ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నారు. -
అగ్నికి ఆజ్యం పోసిన అరెస్టు
రావల్పిండిలోని సైనిక ప్రధాన కార్యాలయ కనుసన్నల్లో ఇస్లామాబాద్ ప్రభుత్వం మెలగాల్సి రావడం పాకిస్తాన్ రాజకీయాలకు సంబంధించిన ఒక క్రూరమైన వ్యంగ్యాన్ని సూచిస్తుంది. ప్రధాని పదవికి ఇమ్రాన్ ఖాన్ చేరువకావడం, ఆ తర్వాత ఆయన అవమానకరమైన పతనం రెండూ సైనిక నాయ కత్వపు స్థిరత్వానికి చక్కటి ఉదాహరణ. పాకిస్తాన్ రాజకీయ, ఆర్థిక, భద్రతకు సంబంధించిన అనేక సవాళ్లను ఇమ్రాన్ అరెస్టు ఉదంతం మరింతగా పెంచుతుంది. యూఎస్ డాలర్‌తో పోలిస్తే పాకిస్తాన్ రూపాయి 282 రూపాయల కంటే తక్కువగా ఉండటంతో ఆర్థిక అవకాశాలు వట్టిపోతున్నాయి. దాతల సహాయాన్ని కోరుతున్నప్పుడు తరచుగా తిరస్కారానికి గురయినట్లు పాక్ తాజా మాజీ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా అంగీకరించారు. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను అక్రమాస్తుల కేసులో దోషిగా తేలిన తర్వాత ఆగస్టు 5న అరెస్టు చేశారు. చట్టం నిర్దేశించినట్లుగా ‘విచారణ ప్రక్రియ’ మార్గంలో వెళ్ళడానికి ఎలాంటి ప్రయత్నం చేయకుండానే, ప్రభుత్వ వ్యవస్థ ప్రధాన అంగం మాజీ ప్రధానమంత్రిపై దాడి చేసింది. ఇమ్రాన్ ఖాన్‌కు మునుపటి పాలకుల్లో కొందరు ఇటీవలి దశాబ్దాలలో అను భవించిన సుపరిచితమైన శిక్షా క్రమంలో ఇదీ భాగమే. రాజకీయ నేతగా మారిన ఈ ప్రజాకర్షక క్రికెటర్‌ను 2023 మే 9న అరెస్టు చేశారు. పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఈ అరెస్టును ‘చట్టవిరుద్ధం’గా ప్రకటించి, ఆయన్ని విడుదల చేయగా, అది హింసాత్మక నిరసనలకు దారి తీసింది. ఫలితంగా 10 మంది మరణించారు. ప్రజా ఆస్తులకు గణనీ యమైన నష్టం వాటిల్లింది. ఈసారి ఇమ్రాన్ అరెస్టుకు వీధుల్లో ప్రజల ప్రత్యక్ష మద్దతు ఇంకా లభించలేదు. ఇమ్రాన్ సొంత పార్టీ అయిన పాకిస్తాన్ తహరీక్–ఎ– ఇన్సాఫ్ (పీటీఐ), ఆయన్ని పంజాబ్ రాష్ట్రంలోని అటక్ జైలు నుండి రావల్పిండిలోని అత్యంత భద్రత కలిగి వున్న అదియాలా జైలుకు మార్చాలని ఇస్లామాబాద్ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఇమ్రాన్‌కు మునుపు దేశాన్ని పాలించిన మాజీ ప్రధానులు షాహిద్ ఖాకన్ అబ్బాసీ, నవాజ్ షరీఫ్, బేనజీర్ భుట్టో కూడా అదే విధంగా క్రూర బెదిరింపులకు గురయ్యారు. విచారణను ఎదుర్కుంటూ, 1979లో ఉరిశిక్షకు గురైన జుల్ఫికర్ అలీ భుట్టోకు పట్టిన గతి తెలిసిందే. రాజకీయ అదృష్టం ముఖం చాటేసినప్పుడు, పాకిస్తాన్ రాజ్యవ్యవస్థ తన సొంత అగ్రనేతలకు విధించే తీవ్రమైన శిక్ష ఎలాంటిదో భుట్టో ఉదంతం గుర్తుచేస్తుంది. ఇమ్రాన్ పొందిన ఈ పతనం, పాకిస్తాన్ సైన్యం ఆయన పట్ల అభిమానం కోల్పోయిందని సూచిస్తుంది. ప్రత్య క్షంగా లేదా పరోక్షంగా పాక్ సైన్యం చేతుల్లో పగ్గాలు ఉంటాయి. సైనిక ప్రయోజనాలకు అనుగుణంగా రాజకీయ నాయకత్వం మసలుకోన ప్పుడు లేదా మరీ ఎక్కువగా స్వతంత్రత ప్రదర్శించినప్పుడు పాక్ సైన్యం రాజకీయ నాయకత్వాన్ని అధికారం నుండి దింపేస్తుంది. రావల్పిండిలోని సైనిక ప్రధాన కార్యాలయ కనుసన్నల్లో ఇస్లామాబాద్ ప్రభుత్వం మెలగాల్సి రావడం పాక్ రాజకీయాలకు సంబంధించిన ఒక క్రూరమైన వ్యంగ్యాన్ని సూచిస్తుంది. శాసన సభ్యులు ఎంత ప్రజాస్వామ్యాన్ని ఉపయోగించవచ్చో నిర్ణయించేది సైన్యమే. స్పష్టంగా, సైన్యం మద్దతిచ్చి మరీ ప్రధానమంత్రి కుర్చీలో కూర్చో బెట్టిన ఇమ్రాన్ ఆ సైన్యం చేతినే కొరకడంతో పాక్ సైనిక నాయకత్వం చాలా అసౌకర్యాన్ని అనుభవించింది. పాకిస్తాన్లో అత్యు న్నత కార్యా లయానికి (ఆగస్టు 2018) ఇమ్రాన్ ఒక్కసారిగా చేరువ కావడం, ఆ తర్వాత ఆయన అవమానకరమైన పతనం రెండూ సైనిక నాయ కత్వపు స్థిరత్వానికి చక్కటి ఉదాహరణగా చెప్పవచ్చు. 1996లో ఇమ్రాన్ స్థాపించిన పాకిస్తాన్ తహరీక్–ఎ–ఇన్సాఫ్ (పీటీఐ) ఒకప్పుడు దేశ రాజకీయాల్లో పరాయి పార్టీగా ఉండేది. దశాబ్ద కాలంలోనే, పాక్‌లో బలంగా ఉన్న పార్టీలకు ఇది గట్టి ప్రత్యర్థిగా నిలిచింది. నైతికంగా తన ఉన్నత స్థానాన్ని ప్రకటిస్తూ, పాత నాయకులు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించింది. ఎన్నికైతే స్వచ్ఛ మైన ప్రభుత్వాన్ని అందిస్తానని వాగ్దానం చేసింది. 2013 జూన్‌లో మూడవసారి ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నవాజ్ షరీఫ్ ఎప్పుడూ పూర్తి కాలంపాటు దేశాన్ని పాలించ లేకపోయారు. ప్రభుత్వం లోపలి ప్రభుత్వం, అంటే సైనిక వ్యవస్థ ప్రయోజనాలకు ఎంతో కాలం సేవచేయడని రావల్పిండిలోని సైనిక హెడ్ క్వార్టర్స్ నిర్ణయించుకున్న ప్రతిసారీ షరీఫ్ తన ప్రధాని పదవి కోల్పోయారు. ఇమ్రాన్ పార్టీ ఆయన్ని లక్ష్యంగా చేసుకున్న తర్వాత 2017 జూలైలో షరీఫ్ చివరిసారిగా బలవంతంగా అధికారం నుంచి నిష్క్రమించారు. వివిధ నేరాలకు పాల్పడ్డారని అభియోగాలు మోప బడి, అవమానకరమైన రీతిలో దేశం విడిచి వెళ్లడానికి ముందు నవాజ్ షరీఫ్ జైలు పాలయ్యారు. అనంతరం ఆయన సోదరుడు షెహబాజ్ షరీఫ్ ప్రధాని అయ్యారు. పెద్ద షరీఫ్ త్వరలో దేశానికి తిరిగి వస్తారనీ, ఎన్నికలు ఎప్పుడు జరిగినా తమ పార్టీ పీఎమ్ఎల్(ఎన్)ను అధికారంలోకి తేవడానికి నాయకత్వం వహిస్తారనీ షెహబాజ్‌కు తెలుసు. పాకిస్తాన్ రాజకీయ, ఆర్థిక, భద్రతకు సంబంధించిన అనేక సవాళ్లను ఇమ్రాన్ అరెస్టు ఉదంతం మరింతగా పెంచుతుంది. ప్రస్తుత జాతీయ అసెంబ్లీ తన ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకొని, ఆపద్ధర్మ ప్రభుత్వానికి పగ్గాలు అప్పగించడానికి మూడు రోజుల ముందు, ఆగస్టు 9న జాతీయ అసెంబ్లీ రద్దవుతుందని షెహబాజ్ షరీఫ్ గత వారం ప్రకటించారు (అనుకున్నట్టుగానే ఆగస్టు 9న రద్దయింది). ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధించేందుకే ప్రజాదరణ ఉన్న ఇమ్రాన్ అరెస్టును ప్లాన్ చేశారనీ, ఈ అంశంపై షరీఫ్, భుట్టో–జర్దారీ నేతృత్వంలోని రెండు ప్రధాన రాజకీయ పార్టీలు రావల్పిండి సైనిక నాయకత్వంతో కుమ్మక్కయ్యాయనీ విమర్శకులు అంటున్నారు. రాజకీయ దుమారాన్ని మరింతగా పెంచడానికి, షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా డిజిటల్‌గా ప్రారంభించిన జాతీయ జనాభా గణన ఫలితాన్ని ఆమోదించింది. తద్వారా అక్టోబర్, నవంబర్‌లో జరగాల్సిన ఎన్నికలను వాయిదా వేయవచ్చనే ఊహాగా నాలకు తెరలేచింది. పాకిస్తాన్ ప్రస్తుత ఆర్థిక ద్రవ్య స్థితి శుష్కించి ఉంది. దాతల సహాయాన్ని కోరుతున్నప్పుడు తరచుగా తిరస్కారానికి గురవు తున్నట్లు షెహబాజ్ షరీఫ్ అంగీకరించారు. ‘ఈరోజు మనం తలెత్తు కుని జీవించాలా లేక భిక్షాటన చేస్తూ బతకాలా అనేది నిర్ణయించు కోవాలి’ అని ఆయన అన్నారు. ‘భారతదేశం ముందుకు సాగింది, కానీ మన సొంత తప్పిదాల వల్ల మనం వెనుకబడిపోయాము’ అని కూడా అంగీకరించారు. దాయాది దేశం పట్ల ఇది అరుదైన దాపరికం లేని మాట అనే చెప్పాలి. పాకిస్తాన్ లోపాలు దాని డీఎన్ఏలో నిక్షిప్తమై ఉన్నాయి. వలస పాలన అనంతర ఎన్నో దేశాలు సమర్థవంతమైన పౌర పాలనకు పరివర్తన చెందడానికి అనుసరించిన సూత్రప్రాయ రాజకీయ ప్రక్రి యలను అణచివేయడంలో ఉన్నాయి. విచారకరంగా, పాక్ సైన్యం, కశ్మీర్‌ను తన శాశ్వత బోగీగా ఉపయోగించుకుని, రాజ్యాధికారం, ఆర్థిక ప్రాధాన్యతలకు చెందిన చాలా ముఖ్యమైన మీటలను ఏకీకృతం చేసుకుంది. అటువంటి ఆధిపత్య ప్రదర్శనకు సైన్యాన్ని అనుమతించడం వల్ల ప్రభుత్వంపై పడే ఖర్చు గురించి పాకిస్తాన్ పౌర సమాజంలోని కొన్ని వర్గాలు జాతిని హెచ్చరించాయి కానీ అవి ఫలించలేదు. ఈ ప్రాణాంతకమైన వ్రణం జనరల్ జియా–ఉల్–హక్ పాలనలో సమ్మిళితం అయింది. ఇది ప్రభుత్వం, సమాజం స్థిరంగా ఇస్లామీకర ణకు గురవడానికి నాంది పలికింది. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో ప్రాంతీయ భౌగోళిక రాజకీయ పరిణామాలు (1979లో అఫ్గానిస్తా న్పై సోవియట్ దండయాత్ర వంటివి) అంతర్జాతీయ పర్యవసానా లకు దారి తీశాయి. ఈ కారణాలన్నీ పాక్‌కు భద్రతా సవాలును మరింత తీవ్రతరం చేశాయి. ఖైబర్–పఖ్తూన్ఖ్వా రాష్ట్రంలోని బాజౌర్ జిల్లాలో ఇటీవల జరిగిన ఉగ్రదాడి, 60 మందికిపైగా మరణానికి కార ణమైంది. ఈ చర్యకు కారణం తామేనని ఇస్లామిక్ స్టేట్ (ఖురా సాన్) ప్రకటించింది. అంతర్గత భద్రతా పరిస్థితికి ఇది విషాద సాక్ష్యం. యూఎస్ డాలర్‌తో పోలిస్తే పాకిస్తాన్ రూపాయి 282 రూపా యల కంటే తక్కువగా ఉండటంతో ఆర్థిక అవకాశాలు వట్టిపోతు న్నాయి. ఇమ్రాన్ అరెస్టు అనేది తాత్కాలిక ప్రభుత్వం పరిష్కరించాల్సిన సంక్లిష్టమైన అనేక పెను సవాళ్లకు చెందిన మురికి మంచు కొండ కొస మాత్రమే. ఎప్పటిలాగే రావల్పిండి సైనిక నాయకత్వం మోసపోయిన పాకిస్తానీ ప్రజల అదృష్టాన్ని నిర్ణయిస్తుంది. సి. ఉదయ్ భాస్కర్ వ్యాసకర్త, సొసైటీ ఫర్ పాలసీ స్టడీస్ డైరెక్టర్ (‘ది ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
బాబు అక్రమాస్తుల కేసులో తీర్పు వాయిదా
సాక్షి, హైదరాబాద్: మాజీ సీఎం చంద్రబాబు అక్రమాస్తులపై ఏసీబీ విచారణకు ఆదేశించాలని ఏపీ తెలుగు అకాడమీ అధ్యక్షురాలు లక్ష్మీపార్వతి దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పు నవంబర్ 24కు వాయిదాపడింది. సీఎంగా ఉన్న సమయంలో భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టారని, ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన నేపథ్యంలో ఏసీబీ విచారణకు ఆదేశించాలని లక్ష్మీపార్వతి 2005లో ఏసీబీ కోర్టులో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ నిలిపి వేయాలంటూ బాబు హైకోర్టును ఆశ్రయించి మధ్యంతర ఉత్తర్వులు పొందారు. -
చంద్రబాబుని జైలుకి పంపేవరకూ పోరాడతా..
సాక్షి, నెల్లూరు: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును జైలుకు పంపేవరకూ తాను వదిలేది లేదని ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి వ్యాఖ్యానించారు. చంద్రబాబు అక్రమ ఆస్తుల కేసుపై ఆమె శుక్రవారమిక్కడ మాట్లాడుతూ.. ‘న్యాయ వ్యవస్థను ప్రక్షాళన చేయాలి. ఏసీబీ కోర్టులో న్యాయం జరక్కపోతే హైకోర్టుకు వెళతాను. అక్కడ కూడా న్యాయం దక్కకుంటే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తా. కేసు విత్‌డ్రా చేసుకోమని గతంలో చంద్రబాబు నాకు ఫోన్ చేసి ఒత్తిడి చేశారు’ అని తెలిపారు. చంద్రబాబు అక్రమాస్తుల కేసు విచారణ 21కి వాయిదా సాక్షి, హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అక్రమాస్తుల కేసు విచారణ ఈ నెల 21కి వాయిదా పడింది. చంద్రబాబుపై తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీపార్వతి వేసిన పిటిషన్‌పై హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. చంద్రబాబు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని, ఆయన ఆస్తులపై సమగ్ర విచారణ జరిపించాలని లక్ష్మీ పార్వతి పిటిషన్లో పేర్కొన్నారు. ఆయనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయాలని కోరారు. చంద్రబాబుపై స్టే వేకెట్ అయిన వివరాలను ఆమె స్వయంగా కోర్టుకు సమర్పించారు. 1978 నుంచి 2005 వరకు బాబు ఆస్తుల వివరాలను ఆమె కోర్టు ముందుంచారు. కాగా 2004 ఎన్నికల అఫిడవిట్లో చంద్రబాబు చూపిన ఆస్తులుపై లక్ష్మీపార్వతి ఏసీబీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. 1987 నుండి 2005 వరకు చంద్రబాబు అక్రమంగా తన వ్యక్తి గత ఆస్తులను పెంచుకున్నారంటూ ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏసీబీ కేసు కొనసాగుతున్న నేపథ్యంలో 2005లో హైకోర్టు నుండి చంద్రబాబు స్టే తెచ్చుకున్నారు. అయితే ఇటీవలే ఆ స్టే వెకేట్ అయింది. అలాగే నేతల కేసుల విచారణలో భాగంగా చంద్రబాబు అక్రమాస్తుల కేసు మళ్లీ తెరమీదకు వచ్చింది. ప్రజా ప్రతినిధుల కేసుల విచారణలో భాగంగా దర్యాప్తు ముమ్మరం కానుంది. -
మేరే పీచే బాస్ హై!
సాక్షి, హైదరాబాద్: భూ దందాలకు పాల్పడుతున్న అవినీతి అనకొండలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు, మెదక్ మాజీ అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేశ్ తరువాత ఏసీబీ చేతికి మరో అవినీతి తిమింగలం దొరికింది. విధినిర్వహణలో అనేక అక్రమాలకు పాల్పడ్డారని, అలా సంపాదించిన డబ్బుతో రెండు తెలుగు రాష్ట్రా ల్లో భారీగా ఆస్తులు కూడబెట్టారన్న ఫిర్యాదులతో కేసు నమోదు చేసిన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మల్కాజిగిరి ఏసీ పీ నరసింహారెడ్డిపై బుధవారం దాడులు చేశా రు. తెలంగాణ, ఏపీల్లోని 25 ప్రాంతాల్లో ఏసీ బీ ప్రత్యేక బృందాలు ఏకకాలంలో దాడులు చేసి నరసింహారెడ్డి భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించాయి. వీటి విలువ బహిరంగ మార్కెట్లో రూ.100 కోట్లకు పైగా ఉంటుంద ని సమాచారం. రెండు రాష్ట్రాల్లో 25 ప్రాంతాల్లో... 25కు పైగా ప్రత్యేక బృందాలు ఏకకాలంలో నరసింహారెడ్డి, ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో దాడులు చేయడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. బుధవారం ఉదయం సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్‌లోని ఏసీపీ సరసింహరెడ్డి నివాసంలో హైదరాబాద్ రేంజ్ డీఎస్పీ సత్యనారాయణ ఆధ్వర్యంలో సోదాలు జరిగాయి. భారీగా బంగారు, వెండి ఆభరణాలు, కొన్ని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఉప్పల్‌లో ఉన్న ఏసీపీ కార్యాలయంలో జరిగిన సోదాల్లో కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. బుధవారం రాత్రి ఏసీపీ నరసింహారెడ్డిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఎక్కడెక్కడ సోదాలు జరిగాయంటే..! ఏసీపీ స్థాయి అధికారి కోసం 25 కంటే ఎక్కువ బృందాలు రంగంలో దిగడం ఈ కేసుపై ఏసీబీ ఏస్థాయిలో దృష్టి పెట్టిందో తెలుపు తోంది. నరసింహారెడ్డి అవినీతి విస్తరణకు అద్దం పడుతోంది. బుధవారం ఉదయం హైదరాబాద్, సికింద్రాబాద్‌లతోపాటు జన గామ జిల్లాలోని లింగాలఘణపురం మండ లం వడిచర్లలో, బచ్చన్నపేట, రఘునాధపల్లి మండలాలతో పాటు, జగిత్యాల జిల్లా గంగాధర, నల్లగొండ జిల్లా, ఏపీలోని అనంతపురం జిల్లాలో కలిపి మొత్తం 25 ప్రాంతాల్లో దాడు లు జరిగాయి. నర్సింహారెడ్డి అత్తగారి ఊరైన జనగామ జిల్లా లింగాలఘణపురం మండలంలోని వడిచర్లలో బుధవారం ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఆ సమయంలో ఏసీపీ మామ మోతె నర్సింహారెడ్డి అక్కడే ఉన్నారు. కుర్చపల్లి గ్రామంలోని పోరెడ్డి తిరుపతిరెడ్డి అనే బంధువు ఇంట్లోనూ ఏసీబీ అధికారులు సోదా చేశారు. అలాగే కొన్నె గ్రామం వద్ద సాగు భూమిని పరిశీలించారు. ఈ భూమిని బినామీ పేరిట ఏసీపీ కొన్నారని సమాచారం. మియాపూర్, బేగంపేట్, ఉప్పల్‌లో సర్కిల్ ఇన్స్పెక్టర్గా.. చిక్కడపల్లి, మల్కాజిగిరి ఏసీపీగా పనిచేసిన నర్సింహారెడ్డి నగర శివారు ప్రాంతాలైన మియాపూర్, ఉప్పల్, మల్కాజిగిరిల్లో భూవివాదాల్లో తలదూర్చినట్లు ఆరోపణలు వచ్చాయి. అసైన్డ్ భూముల వివాదాలే కారణమా? పలు భూవివాదాల్లో తలదూర్చేవాడన్న ఆరోపణలున్న ఏసీపీని చివరికి అవే వివాదాలు ఏసీబీకి పట్టించాయని సమాచారం. హైదరాబాద్‌లో బాగా పేరు ప్రఖ్యాతలు ఉన్న ఓ ప్ర జాప్రతినిధి బినామీలతో ఏసీపీకి సంబంధా లు ఉన్నాయన్న ప్రచారం కలకలం రేపుతోంది. కొండాపూర్‌లోని అసైన్డ్ భూమిని నరసింహారెడ్డి కొనుగోలు చేశాడని, ఈ విషయాన్ని ఏసీబీ అధికారులు ఎదుట ఆయనే అంగీకరిం చారని సమాచారం. ఈ భూమిని మధుకర్ అనే వ్యక్తి ద్వారా కొనుగోలు చేసినట్లు ఏసీబీ అధికారులకు ఏసీపీ నరసింహారెడ్డి వెల్లడించారని తెలిసింది. జగిత్యాల జిల్లా గంగాధరకు చెందిన ఎంపీపీ మధుకర్ ఇంట్లోనూ ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఏసీబీ అధికారులను చూసి మధుకర్ పారిపోయినట్లు తెలిసింది. అసలు ఈ వివాదమే.. వ్యవహారాన్ని ఏసీబీ వరకు తీసుకెళ్లినట్లు సమాచారం. వీటితోపాటు ఘటకేసర్ సమీ పంలోని యమ్నంపేట్లో 30 ఎకరాల వివాదాస్పద భూమిని కొనుగోలు చేసినట్లు ఆరోపణలూ ఉన్నాయి. నిజాం కాలం నాటి ఈ భూమిని రాజకీయ నేతలతో కలిసి కొన్నార ని ఏసీబీ వద్ద సమాచారం ఉంది. మధుకర్ కోసం ఏసీబీ అధికారులు గాలిస్తున్నారు. మధుకర్ ఆచూకీ దొరికితే.. అతని వెనక ఉన్న ఆ బడా రాజకీయ నేత లెవరు? ఇంతవరకూ వీరు కొనుగోలు చేసిన అసైన్డ్ భూవ్యవహారాలపై స్పష్టత వస్తుందని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఏసీబీ గుర్తించిన ఆస్తులివే..! అనంతపురంలో 55 ఎకరాల వ్యవసాయభూమి, మాదాపూర్‌లోని సైబర్‌టవర్ ఎదుట 1,960 చదరపు గజాల నాలుగు ప్లాట్లు, హఫీజ్‌పేటలో మూడం తస్తుల భవనం, రెండు ఓపెన్ ప్లాట్లు, మరో రెండు ఇళ్లను గుర్తించారు. బ్యాంకు ఖాతాల్లో రూ.15 లక్షల నగదు, రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో పెట్టబడులు పెట్టినట్లు సోదాల్లో అధికారులకు ఆధారాలు లభించాయి. రెండు బ్యాంకు లాకర్లను కూడా గుర్తించారు. ఈ ఆస్తుల విలువ రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం.. రూ.7.5 కోట్లు ఉంటుందని, అయితే బహిరంగ మార్కెట్లో వీటి విలువ రూ.100 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం. ఆయా ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు సోదాలు జరుగుతూనే ఉండటం గమనార్హం. మేరే పీచే బాస్ హై! సాక్షి, హైదరాదాబాద్: ‘నా మీద ఎన్ని ఆరోణలు వచ్చినా.. నాకేం కాదు. నా వెనక డీజీపీ ఉన్నారు.. ఆయనే నాకు గాడ్‌ఫాదర్’ అంటూ ఏసీపీ వై.నరసింహారెడ్డి పలువురి వద్ద గొప్పలకు పోయినట్లు తెలిసింది. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈ విషయం తెలుసుకున్న పోలీస్ బాస్ దీన్ని తీవ్రంగా పరిగణించారు. వెంటనే రహస్యంగా అంతర్గత విచారణ జరిపించారు. వరుసగా వచ్చిన ఫిర్యాదులతో నెలరోజుల ముందే నరసింహారెడ్డి ఏసీపీ ఉన్నతాధికారుల నిఘాలోకి వెళ్లాడని సమాచారం. వాస్తవానికి వనస్థలిపురం ఏసీపీ జయరాం సస్పెండ్ అయినప్పటి నుంచే ఏసీపీ నరసింహారెడ్డి వ్యవహారాలపై ఉన్నతాధికారులు దృష్టి సారించినట్లు తెలిసింది. అప్పటి నుంచే పక్కాగా విచారణ చేసిన ఏసీబీ అదును చూసి దాడులు చేసింది. ఉప్పల్ ఠాణాలో పనిచేసిన సమయంలో ఎస్సై లింగంపై ఎన్ని ఆరోపణలు వచ్చినా నరసింహారెడ్డి అతన్ని రక్షించే ప్రయత్నం చేశాడన్న విమర్శలున్నాయి. ప్రస్తుతం సూర్యాపేట జిల్లాలో ఉన్న సదరు ఎస్సై లింగం భూవివాదంలో తలదూర్చడంతో హెచ్చార్సీలో కేసు నమోదవడం గమనార్హం. బినామీగా బార్ ఓనర్! ఏసీపీ నరసింహారెడ్డికి నగరంలోని అశోక్‌పాటిల్ అనే ఓ బార్ యజమానితో సాన్నిహిత్యం ఉందని, అతనే బినామీగా వ్యవహరిస్తున్నాడని సమాచారం. ఏసీపీ అక్రమ సంపాదనను అతడే మేనేజ్ చేసేవాడని సమాచారం. పోలీసుశాఖలో పని చేసే ఓ ఉన్నతాధికారికి నగరంలో కోట్ల రూపాయల విలువైన బంగళాను ఏసీపీ కానుకగా ఇచ్చాడని ప్రచారం జరుగుతోంది. ఈ బంగళాను బినామీ అశోక్‌పాటిల్ ద్వారా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఘట్కేసర్ తహసీల్దార్ ఓ కేసు విషయంలో చేసిన ఫిర్యాదు ఆధారంగా ఏసీపీని ఉన్నతాధికారులు మందలించారని సమాచారం. -
‘చంద్రబాబు అక్రమాస్తుల’ కేసు 26కు వాయిదా
సాక్షి, హైదరాబాద్: టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టడంపై అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) దర్యాప్తునకు ఆదేశాలివ్వాలని కోరుతూ వైఎస్సార్సీపీ నాయకురాలు, ఎన్టీఆర్ సతీమణి నందమూరి లక్ష్మీపార్వతి చేసిన ఫిర్యాదుపై ఏసీబీ కోర్టు విచారణ ఈ నెల 26కు వాయిదా పడింది. ఫిర్యాదు దశ లో చంద్రబాబు తరఫు వాదనలు వినరాదని లక్ష్మీపార్వతి తరఫు న్యాయవాది గతంలో చేసిన వినతిని కోర్టు ఆమోదించింది. ఫిర్యాదుపై 26న తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని శుక్రవారం జడ్జి తెలిపారు. చంద్రబాబు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టడంపై 2005లో లక్ష్మీపార్వతి ఫిర్యాదు చేశారు. అప్పట్లో టీడీపీ అధినేత హైకోర్టు నుంచి స్టే ఉత్తర్వులు పొంది ఈ ఫిర్యాదుపై విచారణ జరగకుండా అడ్డుకుంటూ వచ్చారు. అయితే సుప్రీంకోర్టు గతేడాది జారీ చేసిన మార్గదర్శకాల్లో మధ్యంతర స్టే ఉత్తర్వుల గడువు ఆరు నెలలేనని తేల్చిచెప్పింది. తిరిగి స్టే ఆదేశాలు కొనసాగింపు ఉత్తర్వులు లేకపోతే గతంలోనే స్టే రద్దయినట్లేనని పేర్కొంది. దీనికనుగుణంగా తన ఫిర్యా దుపై ఏసీబీ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ లక్ష్మీపార్వతి ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. హైకోర్టు జారీ చేసిన స్టే ఉత్తర్వులను తెప్పించుకుని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని ఏసీబీ కోర్టు గత విచారణలో చెప్పింది. దీనిపై లక్ష్మీపా ర్వతి తరఫు న్యాయవాది జోక్యం చేసుకుని.. హైకోర్టు స్టే తర్వాత సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయని, వాటినీ పరిశీలించాకే ఫిర్యాదుపై నిర్ణయాన్ని వెల్లడించాలని కోరారు. దీంతో ఎలాంటి వాదనలు లేకుండానే ఈ నెల 26కు వాయిదా పడింది. -
ఏసీబీ వలలో పంచాయతీరాజ్ ఏఈఈ
సాక్షి, అమరావతి/అనంతపురం సెంట్రల్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అనంతపురం పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కొండసాని సురేష్ రెడ్డి ఏసీబీ అధికారులకు చిక్కారు. మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి పీఏగా, అనుచరుడిగా సుపరిచితుడైన సురేష్ రెడ్డి ఇంటిపై శుక్రవారం కర్నూలు ఏసీబీ డీఎస్పీ నాగభూషణం ఆధ్వర్యంలో ఏకకాలంలో దాడులు చేశారు. రాంనగర్లో ఆయన నివాసంతో పాటు పుట్టపర్తిలో రెండు చోట్ల, కర్నూలు జిల్లా బేతంచర్లలోని అత్తారింట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. పుట్టపర్తిలో సాయి సంస్కృతి ఎడ్యుకేషన్ ట్రస్టు స్థాపించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో.. అతని భాగస్వామి విజయభాస్కర్‌రెడ్డి ఇంట్లో కూడా తనిఖీలు చేశారు. మొత్తం రూ.4.17 కోట్ల విలువైన ఆస్తులను కనుగొన్నామని ఏసీబీ డీజీ కుమార విశ్వజిత్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇవీ అక్రమాస్తుల చిట్టా.. ఏసీబీ బయటపెట్టిన సురేష్ రెడ్డి అక్రమాస్తుల విలువ బహిరంగ మార్కెట్లో రూ. 100 కోట్లకు పైగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. 2018లో పుట్టపర్తిలో ఎకరం ఖాళీ స్థలాన్ని, పుట్టపర్తి మండలం ఎనుములపల్లిలో 1.63 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసినట్లు ఏసీబీ డీజీ వెల్లడించారు. తనిఖీల్లో 332.4 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.1.98 లక్షల విలువైన వస్తువులు, రూ.4.13 లక్షల నగదు గుర్తించారు. ఇన్నోవా, ఆల్టో కారు ఉన్నట్లు తెలిపారు బినామీ పేర్లతో ఆస్తులు కూడబెట్టి ఉండవచ్చనే కోణంలో విచారిస్తున్నారు. ఎవరీ సురేష్ రెడ్డి ? 1991లో పంచాయతీరాజ్ శాఖలో ఉద్యోగిగా అడుగుపెట్టి.. 2004లో ఆ శాఖ మంత్రిగా ఉన్న జేసీ దివాకర్‌రెడ్డి పీఏగా వెళ్లారు. 2009లో జేసీ అండతో పుట్టపర్తి టికెట్ తనకే అనే ప్రచారం కూడా చేసుకుని.. పంచాయతీరాజ్ విభాగంలో ఏఈఈ ఉద్యోగానికి రాజీనామా చేశారు. టికెట్ రాకపోవడంతో తన పలుకుబడితో మళ్లీ ఉద్యోగం సంపాదించుకున్నారు. సెటిల్మెంట్లకు పాల్పడుతూ రూ.కోట్లు సంపాదించారనే ఆరోపణలున్నాయి. -
అవినీతిలో ‘సీనియర్’
ఏఎన్‌యూ, కాజ (మంగళగిరి)/సాక్షి, అమరావతి: ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) అధికారులు మరో అవినీతి తిమింగలాన్ని పట్టుకున్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ఏఎన్‌యూ) అకౌంట్స్ విభాగంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న జవ్వాది శ్రీనివాసరావుపై ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు కలిగి ఉన్నాడనే ఆరోపణల నేపథ్యంలో శుక్రవారం అతని కార్యాలయం, నివాసం, బంధువుల ఇళ్లలో ఏకకాలంలో 8 బృందాలు సోదాలు నిర్వహించాయి. బహిరంగ మార్కెట్లో రూ. 30 కోట్ల విలువైన అక్రమ ఆస్తులను గుర్తించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన వివరాలను ఏసీబీ డీజీ కుమార్ విశ్వజిత్ శుక్రవారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. కాజ, ఆరేపల్లి ముప్పాళ్ల, అన్నవరం, నాగార్జున యూనివర్సిటీ, గుంటూరు, నర్సరావుపేట, అమరావతి పట్టణాల్లో తనిఖీలు చేశారు. శ్రీనివాసరావు పేరుతో జీ ప్లస్ 2, జీ ప్లస్ 1 భవనాలు, పలు అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు, ఏడు ఇళ్ల స్థలాలు, 7.56 ఎకరాల వ్యవసాయ భూమి, ఆయన భార్య సుజాత పేరుతో రెండు భవనాలు, 5.94 ఎకరాల వ్యవసాయ భూమి, కుమారుడు వెంకటకృష్ణ పేరుతో ఆరు ఇళ్ల స్థలాలు, 5.19 ఎకరాల వ్యవసాయ భూమి, కుమార్తె నందిని పేరుతో రెండు ఇళ్ల స్థలాలు, 6.90 ఎకరాల వ్యవసాయ భూమి, కోడలు మానస పేరుతో ఇంటి స్థలం గుర్తించారు. సోదాల్లో రూ. 29 లక్షల నగదు, రూ. 26.23 లక్షల బ్యాంకు నిల్వ, రూ. 12 లక్షల విలువైన బంగారం ఆభరణాలు, రూ. 47,600 విలువైన వెండి ఆభరణాలు, రూ. 4.50 లక్షల విలువైన సామగ్రి, రూ. 3.65 లక్షల ప్రామిసరీ నోట్లు దొరికాయి. ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువ రూ. 3.50 కోట్లు ఉంటుందని ఏసీబీ డీజీ విశ్వజిత్ తెలిపారు. అయితే బహిరంగ మార్కెట్లో ఆస్తుల విలువ రూ. 30 కోట్లకుపైగా ఉండవచ్చని తెలిసింది. తనిఖీలు నిర్వహించిన అనంతరం శ్రీనివాసరావును అరెస్ట్ చేసి గుంటూరు ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఏసీబీ వలలో రెండోసారి.. ప్రస్తుతం సీనియర్ అసిస్టెంట్‌గా ఉన్న శ్రీనివాసరావు ఏసీబీ కేసులో ఇరుక్కోవడం ఇది రెండోసారి. 14 ఏళ్ల కిందట అతను యూనివర్సిటీలో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడి సస్పెండ్ అయ్యాడు. అయినా తన తీరు మార్చుకోలేదు. టీడీపీ హయాంలో మాజీ శాసన సభాపతి కోడెల శివప్రసాద్ అండతో అతను అక్రమాస్తులు కూడబెట్టారని స్థానికులు చెబుతున్నారు. విశ్రాంత ఉద్యోగి ఇంటిపై ఏసీబీ సోదాలు వర్సిటీలో విధులు నిర్వహించి పదవీ విరమణ చేసిన ఎం.మల్లేశ్వరరావు అనే ఉద్యోగి నివాసంలోనూ ఏసీబీ దాడులు చేసినట్లు సమాచారం. గుంటూరులోని జేకేసీ కళాశాల ప్రాంతంలో ఉన్న ఇతని నివాసంలో శుక్రవారం మూడు గంటలకుపైగా తనిఖీలు నిర్వహించారు. పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. గతంలో ఏసీబీ కేసులో సస్పెండ్ అయిన శ్రీనివాసరావు తిరిగి విధుల్లో చేరేందుకు మల్లేశ్వరరావు సహకరించారని సమాచారం. దీంతో వీళ్లిద్దరి మధ్య సంబంధాలపై అధికారులు విచారిస్తున్నారు. -
అవినీతిలో 'సూపర్'టెండెంట్
సాక్షి, హైదరాబాద్/నిజామాబాద్: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ జ్యోతికిరణ్‌ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఏసీబీ డీఎస్పీ అశోక్‌కుమార్ నేతృత్వంలోని అధికారుల బృందం నిజామాబాద్ సుభాష్‌నగర్‌లోని ఇంట్లో సోదాలు నిర్వహించిన అనంతరం ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో జ్యోతికిరణ్‌ను అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తరలించారు. హైదరాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా పనిచేసిన జ్యోతికిరణ్ రెండు నెలల క్రితమే నిజామాబాద్ జిల్లాకు బదిలీపై వచ్చారు. హైదరాబాద్‌లో పనిచేస్తుండగా పెద్ద ఎత్తున అక్రమార్జనకు పాల్పడినట్లు ఫిర్యాదులు అందడటంతో ఏసీబీ అధికారులు ఆయనపై ఆదాయానికి మించి ఆస్తుల కేసును నమోదు చేశారు. ఈ మేరకు న్యాయస్థానం నుంచి సెర్చ్ వారెంట్ తీసుకున్న ఏసీబీ అధికారులు నిజామాబాద్‌తో పాటు, హైదరాబాద్ బాగ్ అంబర్‌పేటలో ఆయన నివాసాల్లో ఏకకాలంలో సోదాలు చేశారు. అలాగే ఆయన సన్నిహితులైన ముగ్గురు వ్యక్తుల ఇళ్లల్లోనూ, నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలోనూ సోదాలు కొనసాగాయి. మార్కెట్ విలువ రూ.4 కోట్లకుపైనే.. జ్యోతికిరణ్ నివాసంతో పాటు పలు ప్రాంతాల్లో దాడులు చేసి ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు, నగదు, నగలు, ఇతరత్రా వాటిని స్వాధీనం చేసుకున్నట్టు ఏసీబీ డీజీ పూర్ణచందర్రావు తెలిపారు. ఈ మొత్తం ఆస్తుల విలువ రూ.1.30 కోట్లు కాగా, మార్కెట్ విలువ ప్రకారం రూ.4 కోట్లకుపైగా ఉంటుందని ఏసీబీ డీజీ తెలిపారు. దాడుల తర్వాత జ్యోతికిరణ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్టు చెప్పారు. ఏసీబీ గుర్తించిన ఆస్తులివీ.. ► జహీరాబాద్‌లోని న్యాకల్ మండలంలో రూ.18.7 లక్షల విలువైన 30 ఎకరాల వ్యవసాయ భూమి. ∙హైదరాబాద్ బాగ్ అంబర్‌పేట్‌లో రూ.30.60 లక్షల విలువైన ఇళ్లు. ∙నల్లకుంటలోని సింగ్మేకర్ అపార్ట్మెంట్ రూ.14 లక్షల విలువైన ఫ్లాట్ ► ఘట్కేసర్లో రూ.2.14 లక్షల విలువైన రెండు ప్లాట్లు ∙హయత్‌నగర్ తుర్కయాంజల్‌లో రూ.1.60 లక్షల విలువైన ఒక ప్లాట్. ∙బీబీనగర్, పోచంపల్లి దేశ్‌ముఖ్‌లో రూ.13.30 లక్షల విలువైన 11 ఓపెన్ ప్లాట్లు. ► భూదాన్ పోచంపల్లిలోని దుర్గా ఎస్టేట్‌లో రూ.1.20 లక్షల విలువైన రెండు ప్లాట్లు ∙రూ.13.91 లక్షల విలువ గల బంగారు అభరణాలు.. ► బ్యాంక్ ఖాతాలో రూ.10.13 లక్షల నగదు ► రూ.9.65 లక్షల విలువైన ఇన్సూరెన్స్ పాలసీలు ► రూ.8.41 లక్షల విలువ గల మారుతీ స్విఫ్ట్ డిజైర్ కారు. ► రూ.1.20 లక్షల విలువైన రెండు ద్విచక్ర వాహనాలు ► రూ.5 లక్షల విలువున్న పురాతనమైన అలంకార వస్తువులు -
జయలలిత చెప్పినవన్నీ అబద్ధాలే
తన పెంపుడు కొడుకు సుధాకరన్ పెళ్లి విషయంలో జయలలిత చెబుతున్నవన్నీ పచ్చి అబద్ధాలేనని సీబీఐ ప్రత్యేక కోర్టు స్పష్టం చేసింది. విచారణ సందర్భంగా జడ్జి ఈ వ్యాఖ్యలు చేశారు. జయలలిత అక్రమంగా భారీ మొత్తంలో డబ్బు సమకూర్చుకున్నారని, ఆమె పదవిలో ఉన్నప్పుడే ఇదంతా చేశారని న్యాయమూర్తి అన్నారు. దాదాపు 53 కోట్ల రూపాయల సంపద వెనకేసుకున్నా, ఆ సొమ్ము ఎలా వచ్చిందో మాత్రం వివరించలేకపోయారన్నారు. 1995లో చెన్నైలో జరిగిన సుధాకరన్ పెళ్లికి దాదాపు 40 వేల మంది అతిథులు వచ్చారు. వాళ్లందరికీ హోటళ్లలో బస ఏర్పాటుచేశారు. శుభలేఖల ప్రింటింగ్, కృతజ్ఞతా పూర్వక పత్రాలు, తాంబూలం, అతిథులకు విలువైన బహుమతులు.. వీటన్నింటికీ మూడు కోట్ల రూపాయలకు పైగా ఖర్చుపెట్టారని, అతి తక్కువ ఖరీదు వేసుకున్నా కూడా ఈ మొత్తం వస్తోందని జడ్జి జాన్ మైఖేల్ డికున్హా అన్నారు. వీఐపీలు బసచేసిన హోటల్ బిల్లులన్నింటినీ జయలలితే చెల్లించారని అనడానికి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని ఆయన చెప్పారు. అయితే ఈ ఖర్చులను పెళ్లికూతురు కుటుంబం భరించినట్లు ఆమె చెప్పడం పూర్తిగా తప్పని, అవన్నీ అబద్ధాలేనని వ్యాఖ్యానించారు. -
జయలలిత జీవిత కథతో అమ్మ
అక్రమ ఆస్తుల కేసులో దోషిగా జైలు జీవితం అనుభవిస్తున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ వెండితెరకెక్కుతోంది. నటిగా చలన చిత్ర పరిశ్రమలోను, ముఖ్యమంత్రిగా రాజకీయాల్లోనూ విప్లవ నాయకురాలిగా చరిత్ర సృష్టించిన జయలలిత జీవితం సంచలనాల మయం. ఆమె జీవిత చరిత్ర ఆధారంగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ‘అమ్మ’ పేరుతో ఓ చిత్రం రూపొందుతోంది. జయలలితగా ప్రముఖ కన్నడ నటి రాగిణీ ద్వివేది నటిస్తున్నారు. ఇప్పటి వరకు తమిళ, కన్నడ, మలయాళం చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ తొలిసారిగా హిందీ, తెలుగు భాషలకు ఈ చిత్రం ద్వారా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి ఫైజల్ సైఫ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పలు సన్నివేశాలను ముంబయ్, బెంగళూరుల్లో చిత్రీకరించారు. కాగా, చిత్రంలో జయలలిత అరెస్టు అయ్యి జైలుకెళ్లే సన్నివేశాలు కూడా చోటు చేసుకుంటాయని దర్శకుడు అంటున్నారు. కన్నడ చిత్ర పరిశ్రమలో ప్రముఖ దర్శకుడిగా పేరొందిన ఈయన ఇటీవల ‘మై హూ రజనీకాంత్’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం తన ఇమేజ్‌కు భంగం కలిగించేదిగా ఉందంటూ సూపర్‌స్టార్ రజనీకాంత్ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఆ చిత్రం విడుదలపై హైకోర్టు తాత్కాలిక స్టే విధించింది. ఇప్పుడు జయలలిత జీవిత చరిత్రతో సినిమా తీస్తున్నారు కాబట్టి... కచ్చితంగా వివాదాలు ఎదురవుతాయన్నది పలువురి ఊహ.