అబ్రకదబ్ర.. | Panchayat office in the magic | Sakshi
Sakshi News home page

అబ్రకదబ్ర..

Published Mon, Oct 6 2014 2:01 AM | Last Updated on Sat, Sep 2 2017 2:23 PM

అబ్రకదబ్ర..

అబ్రకదబ్ర..

పంచాయతీరాజ్‌లో మాయా ఆఫీస్
- రేగొండలో 4 ఏళ్లుగా తెరుచుకోని పీఆర్‌యూ కార్యాలయం
- కళ్లు మూసుకున్న ఉన్నతాధికారులు
- అప్పనంగా జీతభత్యాల చెల్లింపు

 సాక్షి, హన్మకొండ : పంచాయతీరాజ్ విభాగం అడ్డగోలు వ్యవహారాలకు కేంద్రంగా మారింది. లేని కార్యాలయాలు ఉన్నట్లుగా చూపి మోసాలకు పాల్పడే బోగస్ సంస్థల మాది రిగానే జిల్లా పంచాయతీ రాజ్ అధికారుల వ్యవహారశైలి ఉంది. లేని కార్యాలయం ఉన్నట్లుగా చూపడంతోపాటు అక్కడ ఎనిమిది మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నట్లు ప్రభుత్వానికి భ్రమ కల్పిస్తున్నారు. నమ్మిన పంచాయతీ రాజ్ ఉన్నతాధికారులు... లేని కార్యాల యంలో పనిచేస్తున్న సిబ్బందికి ప్రతినెలా లక్షల రూపాయల మేర జీతభత్యాలను చెల్లించారు. నాలుగేళ్లుగా ఈ తంతు కొనసాగుతున్నా.... ఎవరూ పట్టించుకోకపోవడం విస్మయూన్ని కలిగిస్తోంది. పంచాయతీరాజ్ విభాగంలో పనులు, పరిపాలన అస్తవ్యస్తంగా ఉందనడానికి రేగొండ పీఆర్‌యూ వ్యవహారమే నిదర్శనంగా నిలుస్తోంది.
 
ఒక్క రోజూ తెరుచుకోలేదు...
పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలో సాధారణ పనులు చేపట్టేందుకు పంచాయతీరాజ్ ఇన్‌స్టిట్యూషన్స్ (పీఆర్‌ఐ), భారీ పనులు చేపట్టేందుకు పంచాయతీరాజ్ యూనిట్ (పీఆర్‌యూ) విభాగాలు ఉన్నాయి. రేగొండ కేంద్రంగా 2009లో పీఆర్‌యూ విభాగం మంజూరైంది. ఒక డివిజనల్ ఇంజనీర్, ఇద్దరు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, ఒక్కొక్కరు చొప్పున అసిస్టెంట్ ఇంజనీరు, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్, క్లర్కు, అటెండర్, స్వీపర్... మొత్తం ఎనిమిది మంది రెగ్యులర్ సిబ్బందికి ఈ విభాగంలో విధులు కేటాయించారు. పీఆర్‌యూ కార్యాలయాన్ని రేగొండలో ఉన్న గ్రామీణ నీటి సరఫరా కార్యాలయంలోని ఓ గదిలో 2010లో ప్రారంభించారు. జిల్లా పరిషత్‌లోని పంచాయతీ రాజ్ శాఖ రికార్డుల్లో ఇలాగే పేర్కొన్నారు. అయితే నాలుగేళ్లుగా ఈ కార్యాలయం కేంద్రంగా ఒక్క పని జరిగిన దాఖలాలు లేవు.

అసలు ఇక్కడ ఓ కార్యాలయం ఉందనే విషయం ఎవరికీ తెలియదు. అంతేకాదు... రేగొండ పీఆర్‌యూ కార్యాలయం ఒక్కరోజూ తెరుచుకోలేదు. కనీసం ఆగస్టు 15, జనవరి 26... ఆఖరికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన జూన్ 2న కూడా కార్యాలయానికి ఏ ఒక్క అధికారి, సిబ్బంది రాలేదు. ఈ విభాగాన్ని పర్యవేక్షిస్తున్న జిల్లా అధికారులకు సైతం ఇక్కడో కార్యాలయం ఉందని, అక్కడ పనులేవి జరగడం లేదనే సంగతి తెలియని పరిస్థితి. నాలుగేళ్లలో రేగొండ పీఆర్‌యూ విభాగం నుంచి ఏ పనులు చేపట్టారనే అంశంపై అక్కడ పని చేసే అధికారులు, సిబ్బంది వద్ద ఎలాంటి సమాచారం లేకపోవడం గమనార్హం.
 
గుడ్డిగా ఆమోదం...
ఎవరికీ తెలియకుండా కొనసాగుతున్న ఈ కార్యాలయంలో ఎనిమిది మంది ఉద్యోగులు టంచన్‌గా వేతనాలు పొందుతున్నారు. విధులకు హాజరుకాకుండా... పని చేయకుండా... ఉత్తపుణ్యాన జీతభత్యాలు చెల్లిస్తున్నప్పటికీ, పంచాయతీ రాజ్ ఉన్నతాధికారులు పట్టించుకోక పోవడం ఆశ్చర్యం కలిగించక మానదు. ఇక్కడున్న డివిజనల్ ఇంజనీర్ (డీఈ) కార్యాలయం పనిచేస్తున్నట్లు, ఉద్యోగులు హాజరవుతున్నట్లు పట్టికలో నమోదు చేసి జిల్లా అధికారులకు పంపిస్తూ పక్కదారి పట్టిస్తున్నట్లు సమాచారం.

పర్యవేక్షించాల్సిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు చూసీచూడకుండా ఆమోదిస్తుండడంతో రేగండ్ పీఆర్‌యూ విభాగానికి కేటాయించిన ఉద్యోగులు, సిబ్బందికి నిర్ణీత సమంయలో వేతనాలు అందుతూనే ఉన్నాయి. నాలుగేళ్లలో ఏ ఒక్క జిల్లా అధికారి ఈ కార్యాలయాన్ని సందర్శించ లేదు. అలా జరిగి ఉంటే ఈ విషయం ఎప్పుడో బయటకు వచ్చేది. తమకు ఒకే గది ఉన్నదని, అక్కడికి వెళ్లడం లేదనే విషయాన్ని రేగొండ పీఆర్‌యూ విభాగం అధికారులు ఒక్కసారైనా పై అధికారుల దృష్టికి తేలేదని తెలిసింది. కార్యాలయం సరిపోయేలా ఉంటే రోజు వెళ్లాల్సి ఉంటుందనే ఉద్దేశంతోనే అందరూ కూడబలుక్కుని ఈ తతంగాన్ని కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.
 
కిరాయి ఇవ్వాలని అడిగాం
 ఒకే గదిలో ఎనిమిది మంది సిబ్బంది పని చేయలేక పోతున్నాం. కిరాయి ఇస్తే.. అద్దె భవనంలో కొనసాగుతామని పై అధికారులను అడిగాం. అక్కడి నుంచి సమాధానం రాలేదు. ఇక్కడ పనిచేయడం కష్టంగా ఉంది.
 - ఆత్మారాం, రేగొండ పీఆర్‌యూ డివిజనల్ ఇంజనీర్
 
ఇటీవలే నా దృష్టికి వచ్చింది
రేగొండలోని పీఆర్‌యూ కార్యాలయంలో ఎలాంటి పనులు జరగడం లేదనే అంశం ఇటీవలే నా దృష్టికి వచ్చింది. అద్దె భవనంలో కార్యాకలాపాలు ప్రారంభించాలని ఆదేశించాం. కార్యాలయానికి రాకుండా వేతనాలు తీసుకున్నట్లు తేలితే వారిపై చర్యలు తీసుకుంటాం.
 - సత్తయ్య ,సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement