
సాక్షి, అమరావతి: పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. గ్రేడ్–3 పంచాయతీ కార్యదర్శుల నుంచి ఎంపీడీవోల వరకు పదోన్నతులు దక్కనున్నాయి. ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన 52 డివిజనల్ డెవలప్‌మెంట్ అధికారి పోస్టులతో పాటు జిల్లాల్లో ప్రస్తుతం ఖాళీగా ఉన్న డిప్యూటీ జెడ్పీ సీఈవో పోస్టులలో ఎంపీడీవోలకు పదోన్నతులు కల్పించనున్నారు. ఇందుకోసం సీనియారిటీ జాబితాను రూపొందిస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 128 ఎంపీడీవో పోస్టుల్లో మండల స్థాయిలో పనిచేసే ఈవోపీఆర్‌డీలతో పాటు జెడ్పీ, ఎంపీపీ కార్యాలయాల్లోని అడ్మినిస్ట్రేటివ్ అధికారుల(సూపరిండెంట్‌లు)కు పదోన్నతి కల్పిస్తున్నారు. ప్రస్తుతం 4 జోన్ల పరిధిలో 45 ఈవోపీఆర్‌డీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటికి తోడు కొత్తగా ఈవోపీఆర్‌డీలకు పదోన్నతుల ద్వారా అదనంగా చేరే పోస్టుల్లో గ్రేడ్–1 పంచాయతీ కార్యదర్శులతో పాటు జెడ్పీ, ఎంపీపీ కార్యాలయాల్లో సీనియర్ అసిస్టెంట్లుగా పనిచేసే వారికి పదోన్నతి కల్పించనున్నారు. ఏపీలోని 4 జోన్ల పరిధిలో ఖాళీగా ఉన్న గ్రేడ్–1 పంచాయతీ కార్యదర్శుల పోస్టుల్లోకి గ్రేడ్–2 పంచాయతీ కార్యదర్శులు.. గ్రేడ్–2 పంచాయతీ కార్యదర్శుల పోస్టుల్లోకి గ్రేడ్–3 పంచాయతీ కార్యదర్శులకు ప్రమోషన్ దక్కనుంది.
Comments
Please login to add a commentAdd a comment