అల్లర్ల కేసుల్లో నిందితులపై చర్యలు నిల్
చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న పోలీసులు
తాడిపత్రిటౌన్: చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అయితే తాడిపత్రిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. చట్టం.. జేసీకి చుట్టం అన్న రీతిలో వ్యవహరిస్తోంది. కళ్లెదుటే నిందితులు కనిపిస్తున్నా పోలీసులు అరెస్టు చేయకుండా వదిలేయడం విమర్శలకు తావిస్తోంది. అసలు విషయానికి వస్తే... సార్వత్రిక ఎన్నికల అనంతరం తాడిపత్రిలో రెండు రోజుల పాటు ఇరువర్గాల గొడవలు, అల్లర్ల ఘటనలకు సంబంధించి పోలీసులు ఏడు కేసుల్లో దాదాపు 520 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
ఇందులో 163 మందిని (టీడీపీకి చెందిన వారు 81 మంది, వైఎస్సార్‌సీపీకి చెందిన వారు 82 మంది) అరెస్టు చేశారు. ఆ సమయంలో మిగిలిన నిందితుల కోసం పట్టణంతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా పోలీసులు జల్లెడ పట్టడంతో ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు గ్రామాలు వదిలి బయటప్రాంతాల్లో తలదాచుకున్నారు. గ్రామాలకు గ్రామాలు ఖాళీ అయి బిక్కుబిక్కు మంటూ గడిపాయి. పట్టణంలో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. ఇరు పార్టీల నాయకుల ఇళ్ల వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి పట్టణ వాసులు సైతం ఆ ప్రాంతానికి వెళ్లేందుకు వీలు లేకుండా రహదారులనే దిగ్బంధించిన సంఘటనను ఎవ్వరూ మరచిపోలేరు.
పోలీసుల తీరు వివాదాస్పదం
అల్లర్లు, గొడవల కేసుల్లో నిందితులగా ఉండి కనిపించకుండా పోయిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు కొంతమంది ఎన్నికల ఫలితాల అనంతరం కళ్లెదుటే తిరుగుతున్నా పోలీసులు పట్టించుకోకపోవడం వివాదాస్పదంగా మారింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక తమ మాట వినని పోలీసులను బదిలీలు చేయిస్తారని, వీఆర్‌కు పంపుతారేమోనని పోలీసులే టీడీపీ నాయకులను చూసి జంకుతున్నారు.
నిందితులను చూసి కూడా చూడనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ఇదే విషయమై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మీడియా సాక్షిగా చెబుతున్నా పోలీసులు ఏమాత్రమూ స్పందించడం లేదు. గత బుధవారం మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి అనంతపురం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ ఎదుట తలపెట్టిన ధర్నాకు అల్లర్ల కేసుల్లో ఉన్న నిందితులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారన్న విషయం తాడిపత్రిలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment