సాక్షి, హైదరాబాద్: ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌లో (సీసీఎస్) ఏసీపీగా పని చేస్తున్న టీఎస్ ఉమామహేశ్వరరావును ఏసీబీ అరెస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో ఆయన బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. న్యాయం కోసం వెళ్లిన వారిని ఆయన తీవ్ర ఇబ్బందులకు గురిచేసినట్టు అధికారులు గుర్తించారు.
ఇక, ఏసీపీ ఉమా మహేశ్వరరావు వ్యవహారశైలిపై కూడా గతంలోనే ఫిర్యాదులు వచ్చాయి. అతనిపై ఇప్పటికే మూడుసార్లు సస్పెన్షన్ వేటుగా పడింది. అయినా కూడా ఆయన తన తీరు మార్చుకోలేదు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని సివిల్ కేసులను క్రిమినల్ కేసులుగా మార్చి లక్షల రూపాయలను కాజేశారు.
సీసీఎస్‌లో బాధితులకు న్యాయం చేయాల్సిన హోదాలో ఉంటూ వారితోనే బేరసారాలాడారు. కాగా, ఓ ఎన్నారై ఫిర్యాదు చేయడానికి రావడంతో అతడిని సైతం బెదిరించి డబ్బులు దండుకున్నట్టు అధికారులు గుర్తించారు. ఇక, తోటి సిబ్బందిని బూతులు తిడుతూ, అవహేళన, వారిపై అసహనం వ్యక్తం చేసిన సందర్భాలు చాలానే పోలీసులు చెబుతున్నారు. తన దగ్గరికి వచ్చిన ప్రతీ కేసులోనూ ఉమా మహేశ్వర రావు చేతివాటం చూపించినట్టు సమాచారం.
ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆయన, ఆయన బంధువుల నివాసాలపై మంగళవారం దాడులు చేశారు. తెలంగాణ, ఏపీలోని ఉమామహేశ్వరావు ఇళ్లు, ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లతో సహా మొత్తం 11 చోట్ల సోదాలు నిర్వహించారు. తనిఖీల్లో నగదు, బంగారం, ఆస్తి పత్రాలతో పాటు రెండు బ్యాంకు లాకర్లను గుర్తించినట్లు తెలిసింది.
అక్రమ ఆస్తుల కూడబెట్టుకుని నగర శివారులో విలాసవంతమైన విల్లాలు కొనుగోలు చేశారు. శామీర్‌పేటలో విల్లా, ఘట్‌కేసర్‌లో ఐడు ప్లాట్స్ కొనుగోలు చేశారు. అంతేకాకుండా తన ఇంట్లో నగదు ఉంచకుండా.. తన అత్తామామల ఇంట్లోనే డబ్బును దాచిపెట్టారు. లావాదేవీల మొత్తం సమాచారాన్ని ఆయన ట్యాబ్‌లో స్టోర్ చేసుకున్నారు. ఇక, ఉమా మహేశ్వరరావు ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్‌లో 50కోట్లకు వరకు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇక, తెలుగు రాష్ట్రాల్లో 17చోట్ల ఆస్తులను గుర్తించారు. సోదాల్లో భాగంగా ఇప్పటి వరకు రూ.38లక్షల నగదు, 60 తులాల బంగారం సీజ్. కాగా, కాసేపట్లో ఉమా మహేశ్వర్‌ను అధికారులు ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment