ఊరూరా నర్సరీలు | KCR Review Meeting On Panchayati Raj Department | Sakshi
Sakshi News home page

Published Wed, Feb 6 2019 1:43 AM | Last Updated on Wed, Feb 6 2019 4:56 AM

KCR Review Meeting On Panchayati Raj Department - Sakshi

మంగళవారం ప్రగతిభవన్‌లో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధిపై సమీక్షలో మాట్లాడుతున్న సీఎం

సాక్షి, హైదరాబాద్‌: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) నిధులను సంపూర్ణంగా వినియోగించుకొని గ్రామాల్లో తెలంగాణకు హరితహారం, వైకుంఠధామాలు (శ్మశాన వాటికలు) నిర్మించా లని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. నరేగా నిధులతోపాటు రాష్ట్ర బడ్జెట్‌ నిధులు, ఎంపీ, ఎమ్మెల్యేల నియోజకవర్గ అభివృద్ధి నిధులను ఉపయోగించుకొని గ్రామాల్లో అభివృద్ధి చర్యలు చేపట్టాలని సూచించారు. నరేగా పథకం కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఎంత మొత్తంలో నిధులు ఇస్తుందో అంతే మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయిస్తుందని... ఈ నిధులను గ్రామాల అభివృద్ధికి వినియోగించా లన్నారు. గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలోనే నరేగా పనులు జరగాలని, హరితహారం పనులకు మొదటి ప్రాధాన్యం, శ్మశాన వాటికల నిర్మాణానికి రెండో ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం చెప్పారు. నరేగా నిధులు గ్రామాల్లో ప్రజలకు ఉపయోగపడే ఆస్తు లను సృష్టించడానికి ఉపయోగించాలని సూచిం చారు. అన్ని గ్రామ పంచాయతీలకు కచ్చితంగా బీటీ రోడ్డు ఉండేలా రహదారుల వ్యవస్థను నిర్మించాలన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె. జోషి, ఎంపీలు బి. వినోద్‌ కుమార్, బండ ప్రకాశ్, ఎమ్మెల్యేలు డి.ఎస్‌. రెడ్యానాయక్, ఈటల రాజేందర్, బాల్క సుమన్, మాజీ ఎమ్మెల్యే మాలోతు కవిత, పంచాయతీరాజ్‌ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్, కమిషనర్‌ నీతూ ప్రసాద్, అడిషనల్‌ పీసీసీఎఫ్‌ డోబ్రియాల్, సీఎంవో ప్రత్యేక కార్యదర్శులు స్మితా సబర్వాల్, భూపాల్‌రెడ్డి, ఓఎస్డీ ప్రియాంక వర్గీస్‌ పాల్గొన్నారు. 

మొక్కల సంరక్షణ గ్రామ పంచాయతీలదే... 
‘తెలంగాణకు హరితహారంలో భాగంగా రాష్ట్రంలోని మొత్తం 12,751 గ్రామ పంచాయతీల్లో నర్సరీలు ఏర్పాటు చేయాలి. ప్రతి గ్రామంలో మొక్కలు నాటి రక్షించాలి. వాటికి నరేగా నిధులను పూర్తిగా వినియోగించుకోవాలి. గుంతలు తవ్వడానికి, నీళ్లు పోయడానికి, ఇతరత్రా పనులకు ఈ నిధులను వాడాలి. అటవీశాఖ అధికారుల సలహాలు, సాంకేతిక సహకారంతో గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో నర్సరీలు ఏర్పాటు చేయాలి. మొక్కలు పెట్టడం, వాటిని సంరక్షించడం లాంటి బాధ్యతలను గ్రామ పంచాయతీలు చేపట్టాలి. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో కచ్చితంగా ఆరు నెలల్లో వైకుంఠధామాలు నిర్మించాలి. ప్రభుత్వ భూమి లేకుంటే గ్రామ పంచాయతీలు తమ నిధులతో స్థలాలు సమకూర్చాలి లేదా దాతల నుంచి స్వీకరించాలి. నరేగా నిధులతో వైకుంఠధామాలను నిర్మించాలి. మూడు వేలలోపు జనాభాగల 11,412 గ్రామాల్లో ఒకటి చొప్పున... మూడు వేలకుపైగా జనాభా కలిగిన 1,300 గ్రామాల్లో రెండు చొప్పున మొత్తం 14,012 గ్రామాల్లో వైకుంఠధామాలు నిర్మించాలి. గ్రామాలను పరిశుభ్రంగా నిలపడం గ్రామ పంచాయతీల బాధ్యత. శిథిలాలను తొలగించాలి. పాడుపడిన, వాడని బావులను పూడ్చేయాలి. కూలిన ఇళ్ల శిథిలాలు తొలగించాలి. రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలకు కచ్చితంగా బీటీ రోడ్డు ఉండాలని ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంది. కొత్తగా 859 గ్రామాలకు రహదారులను నిర్మించాలి. వీటికోసం వెంటనే ప్రతిపాదనలు తయారు చేసి పనులు ప్రారంభించాలి. నరేగాతోపాటు వివిధ పథకాల కింద సమకూరిన నిధులతో గ్రామాల్లో జరుగుతున్న పనులను అధికారులు తనిఖీ చేయాలి. నిధులు దుర్వినియోగం కావద్దు. ప్రతి పైసా సద్వినియోగం కావాలి. పనులు నామమాత్రంగా చేసి నిధులు కాజేసే పద్ధతి పోవాలి. ప్రస్తుతం గ్రామాల్లో జరుగుతున్న పనులను అధికారులు 20 బృందాలుగా విడిపోయి ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి’అని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.
 
పంచాయతీ పాలనపై నేడు శిక్షణ... 
కొత్త పంచాయతీరాజ్‌ చట్టం, గ్రామాల్లోని పాలన తీరుపై గ్రామ పంచాయతీ నూతన పాలకవర్గాలకు శిక్షణ ఇచ్చే ముఖ్య శిక్షకులకు అవగాహన కార్యక్రమం బుధవారం జరగనుంది. ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్‌లో మొదలయ్యే ఈ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరుకావాలని అన్ని జిల్లాల పంచాయతీ అధికారులను ఆదేశించారు. వారితోపాటు ప్రతి జిల్లా నుంచి 10 మంది ఎంపిక చేసిన అధికారులు పాల్గొననున్నారు. ఈవోపీఆర్‌డీలు, ఎంపీడీవోలు, గ్రామ కార్యదర్శులు, పలువురు కొత్త సర్పంచ్‌లు, తాజా మాజీ సర్పంచ్‌లను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినట్లు పంచాయతీరాజ్‌శాఖ వర్గాలు తెలిపాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement